అమిత్‌ షాకు చంద్రబాబు విందు | Chandrababu hosts dinner for Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాకు చంద్రబాబు విందు

Published Sun, Jan 19 2025 5:22 AM | Last Updated on Sun, Jan 19 2025 5:22 AM

Chandrababu hosts dinner for Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు

పాల్గొన్న పవన్‌ కళ్యాణ్, బండి సంజయ్‌ తదితరులు

రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూటమి నేతలు వెల్లడి

నేడు ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ క్యాంపస్‌లకు ప్రారంభోత్సవం

సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సీఎం చంద్రబాబు శనివారం రాత్రి విందు సమావేశంలో పాల్గొన్నారు. వారు కొద్దిసేపు రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూటమి నేతలు తెలిపారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం), ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ క్యాంపస్‌లను అమిత్‌షా ఆదివారం ప్రారంభించనున్నారు. 

ఇందుకోసం విజయవాడ వచ్చిన ఆయనకు సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అమిత్‌షా శనివారం రాత్రి 8.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. 

విందు అనంతరం అమిత్‌ షాతో వారిద్దరూ సమావేశమ­య్యారు. ఈ విందు సమావేశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివా­స­వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్‌ షా విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేశారు.

విమానాశ్రయంలో అమిత్‌షాకు ఘనస్వాగతం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కె. అచ్చన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నారా లోకేశ్, కొలుసు పార్ధసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌ యాదవ్, డోలా బాల వీరాంజనేయులు స్వామి, నాదెండ్ల మనోహర్, వాసంశెట్టి సుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, సీఎం రమేష్, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎన్టీఆర్‌ఎఫ్‌ డీజీ పీయూష్‌ ఆనంద్, ఐజీ నరేంద్రసింగ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement