మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా | Telangana Minister Malla Reddy Warns Realtor Over Bribe Audio Clip Viral | Sakshi
Sakshi News home page

మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా

Published Tue, Apr 6 2021 4:17 PM | Last Updated on Wed, Apr 7 2021 2:21 AM

Telangana Minister Malla Reddy Warns Realtor Over Bribe Audio Clip Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మహేందర్‌... 50  ఎకరాల వెంచర్‌ నడుస్తోంది... సర్పంచ్‌కిస్తే సరిపోతుందా... పొట్టు పొట్టు చేస్తం.. వాడిని బిచ్చం అడుగుతవా... మంత్రిని కలువు అని’ అంటూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్‌ శివార్లలోని ఓ సర్పంచ్‌ భర్తను బెదిరించినట్టుగా భావిస్తున్న ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తనను కలిసే వరకు వెంచర్‌ ఆపేయాలంటూ మంత్రి చేసినట్టుగా ఉన్న ఆ ఆడియోలోని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మంత్రిపై చర్యలు తీసుకో వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా అసలు ఆ ఆడియోలోని వాయిస్‌ తనది కానేకాదని మల్లారెడ్డి ఖండించారు. ఈ ఆడియో ఉదం తంతో నగర శివార్లలో జరుగుతున్న రియల్‌ వసూళ్ల పర్వం మరోసారి తెరపైకి వచ్చింది. శివార్లలో వెంచర్‌ పడిందంటే చాలు ప్రజా ప్రతినిధులు గద్దల మాదిరి వాలిపోయి సాగి స్తున్న వసూళ్ల దందా  సంచలనం సృష్టిస్తోంది.

ఆదాయ వనరులుగా వెంచర్లు
రాజధాని చుట్టూ స్థిరాస్తి రంగం ఊపందుకుని రెండు దశాబ్దాలు కావస్తోంది. గత 20 ఏండ్లుగా శివారు భూములపై లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ క్రమంలో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న వెంచర్లు ప్రజా ప్రతినిధులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. చోటా నేతల నుంచి బడా లీడర్ల వరకు ఇదే దందా సాగిస్తున్నారు. ఇందులో వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, మంత్రులు సైతం ఉంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

‘లైన్‌’లోకి వస్తే సరే.. లేదంటే
వెంచర్లు వెలియగానే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. రియల్టర్లపై సాగించే బెదిరింపుల పర్వం అంతా ఇంతా కాదు.  లేఅవుట్‌ పడగానే సదరు సంస్థ లేదా డెవలపర్‌ను ‘లైన్‌’లోకి తీసుకుంటారు. అంతా సవ్యంగా సాగి తాము అనుకున్నది ముడితే ఓకే... లేదంటే ఆ డెవలపర్‌కు చుక్కలు కనబడాల్సిందే. భూమి అమ్ముకోలేని పరిస్థితుల్లో అడిగినంత సమర్పించుకుంటే కానీ అడుగు ముందుకు పడదు.  

సదరు నేత స్థాయిని బట్టి..
వెంచర్‌ను బట్టి, సదరు ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి రియల్‌ వసూళ్లు చేతులు మారుతుంటాయి. కనీసం రూ.10వేల నుంచి మొదలయ్యే ఈ తతంగం కొన్నిసార్లు ‘కోట్లు’ దాటుతాయి. లేఅవుట్‌ వేసిన భూమిలో ఏవైనా లోపాలుంటే వాటిని ఎత్తిచూపుతూ బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కూడా కొందరు వెనుకాడడం లేదనే ఆరోపణలున్నాయి. వారు అడిగినంత ఇస్తే ఏ లోపం ఉన్నా, నిబంధనలేవీ పట్టించుకోక పోయినా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడరు. లేదంటే కష్టాలు తప్పవని స్థిరాస్తిరంగ వ్యాపారి ఒకరు వాపోయారు. 

అనుమతులకు అదనం
ప్రజాప్రతినిధుల దందాకు తోడు వెంచర్‌ నిర్వాహకులకు అధికారిక అనుమతులు కూడా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటే సదరు వెంచర్‌ను నిర్దేశిత రుసుముతో అనుమతించాలి. నిబంధనల ప్రకారం లేని దరఖాస్తును తిరస్కరించాలి. కానీ స్థానిక సంస్థలైనా, స్వయం ప్రతిపత్తిగల సంస్థలైనా.. అందులో పనిచేసే అధికారులు, సిబ్బంది రియల్‌ డబ్బులకు ఆశ పడుతున్నారు. నిబంధనల మేరకు ఉన్నా, లేకపోయినా వారికి సంబంధం లేదు. వారి వాటా వారికి ముట్టాల్సిందే. అడిగింది ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో అనుమతుల జారీలో జాప్యం చేస్తారనే భయంతో వెంచర్‌ నిర్వాహకులు కూడా ముందే ముట్టజెప్పేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్‌లను కూడా పురపాలికల సిబ్బంది, పాలకవర్గం వదలడం లేదనే ఆరోపణలున్నాయి. సిండికేట్‌గా మారి అన్ని అనుమతులున్న లేఅవుట్లలోనూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు.

‘తూముకుంట మునిసిపాలిటీ పరిధిలో సర్వే నంబర్‌ 333 పార్ట్, 361 పార్ట్‌ గల భూమిలో 4 ఎకరాల 28 గుంటలలో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకొని లేఅవుట్‌ వేశారు. హెచ్‌ఎండీఏ నుంచి ఫైనల్‌ లేఅవుట్‌ కూడా వచ్చింది. అయితే మున్సిపాలిటీకి ఒక శాతం ఇంపాక్ట్‌ ఫీజు కడదామని వెళితే తీసుకోవట్లేదు. లక్షల్లో ఇస్తేగానీ చేసేదే లేదని తెగేసి చెప్పారు. వినకపోతే మీ లేవుట్‌లో అభివృద్ధి సరిగా లేదని, రోడ్లు బాగాలేకున్నా...ఎలా అనుమతి ఇచ్చారంటూ హెచ్‌ఎండీఏకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారు. ఓవైపు హెచ్‌ఎండీఏకు రూ.70 లక్షల ఫీజు కట్టి అనుమతి తెచ్చుకుంటే...వీళ్లేమో ఫిర్యాదు చేస్తామంటూ వ్యాపారానికి అడ్డంకిగా మారుతున్నారు. ఇలాచేసి అధికారిక లేఅవుట్‌ అనుమతులు తీసుకునే బదులు, అనధికారికంగా లేఅవుట్‌ చేసి స్థానిక సంస్థలకు రూ.20 లక్షలు ముట్టచెబితే మా వ్యాపారం సజావుగా సాగేలా ఉంది..’ అని రియల్టర్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

నష్టపోయేది ప్రజలే..
రియల్టర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రభుత్వ సిబ్బంది... ఇలా ఎవరి చేతుల నుంచి ఇంకెవరి చేతుల్లోకి డబ్బులు వెళ్లినా ఆ భారమంతా చివరకు సాధారణ ప్రజలే మోయాల్సి వస్తోంది. వెంచర్‌ వేసే స్థలం కొనుగోలుకు అదనంగా గజానికి రూ.250 ఖర్చు పెడితే డెవలప్‌ చేసి కొనుగోలుదారులకు అమ్మవచ్చు కానీ, తాము కొన్న దానికంటే రెండింతలు అదనంగా ధర నిర్ణయించి రియల్‌ వ్యాపారులు సదరు స్థలాలను ప్రజలకు అంటగడుతుండటం గమనార్హం.

ఇదీ సంభాషణ
మల్లారెడ్డి: హలో మహేందర్‌
మహేందర్‌ (బొమ్మరాసిపేట్‌ సర్పంచ్‌ భర్త): సార్‌ నమస్కారం సార్‌
మల్లారెడ్డి: 50 ఎకరాల వెంచర్‌ నడుస్తోంది, సర్పంచ్‌కు ఇస్తే సరిపోతదా, కలెక్టర్‌కు జెప్పి వాడిని పొట్టుపొట్టు జేస్తా
మహేందర్‌: సార్‌ సార్‌ మాకు ఇంతవరకూ కలవలేడు సార్, నేను పోయిన సార్,  వెంచర్‌ అతను కలవలేదు.
మల్లారెడ్డి: వాడ్ని పట్టుకరర్రి వయా, మీకు కలిసేదేంది. ఈడ ఎమ్మెల్యే ఉన్నడు, మంత్రి ఉన్నడు.
మహేందర్‌: అవును సార్, మొన్న పోయిన సార్‌ అతను కలువలేడు
మల్లారెడ్డి: వాడు ఎవడాడు, వాడు కలుసుడేంది.. వాణ్ణి బిచ్చం అడుగుతవా.. మంత్రిని కలువు, వాడ్ని కలువు అని. హాస్పిటల్‌ అని, స్కూల్‌ అని దేనికో ఇవ్వాలెగా. లేకుంటే పొట్టుపొట్టు చేసి ఇడిశిపెడ్తం.
మహేందర్‌: సార్‌ సార్‌ నేను తప్పకుండా తీసుకొని వస్త సార్‌.
మల్లారెడ్డి: ఎప్పుడు తెస్తవ్‌.
మహేందర్‌: అతనికి యాక్సిడెంట్‌ అయిందంట సార్, హాస్పిటల్‌లో ఉన్నడు సార్‌.
మల్లారెడ్డి: వాడు రాడు. వచ్చేదాకా వెంచర్‌ పనులు ఆపేసేయ్‌ మను.
మహేందర్‌: ఓకే సార్‌.

నిరూపిస్తే రాజీనామా చేస్తా 
ఆ ఆడియో టేపులో ఉన్నది నా వాయిస్‌ కాదు. నా గొంతును వేరొకరు అనుకరించారు (మిమిక్రీ). ప్రస్తుతం నగరంలో మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఎవరినీ బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. ఈ వెంచరే కాదు, ఏ వెంచర్ల వద్ద నుంచి నేను ఒక రూపాయి కూడా అడగలేదు. తీసుకోలేదు. ఎవ్వరైనా ఇచ్చినట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నాకే వందల ఎకరాల భూములు ఉన్నాయి. సరిపడా డబ్బులు ఉన్నాయి. వేరేవాళ్ల భూములు, డబ్బులు నాకు అవసరం లేదు. వాయిస్‌ రికార్డుపై దేనికైనా సిద్ధమే. దీనిపై విచారణకు ఆదేశిస్తాం. ప్రజలకు సేవ చేయటానికి నేను రాజకీయాల్లోకి వచ్చా. విద్యాసంస్థలు పెట్టి విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేస్తున్నా. ప్లేస్‌మెంట్‌లు నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నా.     – చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి 

  

చదవండి: శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement