సాక్షి, రాజమహేంద్రవరం: సేవ ముసుగులో కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడ వేశాడు ఓ గ్రామంలో పెద‘రాయుడు’. టీడీపీలో చక్రం తిప్పే ఆయన రియల్టర్ కూడా. సంపదను పెంచుకునే ముసుగులో ప్రజల కోసం ఉదారంగా భూమి రాసి ఇచ్చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. రాయవరం మండలంలో తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై నడిపించే నాయకుడికి హఠాత్తుగా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన వచ్చిందట. అనుకున్నదే తడవుగా తనకున్న విలువైన భూమిలో మూడు కుంచాల భూమి రాసిచ్చేస్తానని ముందుకు వచ్చాడు. ఇందుకోసం మండల స్థాయిలో అధికారులకు వల వేసి తన ‘లే అవుట్’కు మార్గం సుగమం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. టీడీపీ నేతకు ఇంత ఔదార్యం ఎందుకు వచ్చిందా అని జనం ఆరా తీయగా దీని వెనుక దాగి ఉన్న పచ్చ నేత స్వార్థం బహిర్గతమై జనం విస్మయానికి గురవుతున్నారు. ఆ కథా కమామీషు ఏమిటో ఒకసారి చూద్దాం.
దానం ఇచ్చిన భూమిలో...
రాయవరంలో ప్రభుత్వ భవనాలకు దివంగత రాయవరం మునసబు సుమారు మూడు ఎకరాలు ఏనాడో దానం చేశారు. ఆ భూమిలో పోలీస్‌స్టేషన్, తహసీల్దారు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, వెలుగు, ఉపాధి హామీ, మండల విద్యాశాఖ, హౌసింగ్, సబ్ ట్రెజరీ...ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాల నుంచి 40 అడుగుల రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఆ నాయకుడు ముందుకు వచ్చాడు. ఆ రోడ్డును ఆమోదిస్తే ఆ నాయకుడు వేస్తున్న వెంచర్ ధర అమాంతం పెరిగిపోతుంది.
రాయవరం మెయిన్ రోడ్డు నుంచి కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఏర్పాటుకు నిర్దేశించిన స్థలం
సోమేశ్వరం–రాజానగరం రోడ్డును ఆనుకుని దివంగత రాయవరం మునసుబు దానం చేసిన స్థలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల వెనుక టీడీపీ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. సుమారు 16 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంతా ప్లాన్ చేసిన ఆ వెంచర్‌కు సరైన మార్గం లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలు పలుకుతోంది. అదే రోడ్డు ఏర్పాటైతే ఒక్కసారిగా ఎకరం రూ.3 కోట్లు అయిపోతుంది. ఆ నాయకుడు వేయతలపెట్టిన వెంచర్ కోసం పంట పొలాల్లోకి సుమారు 100 మీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పుతో ప్రభుత్వ భూముల్లో నుంచి రోడ్డును వేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్న జాగాలో రహదారి ఇచ్చినందుకు ప్రతిగా ఆ నాయకుడు 20 సెంట్ల భూమి ఇవ్వడానికి అధికారులు, అనధికారులతో రహస్య ఒప్పందాన్ని చేసుకున్నారు.
ఇదేమిటంటూ స్థానికుల ఆగ్రహం
ఆ నాయకుడు చెప్పినట్టుగా తలాడిస్తున్న కొందరు అధికారులు, అనధికారులు ఆ స్థలంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయవరం సచివాలయం–2ను మార్చేసే ఆలోచన చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఈ సచివాలయ నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లి సుభా‹Ùచంద్రబోస్ ఈ ఏడాది జనవరి 12న భూమిపూజ కూడా చేయడం గమనార్హం. ఒక్క గ్రామ సచివాలయమే కాదు రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నుంచి ప్రధాన రహదారికి 40 అడుగుల రోడ్డును వేస్తే ఆ నేతకు చెందిన పొలం విలువ ప్రస్తుతం ఉన్న విలువకు మూడు, నాలుగు రెట్లు అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది.
తన భూమిని రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి 20 సెంట్ల ఇవ్వజూపి, ప్రభుత్వ స్థలంతో 40 అడుగుల రోడ్డు వేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఎకరం రూ.3 కోట్లు పైనే పలుకుతుంది. అంటే ప్రతి ఎకరాకు రూ.2 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి రోడ్డు వేస్తే గనక ఆ పెదరాయుడికి అదనంగా వచ్చి పడే మొత్తం సొమ్ము రూ.32 కోట్లుగా లెక్క లేస్తున్నారు. ఇంత అదనపు రాబడి వస్తుండటంతోనే తెర వెనుక జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ అధికారులకు 5 శాతం (కోటిన్నర) ముట్టజెప్పే ఒప్పందం కుదిరిందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
ఎప్పుడో ఏళ్ల కిందట దాత ఎంతో ఔదార్యంతో ఇచ్చిన భూమిని ఎలా కేటాయిస్తారని పలువురు ప్రశి్నస్తున్నారు. ఈ ప్రతిపాదన చర్చకు రావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు ఈ ప్రతిపాదన ఎలా వచ్చింది? ప్రతిపాదనకు ఎవరు మద్దతిస్తున్నారు? తెరవెనుక రాజకీయం ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. టీడీపీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారులు, నాయకులు ఎలా సహకరిస్తారంటున్నారు. లక్షలు చేతులు మారాకనే ఇందుకు అధికారులు తలాడించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
40 అడుగుల రోడ్డే ఎందుకు?
టీడీపీ నేతకు చెందిన పొలాల్లోకి వెళ్లేందుకు చిన్న చిన్న రహదారులున్నాయి. 40 అడుగుల రహదారి అందుబాటులో లేదు. మండల పరిషత్ స్థలం నుంచి 40 అడుగుల రోడ్డు కోసం ఇస్తే.. భవిష్యత్తులో రియల్ బూమ్‌తో కోట్లు కొల్లగొట్టాలనేది ఆలోచనగా కనిపిస్తోంది. ఆ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చుకుంటే టౌన్ ప్లానింగ్ అనుమతులకు ఎటువంటి ఆటంకాలు ఉండవనేది వారి ఎత్తుడగ. ప్రస్తుతం సచివాలయం–2, ఆర్‌బీకే, వెల్‌నెస్ సెంటర్ ఇక్కడే నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణ పనుల్లో బల్క్‌మిల్క్ సెంటర్ షెడ్డును కూడా ఇటీవలే కూల్చేశారు. ఇక్కడ సచివాలయం–2 భవన నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఈ కొత్త ప్రతిపాదన ఎందుకు..ఎవరు తీసుకు వచ్చారని గ్రామస్తులు ప్రశి్నస్తున్నారు. దాత ఇచ్చిన భూమిని ఇలా ఇతరుల ప్రయోజనాలకు ధారాదత్తం చేయడం పట్ల గ్రామంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
మా దృష్టికీ వచ్చింది
రాయవరంలో లే అవుట్ రోడ్డు కోసం ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఎవరున్నా చర్యలు తప్పవు. అన్ని అంశాలూ సమగ్రంగా విచారిస్తున్నాం. ఇందుకోసం రెవెన్యూ డివిజన్ స్థాయిలో విచారణ జరిపిస్తా.
– జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment