Stamp duty charges
-
స్టాంప్ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్’ తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో ఫ్రాంకింగ్ మిషన్ సేవలు అందని ద్రాక్షగా తయారయ్యాయి. డిజిటలైజేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ఫ్రాంకింగ్ మిషన్లు అందుబాటులో తెచ్చినప్పటికీ ఆచరణలో అమలు నిర్లక్ష్యానికి గురవుతోంది. పాత మిషన్లు మొరాయిస్తుండటంతో ఆధునిక యంత్రాల సరఫరా జరిగినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో వినియోగంలోకి తేవడం లేదు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మొక్కుబడిగా పనిచేస్తుండగా, మరికొన్నింటిలో మూలన పడిపోయాయి. ఫలితంగా దస్తావేజుదారులు ప్రైవేటు ఫ్రాంకింగ్ మిషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. స్టాంప్ డ్యూటీ కడితేనే.. ఇళ్లు, వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 0.5 శాతం హైపోతిక్ చార్జీ (స్టాంప్ డ్యూటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించిన తర్వాతనే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాన్ని విడుదల చేస్తాయి. రూ.1000 లోపు అయితే స్థానికంగా ఉండే లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ల వద్ద చెల్లించవచ్చు. అంతకన్నా మించి అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా ముట్టినట్టు స్టాంప్ వేసి ఇస్తారు. నిండా నిర్లక్ష్యం.. ఫ్రాంకింగ్ మిషన్‌లో డిపాజిట్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దస్తావేజుదారులు ఆరోపిస్తున్నారు. చిన్న డిజిటల్ యంత్రమైన ఫ్రాంకింగ్ మిషన్‌ను ఎప్పటికప్పుడు రీచార్జి చేయించాల్సి ఉంటుంది. రూ.20 లక్షలను ప్రభుత్వానికి ముందస్తుగా డిపాజిట్ చేస్తే అంత విలువైన స్టాంపుల స్టాంపింగ్‌కు కావాల్సిన ముడిసరుకును (ఇంక్) సరఫరా అవుతోంది. అయిపోతే మళ్లీ చార్జీ చేసుకోవాలి. ప్రైవేటు స్టాంప్ వెండర్ల విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఆయితే వారి దగ్గర రూ. వెయ్యికి మించి స్టాంపింగ్‌కు వీలు లేదు. రిజిస్ట్రేషన్ అధికారులు మిషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే మరమ్మతు చేయించకపోవడమే కాకుండా రీచార్జి చేయించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆదాయం సమకూరుతున్నా.. ప్రస్తుతం రూ.100 మించిన స్టాంపులను అమ్మడం లేదు. స్టాంప్ డ్యూటీకి సరిపడా స్టాంపులను కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ఆ మొత్తాన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లిస్తే అందుకు సరిసమానమైన స్టాంప్‌ను ఈ ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా వేస్తారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ రుణాల మంజూరుకు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద నెలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ అవసరమైన ఫ్రాంకింగ్ మిషన్ల నిర్వహణపై శ్రద్ధ కనబర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో భారం
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి. -
ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ "ఆడి" భారతదేశంలో దిగుమతి చేసుకున్న కార్లపై అధిక పన్ను విధించడం అనేది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను అడ్డుకోవడం అని పేర్కొంది. అలాగే, సుంకాల పరంగా కొంత ఉపశమనం కలిగిస్తే మరిన్ని వాహనాలను విక్రయించడానికి, స్థానిక తయారీ కోసం దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుందని సంస్థ పేర్కొంది. పీటీఐతో ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. దేశంలోకి దిగుమతి చేసుకున్న మొదటి సెట్ ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ విక్రయించినట్లు పేర్కొన్నారు.(చదవండి: నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు!) "దేశంలోకి తీసుకువచ్చిన మొదటి ఈ-ట్రాన్లు అన్నీ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. అందుకే, భవిష్యత్ లో ఇలాంటి కార్లను మరిన్ని తీసుకొనిరావడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని ఆయన పేర్కొన్నాడు. "ఇంపోర్ట్ డ్యూటీ తక్కువగా ఉంటే బహుశా మేము దేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించవచ్చు" అని ధిల్లాన్ చెప్పాడు. "దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మా అభ్యర్థన, 3-5 ఏళ్ల వరకు కొంత ఉపశమనం ఇస్తే, స్థానికంగా కార్లను తయారు చేయడానికి దేశంలో మరింత పెట్టుబడి పెట్టడానికి మా ప్రధాన కార్యాలయాన్ని ఒప్పించడానికి మాకు సహాయపడుతుంది" అని అన్నారు. -
కడప స్టీల్ ప్లాంట్ భూములకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తోన్న వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ (వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్) కోసం కేటాయించిన 3,148.68 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులిచ్చింది. జిల్లాలోని జమ్మలమడుగు మండలం పెద్దనందులూరు, సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రూ.3.89 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ నోటిఫికేషన్ జారీ చేశారు. కాకినాడ సెజ్ భూములకూ మినహాయింపు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెజ్‌లో రైతులకు తిరిగి ఇస్తున్న 2,180 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. మహిళల పేరిట జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఒక శాతం తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మహిళలకు భారీ కేటాయింపులు చేయన్నుట్లు ప్రకటించారు. మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు. మహిళలకు మహారాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
రియల్టీ దూకుడు- లాభాలు స్వల్పమే
కోవిడ్-19 సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. ఈ నేపథ్యంలో రియల్టీ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఎన్ఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ ఏకంగా 6.5 శాతం జంప్‌చేసింది. తొలుత డబుల్ సెంచరీ విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివర్లో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు బలపడి 39,113 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 11,559 వద్ద ముగిసింది. అయితే తొలి సెషన్లో సెన్సెక్స్ 39,327 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,047 వరకూ వెనకడుగు వేసింది. ఇక నిఫ్టీ 11,617- 11,541 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, మీడియా 1-0.5 శాతం మధ్య పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ, ఐటీ స్వల్పంగా నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 6.5 శాతం జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఎస్బీఐ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, యాక్సిస్, మారుతీ, సిప్లా, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ 4.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, బజాజ్ ఆటో, జీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఐవోసీ, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్ 1-0.6 శాతం మధ్య నష్టపోయాయి. డీఎల్ఎఫ్ జూమ్ ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో డీఎల్ఎఫ్, సెంచురీ టెక్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, బంధన్ బ్యాంక్, బాటా, ఎక్సైడ్, అపోలో టైర్, ఎస్కార్ట్స్ 9.5-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, చోళమండలం, ఎంజీఎల్, మణప్పురం, మైండ్‌ట్రీ, టీవీఎస్ మోటార్, భెల్, సెయిల్, రామ్‌కో సిమెంట్, టొరంట్ పవర్, ఐజీఎల్ 2.7-1.6 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టీజ్, ఒబెరాయ్, సన్‌టెక్, శోభా, బ్రిగేడ్ 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1430 లాభపడగా.. 1438 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,581 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
చుక్కల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు
విజయవాడ : రిజిస్ట్రేషన్ శాఖలో స్టాంప్ డ్యూటీ చార్జీలు గురువారం నుంచి భారీగా పెరగనున్నాయి. గతంలో ఉన్న చార్జీల కంటే సగానికి సగం పెంచుతూ టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై మరింత అదనపు భారం పడనుంది. జిల్లాలోని 28 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా విధించింది. ఇప్పటికే అక్టోబర్ నాటికి రూ.350 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా లభించింది. సేల్ డీడ్ల (అమ్మకాలు)పై ఒక శాతం స్టాంప్ డ్యూటీ పెరిగింది. ఫీజులు కూడా 0.5 శాతం పెంచారు. మొత్తం మీద సేల్ డీడ్లపై ఆరు శాతం నుంచి 7.5 శాతానికి స్టాంప్ డ్యూటీ, ఫీజులు పెరిగాయి. అంటే లక్ష రూపాయల విలువ గల ఆస్తి రిజిస్ట్రేషన్ చేసేవారిపై రూ.1,500 అదనంగా భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గిఫ్ట్ డీడ్లు, సెటిల్మెంట్లకు కూడా స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం పెంచింది. గతంలో గిఫ్ట్ డీడ్లకు సంబంధించి ఒక శాతం స్టాంప్ డ్యూటీ ఉండగా, అది మూడు శాతానికి పెరిగింది. సెటిల్మెంట్ డీడ్‌కు సంబంధించి ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచారు. పార్టిషన్ డీడ్‌కు సంబంధించి గతంలో ఉన్న రూ.20 వేల ఫీజును రద్దు చేసి, దానికి కూడా ఒక శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా స్టాంప్ డ్యూటీలు, ఫీజులు పెంచడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.