సాక్షి, హైదరాబాద్: కబ్జాల్లో ఉన్న దేవాలయ భూములను స్వా«దీనం చేసుకునే క్రమంలో ఆ భూ ముల ఆక్రమణలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల భూములు స్వాధీనం చేసుకుని దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే 34,092 ఎకరాల ఆలయ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ఆలయ భూముల హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
ఎకో–టెంపుల్ టూరిజం..
రాష్ట్రంలో విస్తారంగా ఉన్న అటవీ భూముల్లో సుందర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. అలాగే దీనిని ఇప్పుడు ఆధ్యాత్మికతకు జోడించి ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
దేవాలయాల్లో ఫిర్యాదుల పుస్తకం..
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసేందుకు పుస్తకాలను ఏర్పాటు చేస్తామని, వాటిల్లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ దేవాలయ గోపురానికి కూడా స్వర్ణ తాపడం చేయిస్తామని, ఇందుకు 65 కిలోల ఆలయ బంగారాన్ని వాడతామని ఆమె చెప్పారు. ఆలయంలోని వెండితో పల్లకీ చేయిస్తామన్నారు. అలాగే బాసర దేవాలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment