పీజీ వైద్య విద్యార్థులపై.. ఫీజుల బండ | Parents demand PG medical counseling: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య విద్యార్థులపై.. ఫీజుల బండ

Published Sun, Jan 19 2025 5:12 AM | Last Updated on Sun, Jan 19 2025 5:12 AM

Parents demand PG medical counseling: Andhra Pradesh

వాటిపై స్పష్టత ఇచ్చాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తల్లిదండ్రుల డిమాండ్‌

అయినా వారి గోడు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

హడావుడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించడంపై విమర్శలు 

ఇటీవల వైద్యశాఖ మంత్రిని సైతం నిలదీసిన తల్లిదండ్రులు 

ఇది ప్రభుత్వ పరిధిలో లేని అంశమని మంత్రి నిర్లక్ష్యంగా సమాధానం 

ప్రస్తుతం ఫీజులు రాబడుతూనే.. భవిష్యత్‌లో పెరిగే ఫీజులు కట్టాలని బాండ్లు రాయించుకుంటున్న కళాశాలలు  

గత సర్కారు జీవో రద్దుతో భారీగా పెరుగుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులు బెంబేలు 

ప్రైవేట్‌ కళాశాలలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని మండిపాటు

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌లో తమ పిల్లలకు సీట్లు 
వచ్చాయనే సంతోషం కన్నా ఎంత ఫీజు చెల్లించాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ తల్లిదండ్రులను కలవరపెడుతోంది. గత ప్రభుత్వంలో మెడికల్‌ పీజీ కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఇచ్చిన జీఓ ఇప్పుడు రద్దవ్వడంతో.. 2019 ముందు మాదిరిగానే ప్రస్తుతం కూడా ఫీజులు భారీగా పెరిగిపోతాయనే భయం వారికి నిద్రలేకుండా చేస్తోంది. ఫీజుల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీంతో.. వీరి ఆవేదన అరణ్య రోదనగా మారింది. 
– సాక్షి, అమరావతి  


మంత్రి బాధ్యతారాహిత్యం.. 
ఫీజులపై స్పష్టత ఇచ్చాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం­లేదు. ఇటీవల గుం­టూరు­లో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను తల్లిదండ్రులు నిలదీశారు. ‘ఫీజులు ఎంత చెల్లించాలో చెప్పకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రభుత్వం ఫీజులపై స్పష్టత ఇవ్వాలని,  ఇబ్బడిముబ్బడిగా ఫీజులు పెంచి తమపై భారం మోపద్దు’ అని ఆయన్ను కోరారు. ఇదే విషయంపై మీడియా సైతం మంత్రిని ప్రశ్నించగా.. ఫీజుల వ్యవహారం ప్రభుత్వ పరిధిలోలేని అంశమని మంత్రి బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారు. ప్రైవేట్‌ కళాశాలల విధానాలను సమర్థించేలా ప్రభుత్వ తీరు             ఉంటోందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  

కన్వీనర్‌ కోటాలో చేరాలన్నా భయం.
2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో పీజీ కోర్సుల ఫీజు­లను అమాంతం పెంచేశారు. అప్పటివరకూ కన్వీనర్‌ కోటా­లో రూ.2.09 లక్షలున్న ఫీజును రూ.6.90 లక్షలకు, బీ–కేటగిరి రూ.5.25 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు పెంచారు. దీంతో ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో చేరడానికి పేద కుటుంబాల పిల్లలు వెనుకడుగు వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఫీజులను గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 50 శాతం మేర తగ్గించింది. ఫీజులు తగ్గిస్తూ ఇచ్చిన జీఓ–56 ప్రకారం ప్రైవేట్‌ కళాశాలల్లో బీ–కేటగిరి సీట్‌­కు ఏడాదికి రూ.10 లక్షల్లోపే ఫీజు ఉంది. ఇ­లా మూడేళ్లకు రూ.30 లక్షలవుతుంది.

పీజీలో చేరాక కోర్సు పూర్తయ్యే నాటికి స్టైఫండ్‌ రూపంలో రూ.6 లక్షల వరకూ వస్తుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, చిన్న–­సన్నకారు రైతు, సామాన్య కుటుంబాల వారు స్టడీ, పర్సనల్‌ లోన్స్, ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకుని తమ పిల్లలను బీ–కేటగిరి సీట్లలో ధైర్యంగా చేరి్పస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో జీఓ–­56 రద్దవ్వడంతో, కొ­త్తగా ఎంత మేర ఫీజులు పెంచుతారోనని భయం జూనియర్‌ వై­ద్యులు, వారి తల్లిదండ్రులను వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రైవేట్‌లో కన్వీనర్‌ కోటా ఫీజు రూ.4.96 లక్షలుగా ఉంది. ఫీజులు పెరుగుతాయని తెలిసి కన్వీనర్‌ కోటాలో చేరడానికి దిగువ మధ్యతరగతి కుటుంబాలు భయపడుతున్నాయి.

ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్, బీ–కేటగిరి సీట్లు పొందిన వారి నుంచి ప్రస్తుతం ఉన్న ఫీజులను వసూలు చేస్తూనే, భవిష్యత్తులో పెరిగే ఫీజు­లు చెల్లించేలా యాజమాన్యాలు బాండ్లు రా­యిం­చుకుంటున్నాయి. ఈ బాండ్‌ రాసివ్వ­డం తప్పనిసరి అని ప్రతి కళాశాలలో నిబంధన. సీటు వదులుకోలేక ఫీజులు ఎంత పెరుగుతాయో తెలియకుండానే బాండ్లు రాసిచ్చామని తల్లిదండ్రులంటున్నారు. 2019కి ముందు మాదిరిగానే ఏడు రెట్లు ఫీజులు పెంచుతారేమోనని ఆందోళన చెందుతున్నారు.

అగమ్యగోచరంగా ఉంది.. 
మొదటి కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో సైకియాట్రి సీట్‌ వచ్చింది. అయితే, సర్జికల్‌ బ్రాంచ్‌లో పీజీ చేయాలనేది కోరిక. బీ–కేటగిరిలో అయినా నేను కోరుకున్న సీట్‌ వస్తుందనే ధైర్యంతో సైకియాట్రీలో జాయిన్‌ అవ్వలేదు. రెండో దశ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక జీఓ–56 రద్దయింది. ఇప్పుడేమో ఫీజులు పెరుగుతాయంటున్నారు. మూడో దశ కౌన్సెలింగ్‌లో బీ–కేటగిరిలో సీట్‌ వస్తే చేరాలంటే ఎంత ఫీజు కట్టాలో కూడా స్పష్టతలేదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. మరోవైపు.. హడావుడిగా కౌన్సెలింగ్‌ చేశారు. పక్కనున్న తెలంగాణాలో కౌన్సెలింగ్‌ ఆలస్యం అవ్వడంతో అక్కడి విద్యార్థులు కూడా మన దగ్గర సీట్లు పొందారు. దీంతో ఏపీ విద్యార్థులమైనా సీట్ల పరంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నాం.  – డాక్టర్‌ కిరణ్, వైద్య విద్యార్థి, విజయవాడ 

కనీస స్పందన లేదు.. 
నేను పండ్ల వ్యాపారిని. మా అమ్మాయి ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు  సాధించి కోర్సు పూర్తిచేసింది. నీట్‌ పీజీలో 24 వేల ర్యాంకు వచ్చింది. తొలి రెండు కౌన్సెలింగ్‌లలో సీటు రాలేదు. మూడో రౌండ్‌లో బీ–కేటగిరి సీట్‌ అయినా వస్తుందని భావిస్తున్నాం.  ప్రస్తుతం రూ.10 లక్షల ఫీజు ఆధారంగా అమ్మాయిని ప్రైవేట్‌ కళాశాలలో అయినా చేర్చడానికి డబ్బు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. కానీ, ఫీజులు పెరుగుతాయని ఇప్పటికే కళాశాలల్లో చేరిన విద్యార్థులతో నోట్‌లు రాయించుకున్నారట. రూ.20 లక్షల పైనే ఫీజులు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున ఫీజులు పెరిగితే డబ్బున్న వారికే ఉన్నత విద్య అవకాశం ఉంటుంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించడంలేదు.       – ఇస్మాయిల్,    వైద్య విద్యార్థి తండ్రి, వైఎస్సార్‌ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement