
మహబూబ్‌నగర్ క్రైం: అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతున్నాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిరాతకంగా హత్య చేశారు. మొదట కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత చనిపోలేదని భావించి కత్తులతో గొంతుకోశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంటకి చెందిన నరహరి (40), అతడి భార్య అరుణ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. జిల్లా కేంద్రంలోని వైష్ణవిదేవి కాలనీలో నివాసం ఉంటున్నారు. నరహరి చిన్న చింతకుంట మండలం ఉంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన జగదీశ్ కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని సద్దల గుండు చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటూ.. మహబూబ్‌నగర్‌లో ‘వండర్ లైఫ్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల నుంచి జగదీశ్‌తో నరహరికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం అవసరం ఉందని నరహరి దగ్గర దశల వారీగా జగదీశ్ దాదాపు రూ.కోటి వరకు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 నెలల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని జగదీశ్‌ను పలుమార్లు నరహరి అడుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి జగదీశ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన నరహరి.. అర్ధరాత్రి వరకు అక్కడే డబ్బుల విషయంలో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిరోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో నరహరి అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత అక్కడి నుంచి బైక్‌పై తన ఇంటికి బయల్దేరాడు. అయితే షాషాబ్‌గుట్ట నుంచి భగీరథ కాలనీ వైపు వస్తుండగా.. మార్గమధ్యలో పసుల కిష్టారెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలో టీఎస్ 06 ఈఎస్ 3618 నంబర్ కలిగిన కారుతో వెనుక నుంచి నరహరి బైక్‌ను గుర్తు తెలియని దుండగులు ఢీకొట్టారు. కిందపడిపోన నరహరి చనిపోలేదని భావించిన దుండగులు కత్తులతో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం వారు ఉపయోగించిన కారును సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. మృతుడి భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు.