రాయితీలుంటేనే గృహ కొనుగోళ్లు | Home purchases with discounts | Sakshi
Sakshi News home page

రాయితీలుంటేనే గృహ కొనుగోళ్లు

Published Sat, Jul 31 2021 3:09 AM | Last Updated on Sat, Jul 31 2021 3:03 PM

Home purchases with discounts - Sakshi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు వైఖరిలో మార్పులు వచ్చాయి. కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలను కస్టమర్లు కోరుకుంటున్నారని రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ పోర్టల్‌ హౌసింగ్‌.కామ్, నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య కాలంలో 3 వేల మంది కస్టమర్లతో సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం గతంతో పోలిస్తే పెట్టుబడి సరైన సాధనంగా రియల్‌ ఎస్టేట్‌ అని భావించే వారి శాతం పెరిగింది.

గతంలో 35% ఉండగా.. ఇప్పుడది 43 శాతానికి పెరిగింది. గతంలో స్టాక్‌ మార్కెట్లు సరైన ఇన్వెస్ట్‌మెంట్స్‌గా 15%మంది భావించగా.. ఇప్పుడది 20 శాతానికి చేరింది. కాగా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ), బంగారంలో పెట్టుబడులపై కస్టమర్ల ఆసక్తి క్షీణించింది. గతంలో 22 శాతం మంది ఎఫ్‌డీలు మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ అని భావించగా.. ఇప్పుడు 19 శాతానికి, గతంలో బంగారంలో పెట్టుబడులకు 28 శాతం మంది ఆసక్తి కనబర్చగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 71% మంది కొనుగోలు నిర్ణయాలను తీసుకునేలా, ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించే విధంగా డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్‌ చెల్లింపు విధానాలను కోరుకుంటున్నారు.

అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ), సరఫరా ఎక్కువ ఉన్న డెవలపర్లు డిస్కౌంట్లను అందిస్తున్నారని, రుణ చెల్లింపులు, ఇతరత్రా నిర్వహణ కోసం తప్పదని నరెడ్కో ప్రెసిడెంట్‌ నిరంజన్‌ హిరానందాని చెప్పారు. ఇప్పటికే డెవలపర్లు తక్కువ మార్జిన్లలో ఉన్నారని పేర్కొన్నారు. డిమాండ్‌–సరఫరాలను బట్టి ధరలపై నియంత్రణ ఉంటుందన్నారు. చాలా మంది కస్టమర్లు పెద్ద సైజు అపార్ట్‌మెంట్లకు అప్‌గ్రేడ్‌ అవుతుండటం, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడం కారణంగా ఇళ్లకు డిమాండ్‌ పెరిగిందని హౌసింగ్‌.కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు. అందుబాటులో ఇళ్ల ధరలు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి కూడా డిమాండ్‌కు ఊతమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావటం, కోవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో హోమ్‌బయ్యర్లు ఇళ్ల కోసం వెతుకులాట ప్రారంభించారని తెలిపారు.

33 బిలియన్‌ డాలర్ల రియల్టీ రుణాలు ఒత్తిడిలోనే..: అనరాక్‌
కాగా, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి 100 బిలియన్‌ డాలర్ల రుణాలను అందించాయని.. వీటిలో 67 శాతం లోన్లు మాత్రమే సురక్షిత జోన్‌లో ఉండగా.. మిగిలిన 33 శాతం (33 బిలియన్‌ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. ఆ 33 శాతంలో 15 శాతం (15 బిలియన్‌ డాలర్లు) కొంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ రికవరీకి అవకాశం ఉందని.. 18 శాతం (18 బిలియన్‌ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. ఆయా డెవలపర్‌ రుణగ్రహీతలు అధిక పరపతి కలిగి ఉన్నారని తెలిపింది. 2019 ముగింపు నాటికి 93 బిలియన్‌ డాలర్ల రియల్టీ రుణాలలో 16 శాతం తీవ్రమైన ఒత్తిడి లోన్లని

పేర్కొంది. దేశీయ రియల్టీ రుణాలలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీ), ట్రస్టీషిప్స్‌ వాటా 63 శాతం వరకున్నాయని తెలిపింది. శాఖల వారీగా చూస్తే. బ్యాంక్‌ల వాటా 37 శాతం, హెచ్‌ఎఫ్‌సీలు 34 శాతం, ఎన్‌బీఎఫ్‌సీల వాటా 16 శాతం, ట్రస్టీషిప్స్‌ వాటా 13 శాతంగా ఉందని పేర్కొంది. బ్యాంక్‌లు, హెచ్‌ఎఫ్‌సీల లోన్‌ బుక్‌లలో వరుసగా 75, 66 శాతంతో సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాయని తెలిపింది.

మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలలో 46 శాతం వాచ్‌లిస్ట్‌ జాబితాలో ఉన్నాయని పేర్కొంది. గ్రేడ్‌–ఏ డెవలపర్లకు ఇచ్చే లోన్లలో 75 శాతం సురక్షిత జోన్‌లోనే ఉన్నాయని.. రియల్టీ రంగానికి పంపిణీ చేసే మొత్తం రుణాలలో 73 బిలియన్‌ డాలర్లు గ్రేడ్‌–ఏ బిల్డర్లకే అందుతాయని అనరాక్‌ రిపోర్ట్‌ తెలిపింది. పుణే ఎన్‌సీఆర్, ముంబై నగరాలలోని మొత్తం రుణాలలో వరుసగా 40, 39, 37 శాతం లోన్లు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత బెంగళూరులో 15 శాతం, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాలలో 3–4 శాతం లోన్లు ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement