కోవిడ్-19 సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. ఈ నేపథ్యంలో రియల్టీ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్ ఏకంగా 6.5 శాతం జంప్‌చేసింది.
తొలుత డబుల్ సెంచరీ
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివర్లో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు బలపడి 39,113 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 11,559 వద్ద ముగిసింది. అయితే తొలి సెషన్‌లో సెన్సెక్స్ 39,327 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,047 వరకూ వెనకడుగు వేసింది. ఇక నిఫ్టీ 11,617- 11,541 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.
రియల్టీ దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, మీడియా 1-0.5 శాతం మధ్య పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ స్వల్పంగా నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్ 6.5 శాతం జంప్‌చేయగా.. ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, గ్రాసిమ్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, యాక్సిస్, మారుతీ, సిప్లా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ 4.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, బజాజ్ ఆటో, జీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఐవోసీ, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్ 1-0.6 శాతం మధ్య నష్టపోయాయి.
డీఎల్‌ఎఫ్ జూమ్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో డీఎల్‌ఎఫ్, సెంచురీ టెక్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, బంధన్ బ్యాంక్, బాటా, ఎక్సైడ్, అపోలో టైర్, ఎస్కార్ట్స్ 9.5-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, చోళమండలం, ఎంజీఎల్, మణప్పురం, మైండ్‌ట్రీ, టీవీఎస్ మోటార్, భెల్, సెయిల్, రామ్‌కో సిమెంట్, టొరంట్ పవర్, ఐజీఎల్ 2.7-1.6 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టీజ్, ఒబెరాయ్, సన్‌టెక్, శోభా, బ్రిగేడ్ 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1430 లాభపడగా.. 1438 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,581 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment