ఎక్విజిషన్ భూములపై రియల్టర్ కన్ను! | realtor looks stay on Acquisition lands! | Sakshi
Sakshi News home page

ఎక్విజిషన్ భూములపై రియల్టర్ కన్ను!

Published Mon, Dec 1 2014 8:59 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

ఎక్విజిషన్ భూములపై రియల్టర్ కన్ను! - Sakshi

ఎక్విజిషన్ భూములపై రియల్టర్ కన్ను!

కాకినాడ: విద్యాకేంద్రంగా భాసిల్లుతున్న కాకినాడ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు వెంచర్లు, ఆరు ప్లాట్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు, వివిధ భారీ పరిశ్రమలు ఉండడంతో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రైల్వే, రోడ్లు మార్గాలకు అనుసంధానంగా ఉండడం, బీచ్‌పార్కు, త్వరలో పర్యాటక ప్రాజెక్టు వస్తుందన్న నేపథ్యంలో భూ ముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేసి విరమణ పొందిన ఉద్యోగులు ఇక్కడ ఉండటానికే మొగ్గుచూపడంతో టీచర్స్, పోస్టల్, రెవెన్యూ, డాక్టర్లు, పోలీసు, బ్యాంకు అధికారులు ఇలా ప్రత్యేకంగా కాలనీలు సైతం వెలిశాయి. ఓ 100 గజాలు కొనుగోలు చేసుకోని సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే కొనుగోలు దారులను రియల్టర్లు మోసం చేస్తున్నారు.
 
 
 ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానాలు, విందులు ఏర్పాటు చేస్తూ వారిని మచ్చిక చేసుకుని, ప్రభుత్వం పేదల కోసం ఎక్విజిషన్ చేసిన భూములను సైతం కబ్జా చేసేందుకు రియల్టర్లు తెగబడుతున్నారు. ఈ కోవకు చెందినదే కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని 55.31 ఎకరాలు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఫేజ్-2లో భాగంగా ఈ భూమిని సేకరించారు. సర్పవరం సర్వే నంబర్లు 130/16 నుంచి 130/35 వరకు, 184/1 నుంచి 184/22 సర్వేనంబర్లలో ఉన్న 55.31 ఎకరాల భూమిని పేదల ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఫేజ్-2 కింద సేకరిస్తున్నట్టు 915/2007 కింద జిల్లా అధికారులు గెజిట్ పబ్లికేషన్ చేశారు కూడా. అనంతరం రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎకరా ఒక్కింటికి అప్పటి మార్కెట్ రేటుతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరగా రూ.29 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం కుర్చుకుందని చెబుతున్నారు. ఈ భూములను ప్రభుత్వం తీసుకోదు, ఎక్విజిషన్ తొలగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ రియల్టర్ ఈ భూములపై కన్నేశాడు. కారుచౌకగా భూములను కొట్టేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. కొందరు పేద రైతులను సేకరించి ప్రభుత్వం ఇస్తానన్న రూ.29 లక్షలు ఇస్తాను, రైతులు ఒప్పుకుంటే ప్రభుత్వం భూములపై ఉంచిన ఎక్విజిషన్ తానే తీయించుకుంటానంటూ చెప్పి రూ. 3 లక్షల వంతున అడ్వాన్సు ఇచ్చాడు. నాలుగేళ్ల క్రితమే ఈ ఒప్పందం చేసుకున్న రియల్టర్ తాను రైతుల నుంచి చేసుకున్న అగ్రిమెంటు ఒప్పందం చెల్లదని తేలిపోవడంతో గతంలో ఇచ్చిన సొమ్ముకు మిగిలిన ఒప్పందం సొమ్ము చెల్లిస్తానని, వచ్చి భూములను స్వాధీనం చేయాలని బెదిరింపులకు దిగుతున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో చేసుకున్న అగ్రిమెంటు ఒప్పందం చనిపోయిందని, ఇప్పుడు తాము భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు.
 
 ఇప్పుడు ఎకరం రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్లు పైబడి పలుకుతున్నందున పేదల ఇళ్లకు అవసరమైన పక్షంలో ప్రభుత్వం తమ భూములకు అప్పుడు ఇస్తానని సొమ్ములకు మూడు రెట్లు ఇస్తే తాము భూములను స్వాధీనం చేస్తామని రైతులు చెబుతున్నారు. రియల్టర్‌కు భూములు ఇవ్వనని చెప్పడంతో రాజకీయ వత్తిళ్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయాలని లేని పక్షంలో భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు అండగా రియల్టర్ ఆగడాలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే కొద్దో, గొప్పో ఇచ్చి నోరు మూయిస్తున్నారంటున్నారు. రియల్టర్ పెడుతున్న బాధలను తట్టుకోలేక జిల్లా ఉన్నతాధికారులను కలసి భూమిపై ఉన్న ఎక్విజిషన్ ఎత్తివేయాలని లేదా ప్రభుత్వ రేటుకు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి భూములు తీసుకోవాలని, రియల్టర్ నుంచి వస్తున్న రాజకీయ వత్తిళ్లు నిరోధించాలని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించనున్నట్టు రైతులు పుల్లా రామచంద్రరావు, చిక్కాల చక్రరావు, చిక్కాల వీరభద్రరావు, నిమ్మన భవన్నారాయణ తదితరులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement