
రియల్టర్ హత్య
సేలం: తిరుచెంగోడు వద్ద రియల్టర్ హత్యకు గురయ్యాడు. తిరుచెంగోడు 7వ వార్డు దొండి గార్డు ప్రాంతానికి చెందిన శేషురాజ్ (49) రియల్టర్. ఇతనికి భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం ఉదయం కోళిక్కాల్ నత్తానికి శేషురాజ్ బైకులో వెళుతున్నాడు. చెంగోటం పాళయం ఈచంగాడు ప్రాంతంలో మనుష్య సంచారం లేనిచోట ద్విచక్ర వాహనాన్ని నిలిపి శేషురాజ్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
ఆ సమయంలో బైకులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శేషురాజ్‌పై కత్తులతో దాడి చేసి పారిపోయారు. దాడిలో తల, మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలైన శేషురాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ మార్గంగా వచ్చిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు తిరుచెంగోడు పోలీసులు అక్కడికి చేరుకుని శేషురాజ్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చుననే సందేహంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.