2022–23లో సుమారు 100 కిలోటన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి
దేశంలో 2030 నాటికి 600 కిలో టన్నులకు చేరుకునే అవకాశం
ఈ వ్యర్థాల్లో 67 శాతం ఐదు రాష్ట్రాల్లోనే ఉత్పత్తి
కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది.
సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది.
మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది.
రీసైక్లింగ్ చేస్తే సరి
వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి.
కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్‌లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా.
ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్‌ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment