సోమకేశవులు నివాసం వద్ద గుమిగూడిన జనం
సాక్షి, నల్లగొండ క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్ మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీ సులు, కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రంపోడు మండలంలోని తేరటిగూడెం గ్రామానికి చెందిన సోమకేశవులు(36), 20ఏళ్ల క్రితం పట్టణంలోని గంధంవారిగూడెం రోడ్డులోని చైతన్యపురి కాలనీలో స్థిరపడ్డాడు. ఫైనాన్స్, రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
సోమకేశవులు, భార్య స్వాతి ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం రాత్రి 10.30 గంటల వరకు ఒకే గదిలో నిద్రించారు. 11గంటలకు సిగరెట్ తాగేందుకు వరండాలోకి వచ్చాడు. తెల్లవారుజామున 3:30 గంటలకు కుమారుడు మంచినీళ్లు కావాలని అడగడంతో స్వాతి గది బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. డోర్ గడియ పెట్టి ఉండడంతో భర్తకు ఫోన్ చేసింది. అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఎదురింటి వారికి ఫోన్ చేసింది. వారు వచ్చి చూడగా వరండాలో సోమకేశవులు విగతజీవుడిగా పడి ఉండడంతో పోలీసుల కు సమాచారం ఇచ్చారు. సీఐ సురేశ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
పక్కా ప్లాన్ ప్రకరమే హత్య చేశారా..?
సోమకేశవులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఫైనాన్స్ వ్యవహారాల్లో రూ.25లక్షల లావాదేవీల విషయంలో కోర్టు కేసులు సాగుతున్నాయి. నెల రోజుల క్రితం పోల యాదయ్యకు రూ.10లక్షలు ఇవ్వగా రూ.5లక్షలు తిరిగి ఇచ్చినట్లు చెప్తున్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపార భాగస్వామితో ఆర్థిక పరమైన గొడవలేమీ లేవని చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరులో అనుమానాస్పదంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. నివాసంలోనే ప్లాన్ ప్రకారం ఊపిరి ఆడకుండా హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
పోలీసుల దృష్టి మళ్లించేందుకు మృతదేహం పక్కన కారం చల్లినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకా..? ప్రొఫెషనల్ కిల్లర్స్‌తో హత్య చేశారా..? అన్న విషయమై ఎటూ తేలకుండా ఉండేందుకే కారం చల్లడం, వంటిపై గాయాలు లేకుండా హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముక్కుల్లో నుంచి కొంత రక్తం ఘటనా స్థలం వద్ద ఉంది. హత్యలో కేశవులుకు సంబంధించిన వారి పాత్ర ఏమైనా ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు ఆధారాలు సేకరించారు. కొన్ని రోజులుగా కేశవులు ఎవరితో మాట్లాడారు.. అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment