అల్వాల్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్, బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు చర్చనీయాంశమయ్యింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కుషాయిగూడ చర్లపల్లిలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు.
తిరుపతిరెడ్డికి అల్వాల్ పరిధిలోని పాకాలకుంటలో ఓ వివాదాస్పద స్థలం ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతుండటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం తిరుపతిరెడ్డి తన స్థలానికి సంబంధించి అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి కారులో వెళ్లారు.
డ్రైవర్ వేరే పనిమీద వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరుపతిరెడ్డి కన్పించకుండా పోయారని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని భార్యతో పాటు అతని సోదరుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్థల వివాదం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మామిడి జనార్ధన్‌రెడ్డి తన భర్తను కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆటోలో వెళ్లి..అదృశ్యమై..
మండల కార్యాలయం నుంచి తిరుపతిరెడ్డి ఒక్కడే ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన అనంతరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటకేసర్ వద్ద ఆటో దిగి సమీపంలోని దుకాణ సముదాయంలోకి వెళ్లాడని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావు వెల్లడించారు. తిరుపతిరెడ్డి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు.
కుటుంబసభ్యుల ఆందోళన..
కిడ్నాప్‌కు గురైన తిరుపతిరెడ్డి ఆచూకీని తెలుసుకోవడంంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య, సోదరుడు ఆరోపించారు. ఆయన అదృశ్యమై దాదాపు రెండురోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత పోలీస్‌స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన పోలీసులు, ఇప్పుడు మాటమార్చి ఫుటేజీలు ఉన్నాయంటున్నారని చెప్పారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని సుజాత పేర్కొన్నారు.
పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయింపు
తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, బీజేపీ నాయకులు, పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. జనగామ, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతిరెడ్డి శ్రేయోభిలాషులు కూడా పెద్దసంఖ్యలో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అధికార పార్టీ నాయకులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు.
అదుపులో తిరుపతిరెడ్డి స్నేహితుడు
దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఘట్‌కేసర్ ప్రాంతంలో తిరుపతిరెడ్డిని వదిలిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడని తెలిసింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.
తిరుపతిరెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆయన గత కొన్ని రోజులుగా తరచూ స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. శుక్రవారం కూడా వేరే ఫోన్ ద్వారా మాట్లాడని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment