సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీఆర్‌డీఏ పరిధిలోని రియల్టర్లకు కొత్త కష్టం వచ్చింది. గ్రామ కంఠానికి అర కిలోమీటరు దూరం దాటిన లేఅవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించింది. రూ.70 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు వ్యాపారం నిలిచిపోయింది. పది రోజుల క్రితం వచ్చిన ఈ ఆదేశాలు అమలులోకి రావడంతో వందకుపైగా లేఅవుట్ల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో రియల్టర్లు సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఒత్తిడి తెస్తున్నారు.
రాజధాని పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాల్లోని నివేశన స్థలాల గుర్తింపు ప్రక్రియ రెండు నెలల నుంచి కొనసాగుతోంది. గ్రామకంఠం పరిధిలో నివాస గృహాలు, నివేశన స్థలాలు ఉంటే వాటిని వదిలివేస్తూ, ఆ పరిధి దాటిన వాటికి భూ సమీకరణ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. మొత్తం 29 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాటిలో ఇంకా అనేక గ్రామాల్లోని గ్రామ కంఠాలను గుర్తించాల్సి ఉంది.
రూ.80 లక్షల నుంచి రెండు కోట్లకు పెరిగిన ఎకరా ధర... ఈ నేపథ్యంలోనే కొందరు రియల్టర్లు గ్రామ కంఠంకు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూము లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రాజధాని గ్రామాలకు సమీపంలో సీఆర్‌డీఏ అనుమతితో వెంచర్ వేస్తే, ఆ స్థలాలకు మంచి ధర వస్తుందనే భావనతో ఈ భూములను కొనుగోలు చేశారు. ప్రారంభంలో ఎకరా రూ.80 లక్షలు ఉంటే రియల్టర్లు ప్రవేశించిన తరువాత వాటి ధర రూ. 2 కోట్ల వరకు పెరిగింది. గ్రామ కంఠానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు ఐదారు వందల ఎకరాల వ్యవసాయ భూములను రియల్టర్లు కొనుగోలు చేశారు. వారిలో కొంత మంది హడావుడిగా వెంచర్ వేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు.
భూముల ధరలు తగ్గుతాయని ఆందోళన..
వ్యవసాయ భూములను నివేశన స్థలాలుగా మార్పు చేయాలని కోరుతూ ‘నాలా’ చార్జీలను చెల్లించారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ నిబంధనపై రియల్టర్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. రోజుకో కొత్త నిబంధన, కొత్త ప్రకటన చేస్తూ తమ ప్రాణాలు తీస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి బాగుంటుం దని భావించామని, అయితే ఈ నిబంధన పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలోనూ రాజధాని పరిధిలోని స్థలాల రిజిస్ట్రేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా నిలిపివేసిందని, దీని వల్ల అనేక మంది రియల్టర్లు భారీగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. తాజా నిబంధన కారణంగా గ్రామ కంఠానికి అర కిలోమీటరుదూరంలోని స్థలాల లేఅవుట్‌లకు అనుమతి లేకపోతే ఆ భూముల ధరలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రియల్టర్లకు కష్టం...
Published Tue, May 19 2015 4:24 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement