సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే..
అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి.
నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.
రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కి (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్‌సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్‌ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి.
రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్‌ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్‌ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి.లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment