నిండు సభలో ఎమ్మెల్యేకు చెంపదెబ్బ | trs mla slapped on congress mla | Sakshi
Sakshi News home page

నిండు సభలో ఎమ్మెల్యేకు చెంపదెబ్బ

Published Sat, Sep 5 2015 12:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెంపై  చేయి చేసుకుంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల - Sakshi

శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెంపై చేయి చేసుకుంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల

అధికారపార్టీ శాసనసభ్యుడి చర్య
 
రణరంగంగా మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశం
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల
దూషణల పర్వం.. చిట్టెంపై చేయి చేసుకున్న గువ్వల
సభలో బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు
పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు
చూస్తూ ఊరుకోబోం: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
నేడు జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పిలుపు..

 
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రణరంగమైంది! అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ముష్టిఘాతాలు, వాగ్వాదాలతో అట్టుడికింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు నిండు సభలో దాడికి పాల్పడ్డారు. తన ప్రసంగానికి అడ్డు తగులుతున్నారంటూ ఆవేశంతో ఊగిపోతూ, ఇద్దరు మంత్రుల ఎదుటే చిట్టెంను చెంపదెబ్బ కొట్టారు. ఈ దృశ్యాలు టీవీల్లోనూ కనిపించాయి. ఎమ్మెల్యేల ఆవేశకావేశాలతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాంమోహన్‌రెడ్డే తనపై దాడి చేశారని, పరుష పదజాలంతో దూషించారని బాల్‌రాజు ఆరోపించారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తమ ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా కాంగ్రెస్ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

తొలుత ‘పాలమూరు’పై లొల్లి
శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభం కాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడబోతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలను నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించుకునేదాకా టీడీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదంటూ ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ భోజన విరామం ప్రకటించారు.

 వివాదం మొదలైందిలా
 తర్వాత సమావేశం మొదలవగానే గువ్వల మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కొందరిపై, మాజీ మంత్రి డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించారు. దళితులను మాజీ మంత్రి డీకే అరుణ పట్టించుకోరని జెడ్పీ చైర్మన్ సైతం వ్యాఖ్యానించడంతో గందరగోళం చెలరేగింది. ఈ సమయంలో డీకే సోదరుడైన ఎమ్మెల్యే చిట్టెం పోడియం వద్దకు దూసుకెళ్లారు. బాల్‌రాజ్ అసందర్భ ప్రసంగాన్ని ఎలా అనుమతిస్తారంటూ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. బాల్‌రాజ్ సైతం పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఇరువురూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాల్‌రాజు ఆవేశంతో చిట్టెం చెంపపై కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. చిట్టెం తనను దూషించారని, దాడికి పాల్పడటంతో తన పెదవికి గాయమైందని చెబుతూ బాల్‌రాజు కూడా టీఆర్‌ఎస్ సభ్యులతో కలసి బైఠాయించారు. జెడ్పీ చైర్మన్ కూడా నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ మణెమ్మను ఉద్దేశించి ‘జెడ్పీ భేటీకి రావడం ఇదే అఖరిసారి. నీ సంగతి తేలుస్తా’ అనడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. కాంగ్రెస్ మహిళా జెడ్పీటీసీలంతా మరోసారి పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే తంతు కొనసాగింది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ తమ జెడ్పీటీసీలతో కలిసి జిల్లా పరిషత్ ఎదుట రాస్తారోకోకు దిగారు. తర్వాత బాల్‌రాజుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాల్‌రాజు కూడా తనపై దాడి చేసిన చిట్టెంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూలు జెడ్పీటీసీ మణెమ్మ కూడా జెడ్పీ చైర్మన్‌పై ఫిర్యాదు చేశారు.
 
 వ్యక్తిగత సమస్యపై బందా?
 గొడవకు కారణమైన కాంగ్రెస్ నాయకులే జిల్లా బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాను సస్యశామలం చేసేందుకు పాలమూరు ప్రాజెక్టును కడుతుంటే అడ్డుకుంటున్న టీడీపీకి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలకడం దారుణమన్నారు.
 
 సీఎం స్పందించాలి
 జెడ్పీ భేటీలో తమ పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిపై  కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చిట్టెంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు.    
 
 ఇదేనా బంగారు తెలంగాణ
 బంగారు తెలంగాణ సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. దొరల పాలన నడుపుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆహ్వానించి, ఎమ్మెల్యేలు మాట్లాడొద్దంటూ నియంత్రించడం ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే పరస్పరం ఆడిపోసుకోవడమేనా అని విమర్శించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement