guvala balraju
-
బండి సంజయ్ మూల్యం చెల్లించక తప్పదు..
సాక్షి, హైదరాబాద్: దళితులనుద్దేశించి చెప్పులు కుట్టుకునే వారిగా, మొలలు కొట్టుకునేవారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీఆర్ఎస్కు చెందిన దళిత ఎమ్మెల్యేలు హెచ్చరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్. ప్రభాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాదరి కిశోర్, కాలె యాదయ్య, ఆరూరి రమేశ్, చిరుమర్తి లింగయ్య, సుంకే రవిశంకర్, దుర్గం చిన్నయ్య, చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్.. ఆదివారం ఘాటుగా బహిరంగ లేఖ రాశారు. ‘నడిమంత్రపు సిరివస్తే కన్నూమిన్నూ కానకుండా విర్రవీగినట్టు సంజయ్ ప్రవర్తన ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సాటి మనుషులను అవమానపరుస్తున్నాడు. తలాతోక లేకుండా మాట్లాడే వ్యక్తిగా ముద్ర పడ్డ బండి.. మరోసారి దళితుల పట్ల అమానుష వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దళితుల పట్ల బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. బూజుపట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణచివేతకు అద్దంపట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. ఆధునిక యుగంలో కూడా దళితుల స్థితిగతులు అలాగే ఉండాలని, దళితులు ఇంకా చెప్పులు కుట్టుకుని బతకాలని కోరుకునే విధంగా మాట్లాడటం దుర్మార్గం’ అని ఆ లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అందరితో సమానంగా పోటీ... డాక్టర్ అంబేడ్కర్ కల్పించిన అవకాశాలతో అన్ని రంగాల్లో అందరితో పోటీపడి తాము ఉన్నతస్థానాలకు ఎదుగుతుండటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మింగుడు పడటం లేదని విమర్శించారు. దళితులు అందరితో సమానంగా పోటీపడుతున్నారని సంజయ్ గుర్తిస్తే మంచిదని, లేదంటే ప్రజలే బీజేపీకి మొలలు కొడతారని హెచ్చరించారు. -
అప్పుడు సమర్థించి ఇప్పుడు విమర్శలా?
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల తరలింపును మొదటి నుంచి టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, గతంలో నీటి తరలింపును సమర్థించిన వారే ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. శాసనసభలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలసి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. నీటి కేటాయింపుల్లో బ్రిజేశ్ కుమార్ కమిటీ కూడా ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం చేసిందని, కొందరు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఏపీని వదిలి కర్ణాటకపై పోరాడుతున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కడిగే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు కర్నె వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు: గువ్వల తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినందునే కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉనికిని కోల్పోయారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కృష్ణా బేసిన్లో వాటాదారులు కాని వారు కూడా నీటి దోపిడీకి పాల్పడుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న వారు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని వ్యాఖ్యానించారు. -
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది
సాక్షి, హైదరాబాద్ : ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారన్నారు. సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో ప్రముఖ స్థానం కల్పించారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పేద, మద్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్ లాగా ఆలోచించి బడ్జెట్‌ను రూపొందించారని, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విదించకపోవడం వెల్లడించారు. ఇరిగేషన్‌కు 11వేల కోట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు చెంపపెట్టన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో మా ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 57 సంవత్సరాల వారందరూ పెన్షన్‌కు అర్హులని చెప్పిన సీఎం వారికి రూ.2016 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘కేటీఆర్ ట్వీట్ కొండంత అండనిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: సేవ్ నల్లమల్ల పేరుతో మేధావులు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతో ఊపిరినిచ్చిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్లమల్లకు మద్దతుగా చేసిన ట్విట్ మాకు కొండంత అండగా అనిపించిందిని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గతంలో వజ్ర నిక్షేపాలు రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తే సీఎం కేసీఆర్‌తో కలిసి తామంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ఆయన గుర్తుచేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇంత మంది అండగా ఉంటూ నాకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. నల్లమల్ల యూరేనియం తవ్వకాలపై కేసీఆర్ స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకునే నైజం మాది కాదు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. పోరాటం చేసే శక్తి మాకుంది. నల్లమల్లపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి స్వయంగా పులుల దినోత్సవం రోజు అమ్రాబాద్‌లో పులుల సంఖ్యను చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద పులులు ఉన్న అడవిగా ఆమ్రాబాద్‌కు పేరుంది. అడవులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ అటవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యురేనియంపై నేను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకొని మరో ఉద్యమానికి స్వీకారం చూడతాం. నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉన్న మీడియా,సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు. -
నిండు సభలో ఎమ్మెల్యేకు చెంపదెబ్బ
అధికారపార్టీ శాసనసభ్యుడి చర్య రణరంగంగా మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల దూషణల పర్వం.. చిట్టెంపై చేయి చేసుకున్న గువ్వల సభలో బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చూస్తూ ఊరుకోబోం: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేడు జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పిలుపు.. మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రణరంగమైంది! అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ముష్టిఘాతాలు, వాగ్వాదాలతో అట్టుడికింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు నిండు సభలో దాడికి పాల్పడ్డారు. తన ప్రసంగానికి అడ్డు తగులుతున్నారంటూ ఆవేశంతో ఊగిపోతూ, ఇద్దరు మంత్రుల ఎదుటే చిట్టెంను చెంపదెబ్బ కొట్టారు. ఈ దృశ్యాలు టీవీల్లోనూ కనిపించాయి. ఎమ్మెల్యేల ఆవేశకావేశాలతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాంమోహన్‌రెడ్డే తనపై దాడి చేశారని, పరుష పదజాలంతో దూషించారని బాల్‌రాజు ఆరోపించారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తమ ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా కాంగ్రెస్ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. తొలుత ‘పాలమూరు’పై లొల్లి శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభం కాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడబోతుండగా టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలను నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించుకునేదాకా టీడీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదంటూ ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ భోజన విరామం ప్రకటించారు. వివాదం మొదలైందిలా తర్వాత సమావేశం మొదలవగానే గువ్వల మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కొందరిపై, మాజీ మంత్రి డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించారు. దళితులను మాజీ మంత్రి డీకే అరుణ పట్టించుకోరని జెడ్పీ చైర్మన్ సైతం వ్యాఖ్యానించడంతో గందరగోళం చెలరేగింది. ఈ సమయంలో డీకే సోదరుడైన ఎమ్మెల్యే చిట్టెం పోడియం వద్దకు దూసుకెళ్లారు. బాల్‌రాజ్ అసందర్భ ప్రసంగాన్ని ఎలా అనుమతిస్తారంటూ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. బాల్‌రాజ్ సైతం పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఇరువురూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాల్‌రాజు ఆవేశంతో చిట్టెం చెంపపై కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. చిట్టెం తనను దూషించారని, దాడికి పాల్పడటంతో తన పెదవికి గాయమైందని చెబుతూ బాల్‌రాజు కూడా టీఆర్ఎస్ సభ్యులతో కలసి బైఠాయించారు. జెడ్పీ చైర్మన్ కూడా నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ మణెమ్మను ఉద్దేశించి ‘జెడ్పీ భేటీకి రావడం ఇదే అఖరిసారి. నీ సంగతి తేలుస్తా’ అనడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. కాంగ్రెస్ మహిళా జెడ్పీటీసీలంతా మరోసారి పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే తంతు కొనసాగింది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ తమ జెడ్పీటీసీలతో కలిసి జిల్లా పరిషత్ ఎదుట రాస్తారోకోకు దిగారు. తర్వాత బాల్‌రాజుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాల్‌రాజు కూడా తనపై దాడి చేసిన చిట్టెంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూలు జెడ్పీటీసీ మణెమ్మ కూడా జెడ్పీ చైర్మన్‌పై ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత సమస్యపై బందా? గొడవకు కారణమైన కాంగ్రెస్ నాయకులే జిల్లా బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాను సస్యశామలం చేసేందుకు పాలమూరు ప్రాజెక్టును కడుతుంటే అడ్డుకుంటున్న టీడీపీకి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలకడం దారుణమన్నారు. సీఎం స్పందించాలి జెడ్పీ భేటీలో తమ పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిపై కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చిట్టెంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. దొరల పాలన నడుపుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆహ్వానించి, ఎమ్మెల్యేలు మాట్లాడొద్దంటూ నియంత్రించడం ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే పరస్పరం ఆడిపోసుకోవడమేనా అని విమర్శించారు.