
హసన్‌పర్తి: ఓ రియల్టర్ వ్యాపారి.. స్వామికే శఠగోపం పెడుతున్నాడు. కోనేరును కబ్జా చేసి.. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇరు శాఖలకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రియల్టర్‌కు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గజం భూమి ధర రూ.20 వేల వరకు పలుకుతోందని.. కబ్జాకు గురైన కోనేరు భూమి సుమారు రూ.కోటి ఉంటుందని.. ప్రస్తుత అధికారులు గతంలో డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ రియల్టర్‌కు మద్దతు పలుకుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోనేరు స్థలం కబ్జా..
భీమారం శివారులోని సర్వే నంబర్ 137/సీలో 0.10 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంతభాగంలో కోనేరు విస్తరించింది. ఇది శిథిలావస్థకు చేరుకోగా.. దీనిపై ఓ రియల్టర్ కన్ను పడింది. ఈ మేరకు సదరు రియల్టర్ దాని చుట్టు పక్కల సుమారు 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. కోనేరును కబ్జా చేసి పార్క్‌గా చూపించినట్లు గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ భూమిని చింతగట్టుకు చెందిన మధుసూదన్‌రెడ్డి ఎర్రగట్టు దేవస్థానానికి దానంగా ఇచ్చినట్లు పత్రాలు ఉన్నాయని అప్పటి పాలకవర్గం ఎండోమెంట్ అధికారులకు నివేదించింది. దీనిపై పత్రికల్లో కథనాలు రాగా.. అప్పటి దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ స్పందించి కోనేరును సందర్శించారు.
ఈ క్రమంలో కోనేరుకు సంబంధించిన భూమి పేరుమాండ్లు (దేవుడి) పేర ఉన్నట్లు అప్పటి చైర్మన్ బూర సురేందర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శ్రీ ఎర్రగట్టు దేవస్థాన భూములను సర్వే చేసి హద్దులను నిర్ధారించాలని అప్పటి డిప్యూటీ కమిషనర్ రమేష్ ఆదేశించారు. దేవస్థాన భూములు స్వాధీనం చేసుకుని ఆలయం పేరుపైనే పాసుపుస్తకాలు జారీ చేస్తామన్నారు. కమిషనర్ ఆదేశాలు ఇచ్చి చాలా కాలం గడుస్తున్నా.. అవి బుట్టదాఖలయ్యాయి. రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు సర్వేచేయడంలో నిర్లక్ష్యం వహించారు. డీసీ రమేష్ బదిలీ కాగా.. ఆయన స్థానంలో సునీత వచ్చారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో రియల్టర్ మళ్లీ కబ్జాకు తెరలేపారు.
ప్లాట్లుగా విభజించే యత్నం..
కొంతకాలం విరామం తర్వాత రియల్టర్ కోనేరు స్థలాన్ని మళ్లి ప్లాట్లుగా విభజించడానికి యత్నిస్తుండగా.. స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. ఈ క్రమంలో రియల్టర్ తమపై తిరగబడ్డాడని.. కోనేరు స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment