chittem Rammohan Reddy
-
కారుతో ఢీకొట్టి.. ఆపై గొంతు కోసి టీచర్ హత్య
మహబూబ్‌నగర్ క్రైం: అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతున్నాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిరాతకంగా హత్య చేశారు. మొదట కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత చనిపోలేదని భావించి కత్తులతో గొంతుకోశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంటకి చెందిన నరహరి (40), అతడి భార్య అరుణ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. జిల్లా కేంద్రంలోని వైష్ణవిదేవి కాలనీలో నివాసం ఉంటున్నారు. నరహరి చిన్న చింతకుంట మండలం ఉంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన జగదీశ్ కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని సద్దల గుండు చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటూ.. మహబూబ్‌నగర్‌లో ‘వండర్ లైఫ్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల నుంచి జగదీశ్‌తో నరహరికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం అవసరం ఉందని నరహరి దగ్గర దశల వారీగా జగదీశ్ దాదాపు రూ.కోటి వరకు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 నెలల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని జగదీశ్‌ను పలుమార్లు నరహరి అడుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి జగదీశ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన నరహరి.. అర్ధరాత్రి వరకు అక్కడే డబ్బుల విషయంలో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిరోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో నరహరి అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత అక్కడి నుంచి బైక్‌పై తన ఇంటికి బయల్దేరాడు. అయితే షాషాబ్‌గుట్ట నుంచి భగీరథ కాలనీ వైపు వస్తుండగా.. మార్గమధ్యలో పసుల కిష్టారెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలో టీఎస్ 06 ఈఎస్ 3618 నంబర్ కలిగిన కారుతో వెనుక నుంచి నరహరి బైక్‌ను గుర్తు తెలియని దుండగులు ఢీకొట్టారు. కిందపడిపోన నరహరి చనిపోలేదని భావించిన దుండగులు కత్తులతో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం వారు ఉపయోగించిన కారును సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. మృతుడి భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. -
జురాలకు పోటెత్తిన వరద నీరు
సాక్షి, మహబూబ్‌నగర్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగు కురుస్తున భారీ వర్షాలకు జురాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 50 గేట్లను అధికారులు ఎత్తి వేశారు. దీంతో కృష్ణానది నీరు పరవళ్ళు తొక్కుతుంది. కృష్ణానదికి ఇన్ ఫ్లో 5లక్షల 5వేల క్యూసెక్కులు కాగా.. దిగువున 5 లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.73 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9: 657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.08 టీఎంసీలుగా ఉంది. (చదవండి: భారీ వరదలు: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం) దీంతో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుండటంతో సమీప మండలంలోని వాసునగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అధికారులు నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తంగిడి వద్ద కృష్ణ బీమా నదుల సంగమం వద్ద ఉన్న భీమేశ్వర ఆలయం చుట్టూ నీళ్లు నిలవడంతో అధికారులు కృష్ణ నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం) -
అభివృద్ధి వైపు అడుగులు
సాక్షి, మక్తల్: ఒకప్పుడు వీధుల్లో వర్షం వస్తే చాలు గుంతలుమయంగా, రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి పందు లు సంచరిస్తూండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారుమారై అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది మక్తల్ పట్టణం. నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డి ప్రతేక్యంగా చొరవ తీసుకొని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారు. గతేడాది ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అధికారుల పర్యవేక్షణలో గడుపులోపే పనులు చేయాలని ఆదేశాలు ఉండటంతో త్వరతిగతిన పనులు చేయించా రు. పట్టణంలో 5 ఎంపీటీసీ పరిధిలోని 18 వార్డు లో పనులు పూర్తిచేశారు. అదేవిధంగా మిగతా కాలనీల్లో సైతం నిధులు మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధిలో కుంటుపడిన ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిల్లో మక్తల్‌కు ప్రా ధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇవే కాకుండ మం డంలోని గ్రామాలకు రూ.3కోట్ల నిధులు మంజూ రు చేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగాయి. -
నిండు సభలో ఎమ్మెల్యేకు చెంపదెబ్బ
అధికారపార్టీ శాసనసభ్యుడి చర్య రణరంగంగా మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల దూషణల పర్వం.. చిట్టెంపై చేయి చేసుకున్న గువ్వల సభలో బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చూస్తూ ఊరుకోబోం: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేడు జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పిలుపు.. మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రణరంగమైంది! అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ముష్టిఘాతాలు, వాగ్వాదాలతో అట్టుడికింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు నిండు సభలో దాడికి పాల్పడ్డారు. తన ప్రసంగానికి అడ్డు తగులుతున్నారంటూ ఆవేశంతో ఊగిపోతూ, ఇద్దరు మంత్రుల ఎదుటే చిట్టెంను చెంపదెబ్బ కొట్టారు. ఈ దృశ్యాలు టీవీల్లోనూ కనిపించాయి. ఎమ్మెల్యేల ఆవేశకావేశాలతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాంమోహన్‌రెడ్డే తనపై దాడి చేశారని, పరుష పదజాలంతో దూషించారని బాల్‌రాజు ఆరోపించారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తమ ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా కాంగ్రెస్ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. తొలుత ‘పాలమూరు’పై లొల్లి శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభం కాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడబోతుండగా టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలను నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించుకునేదాకా టీడీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదంటూ ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ భోజన విరామం ప్రకటించారు. వివాదం మొదలైందిలా తర్వాత సమావేశం మొదలవగానే గువ్వల మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కొందరిపై, మాజీ మంత్రి డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించారు. దళితులను మాజీ మంత్రి డీకే అరుణ పట్టించుకోరని జెడ్పీ చైర్మన్ సైతం వ్యాఖ్యానించడంతో గందరగోళం చెలరేగింది. ఈ సమయంలో డీకే సోదరుడైన ఎమ్మెల్యే చిట్టెం పోడియం వద్దకు దూసుకెళ్లారు. బాల్‌రాజ్ అసందర్భ ప్రసంగాన్ని ఎలా అనుమతిస్తారంటూ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. బాల్‌రాజ్ సైతం పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఇరువురూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాల్‌రాజు ఆవేశంతో చిట్టెం చెంపపై కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. చిట్టెం తనను దూషించారని, దాడికి పాల్పడటంతో తన పెదవికి గాయమైందని చెబుతూ బాల్‌రాజు కూడా టీఆర్ఎస్ సభ్యులతో కలసి బైఠాయించారు. జెడ్పీ చైర్మన్ కూడా నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ మణెమ్మను ఉద్దేశించి ‘జెడ్పీ భేటీకి రావడం ఇదే అఖరిసారి. నీ సంగతి తేలుస్తా’ అనడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. కాంగ్రెస్ మహిళా జెడ్పీటీసీలంతా మరోసారి పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే తంతు కొనసాగింది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ తమ జెడ్పీటీసీలతో కలిసి జిల్లా పరిషత్ ఎదుట రాస్తారోకోకు దిగారు. తర్వాత బాల్‌రాజుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాల్‌రాజు కూడా తనపై దాడి చేసిన చిట్టెంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూలు జెడ్పీటీసీ మణెమ్మ కూడా జెడ్పీ చైర్మన్‌పై ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత సమస్యపై బందా? గొడవకు కారణమైన కాంగ్రెస్ నాయకులే జిల్లా బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాను సస్యశామలం చేసేందుకు పాలమూరు ప్రాజెక్టును కడుతుంటే అడ్డుకుంటున్న టీడీపీకి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలకడం దారుణమన్నారు. సీఎం స్పందించాలి జెడ్పీ భేటీలో తమ పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిపై కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చిట్టెంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. దొరల పాలన నడుపుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆహ్వానించి, ఎమ్మెల్యేలు మాట్లాడొద్దంటూ నియంత్రించడం ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే పరస్పరం ఆడిపోసుకోవడమేనా అని విమర్శించారు.