
ఆందోళన చేస్తున్న బాధితులు
హైదరాబాద్: రియల్టర్ వేధింపులను భరించలేక రంగారెడ్డి జిల్లా గండిపేటకు సమీపంలోని లెజెండ్ చైమ్స్ వెంచర్ నివాసితులు ఆదివారం ఆందోళనకు దిగారు. రియల్టర్ కొనుగోలు సమయంలో చెప్పిన సౌకర్యాలేమీ పూర్తి చేయకపోగా.. బౌన్సర్లతో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కోకాపేట రెవెన్యూ పరిధిలోని గండిపేటకు సమీపంలో లెజెండ్ చైమ్స్ వెంచర్‌లో ఆరేళ్ల క్రితం 135 మంది ఎన్‌ఆర్‌ఐలు విల్లాలను కొనుగోలు చేశారు.
ఒప్పంద సమయంలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సకాలంలో పూర్తి చేస్తానన్న బిల్డర్.. వాటి విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. సెక్యూరిటీని పూర్తిగా తగ్గించడంతో నివాసితులే వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏకు మార్టగేజ్ చేసిన విల్లాలను అమ్ముకోవడంతో పాటు పార్కు, ఖాళీగా ఉంచాల్సిన స్థలాల్లో భవనాలను నిర్మిస్తున్నారు. వారం నుంచి స్విమ్మింగ్ పూల్‌కు సైతం తాళాలు వేసుకుని, దాన్ని వినియోగించలేని పరిస్థితి కల్పించారు. దీంతో బాధి తులంతా ఆదివారం విషయం తేల్చాల్సిందేనని నిర్ణయించి, సమావేశం ఏర్పాటు చేసి రియల్టర్ నాగేశ్వర్‌రావును పిలిచారు. చట్టపరంగా చర్యలకు ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మూడు గంటల పాటు ఆందోళన చేశారు. మరో పది రోజుల్లో సమస్యలను తీరుస్తానని రియల్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అన్నీ మేమే చూసుకుంటున్నాం
కోట్ల రూపాయలు పెట్టి విల్లాలను కొంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను మేమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్డర్ స్విమ్మింగ్ పూల్‌కు తాళాలు వేయడం, క్లబ్‌హౌస్‌ను పూర్తి చేయకపోవడం, సెక్యూరిటీని తగ్గించటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇలాంటి బిల్డర్లపై కఠినంగా వ్యవహరించాలి.
– జ్యోతి, నివాసితురాలు
మేమే పూర్తి చేసుకున్నాం
బిల్డర్ సకాలంలో విల్లాను పూర్తి చేయలేదు. దీంతో మా డబ్బులను అదనంగా ఖర్చుపెట్టి పూర్తి చేసుకున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.
– రవిరెడ్డి, నివాసితుడు
Comments
Please login to add a commentAdd a comment