సాక్షి, హైదరాబాద్: దళితులనుద్దేశించి చెప్పులు కుట్టుకునే వారిగా, మొలలు కొట్టుకునేవారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీఆర్‌ఎస్‌కు చెందిన దళిత ఎమ్మెల్యేలు హెచ్చరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్. ప్రభాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాదరి కిశోర్, కాలె యాదయ్య, ఆరూరి రమేశ్, చిరుమర్తి లింగయ్య, సుంకే రవిశంకర్, దుర్గం చిన్నయ్య, చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్.. ఆదివారం ఘాటుగా బహిరంగ లేఖ రాశారు.
‘నడిమంత్రపు సిరివస్తే కన్నూమిన్నూ కానకుండా విర్రవీగినట్టు సంజయ్ ప్రవర్తన ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సాటి మనుషులను అవమానపరుస్తున్నాడు. తలాతోక లేకుండా మాట్లాడే వ్యక్తిగా ముద్ర పడ్డ బండి.. మరోసారి దళితుల పట్ల అమానుష వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దళితుల పట్ల బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. బూజుపట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణచివేతకు అద్దంపట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. ఆధునిక యుగంలో కూడా దళితుల స్థితిగతులు అలాగే ఉండాలని, దళితులు ఇంకా చెప్పులు కుట్టుకుని బతకాలని కోరుకునే విధంగా మాట్లాడటం దుర్మార్గం’ అని ఆ లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు.
అందరితో సమానంగా పోటీ...
డాక్టర్ అంబేడ్కర్ కల్పించిన అవకాశాలతో అన్ని రంగాల్లో అందరితో పోటీపడి తాము ఉన్నతస్థానాలకు ఎదుగుతుండటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మింగుడు పడటం లేదని విమర్శించారు. దళితులు అందరితో సమానంగా పోటీపడుతున్నారని సంజయ్ గుర్తిస్తే మంచిదని, లేదంటే ప్రజలే బీజేపీకి మొలలు కొడతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment