సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది.
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి.
Comments
Please login to add a commentAdd a comment