డీఎమ్మార్సీ నివేదికపైనే మెట్రో రైలు భవిత!
- తిరుపతికి మెట్రో రైలు మంజూరు చేస్తూ సర్కారు ఇప్పటికీ ఉత్తర్వులు జారీచేయని వైనం
- డీఎమ్మార్సీ నివేదిక ఆధారంగానే మెట్రో రైలు మంజూరు చేస్తారంటున్న అధికారులు!
- మెట్రో రైలు వచ్చేస్తోందంటూ అప్పుడే హడావుడి చేస్తూ సొమ్ముచేసుకుంటున్న రియల్టర్లు
ఇదిగో ఈ మార్గంలోనే మెట్రో రైలు వెళ్తుంది.. అదిగో అక్కడే మెట్రో రైల్వే స్టేషన్ నిర్మించేస్తారు.. అప్పుడైతే ధర ఎక్కువ.. ఇప్పుడే కొనండి.. తక్కువ ధరకు ప్లాటు వస్తుంది.. మెట్రో రైలు వచ్చాక అధిక ధరకు అమ్ముకోవచ్చు.. ఇదీ తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో రియల్టర్లు చేస్తున్న హడావుడి. రియల్టర్ల మాటలు నిజమని నమ్మిన అమాయకులు రూ.వేలు పలకని భూములను కూడా రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకూ మెట్రో రైలు వస్తుందా? అనేగా మీ ప్రశ్న. ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అధికారవర్గాలే చెప్పలేకపోతుండటం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పరిసర ప్రాంతాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చూపి ప్రజలను లూటీ చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెట్రో రైలును తిరుపతికి మంజూరు చేస్తూ ప్రభుత్వం కనీసం ఇప్పటిదాకా ఉత్తర్వులు జారీచేయలేదు. ఈనెల 4న సీఎం చంద్రబాబు శాసనసభలో తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు మౌఖికంగా ప్రకటించారంతే..!
తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలను డీఎమ్మార్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) అధ్యయనం చేసి, ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మెట్రో రైలు ప్రాజెక్టు లాభసాటిగా ఉంటుందని డీఎమ్మార్సీ నివేదిక ఇస్తేనే ఆ ప్రాజెక్టును చేపడతారన్నది స్పష్టమవుతోంది. కానీ.. రియల్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలు మాత్రం వాస్తవాన్ని కప్పిపెట్టి దోపిడీకి తెరతీయడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. రాజధాని ఎంపికపై ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి జిల్లాపై ఈనెల 4న చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. ఆ వరాల్లో తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ఒకటి. కానీ.. మెట్రో రైలును తిరుపతికి మంజూరు చేస్తూ ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. కానీ.. విశాఖపట్నంకు మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేస్తూ ఆగస్టు 13న పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 140) జారీచేశారు.
అదే రోజున విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి(వీజీటీఎం) అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేస్తూ పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు(జీవోఎంఎస్ నెం: 141)ను జారీచేశారు. ఇదే రీతిలో తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేస్తూ ఇప్పటిదాకా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం.
వైజాగ్, వీజీటీఎంల్లో డీపీఆర్ గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకరించేందుకు డీఎమ్మార్సీ మాజీ ఎండీ శ్రీధరన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, వీజీటీఎంల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూ పొందించే బాధ్యతను కూడా డీఎమ్మార్సీకే అప్పగిస్తూ ఆగస్టు 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీఎమ్మార్సీ సీఈ నేతృత్వంలోని నిపుణుల కమిటీ డీపీఆర్‌ను రూపొందించి.. ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ డీపీఆర్ ఆధారంగా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు టెండర్లు పిలుస్తారు. కానీ.. డీపీఆర్ తయారీకి సంబంధించిన ఉత్తర్వుల్లో కూడా ఎక్కడా తిరుపతి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
దీన్నిబట్టి చూస్తే తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టడం ఇప్పటికీ ప్రాథమిక దశను కూడా దాటలేదన్నది స్పష్టమవుతోంది. డీఎమ్మార్సీ బృం దంతోనే తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే చేయించి.. లాభసాటిగా ఉంటుందని తేల్చితేనే ఆ ప్రాజెక్టును చేపడతామని ప్రభుత్వమే స్పష్టీకరిస్తోంది. అంటే.. డీఎమ్మార్సీ నివేదికపైనే మెట్రో రైలు భవిత ఆధారపడి ఉందన్నది స్పష్టమవుతోంది.
రియల్టర్ల హడావుడి
వాస్తవాలు ఇలా ఉంటే రియల్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలు మాత్రం తాము చౌకగా కొనుగోలు చేసిన భూములను రియల్ వెంచర్లుగా మార్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు మెట్రో రైలును అస్త్రంగా చేసుకున్నారు.
తిరుపతి మెట్రో రైలును వంద కిలోమీటర్ల పరిధిలో చేపడతారని.. రెండు మెట్రో స్టేషన్లు ఏర్పాటుచేస్తారని.. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్‌కు సమీపంలోనూ మరొకటి శ్రీకాళహస్తిలో నిర్మిస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తొలి దశలో రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, తిరుపతి, అలిపిరి, జూపార్కు, శ్రీని వాసమంగాపురం వరకూ ఓ మార్గం.. తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండు, ఏర్పేడు, శ్రీకాళహస్తి వరకూ మరో మార్గం చేపడతారని మొత్తం వంద కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారని రియల్టర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కానీ.. తొలిదశలో వీజీటీఎం పరిధిలో 49 కి.మీ.లు, విశాఖపట్నంలో 20 కి.మీ.ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతుండడం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉంటే.. వాటిని రియల్టర్లు కప్పిపెడుతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చూపి.. రూ.వేలు కూడా పలకని ప్లాట్లను రూ.లక్షలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు.