హాట్ కేకులు.. జనరల్ మెడిసిన్ సీట్లు
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా ప్రారంభం
తొలి రోజు అర్ధరాత్రి దాటే వరకు సీట్ల భర్తీ
విజయవాడ : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన కౌన్సెలింగ్ తొలిరోజైన బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. జనరల్ మెడిసిన్ సీట్లు హాటుకేకుల్లా భర్తీ అయ్యాయి. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా సీట్లు భర్తీ అవుతున్న ప్రక్రియను ఎప్పటికప్పుడు స్క్రీనులపై చూపించారు.
మొదటి రోజు నాన్‌సర్వీస్ జనరల్ కేటగిరీకి సంబంధించి కౌన్సెలింగ్ పక్రియ నిర్వహిం చారు. తొలుత ఫస్ట్ ర్యాంకర్ బి.శ్రీరామిరెడ్డికి వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ అడ్మిషన్ పత్రాన్ని అందజేసి కౌన్సెలింగ్ ప్రారంభించారు. అనంతరం కౌన్సెలింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న వర్సిటీ రెక్టార్ డాక్టర్ రమణమ్మ నేతృత్వంలో ర్యాం కుల వారీగా వివిధ ప్రభుత్వ, ప్రరుువేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమో సీట్లను భర్తీ చేశారు.
ఎప్పటిలాగానే ఈసారి కూడా జనరల్ మెడిసిన్ సీట్లు హాట్‌కేకుల్లా మారాయి. తొలి పది మంది ర్యాంకర్లలో ముగ్గరు కౌన్సెలింగ్‌కు గైర్హాజరవగా, మిగిలిన వారిలో ఆరుగురు జనరల్ మెడిసిన్ సీట్లు తీసుకున్నారు. ఒకరు జనరల్ సర్జరీని ఎంచుకున్నారు.
మధ్యాహ్నానికే నాన్‌సర్వీస్ ఓపెన్ కేటగిరికి సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో జనరల్ మెడిసిన్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికిప్రరుువేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్ ఏర్పడింది.
జనరల్ మెడిసిన్ తర్వాత, జనరల్ సర్జరీ, అబ్స్ట్రాటిక్ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్, రేడియాలజీ, ఆర్థోపెడిక్ వంటి విభాగాల కోసం పోటీ పెరిగింది. ఆయా విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్సీట్లు లభించని వారు డిప్లొమా కోర్సులను ఎంచుకుంటున్నారు. రాత్రి ఏడు గంటల సమయానికి ఆ కేటగిరిలో నాన్క్లినికల్ సీట్లు మాత్రమే మిగిలాయి.
ఉస్మానియా, గాంధీ కళాశాలలకు తగ్గని క్రేజ్
రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉస్మానియా, గాంధీ కళాశాలల్లో అడ్మిషన్లకు క్రేజ్ తగ్గలేదు. పదేళ్ల వరకూ విద్యారంగంలో పాత విధానాన్నే కొనసాగించేందుకు నిర్ణయించడంతో టాప్ ర్యాంకర్లందరూ ఉస్మానియూ, గాంధీ మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందేందుకు మొగ్గు చూపారు. మూడో ప్రాధాన్యతగా ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరారు.
టాప్ ర్యాంకర్ కర్నూలు జిల్లా వాసి అయినప్పటికీ ఉస్మానియూలో జనరల్ మెడిసిన్‌సీటు పొందగా, కాకినాడ రంగరాయ కళాశాలలో ఎంబీ బీఎస్ చదివిన నాల్గో ర్యాంకర్ కూడా అక్కడే జనరల్ మెడిసిన్‌లో చేరారు. ఐదో ర్యాంకర్ అనంతపురానికి చెందిన బండపల్లి దివ్యరెడ్డి, కడపకు చెందిన ఆరో ర్యాంకర్ రాం భూపాల్‌రెడ్డి గాంధీ కళాశాలలో జనరల్ మెడిసిన్ సీట్లు పొందగా, హైదరాబాద్‌కే చెందిన ఏడో ర్యాంకర్ బల్లిపల్లి అర్జున్ గాంధీ కళాశాలలో జనరల్ సర్జరీలో సీటు పొందాడు. ఇలా టాప్ ర్యాంకర్లందరూ ఉస్మానియా, గాంధీ కళాశాలల్లో చేరేందుకే ఆసక్తి చూపారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా యూనివర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యూని వర్సిటీ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు, సిల్వర్ జూబ్లీ బ్లాక్‌లో పేరెంట్స్ వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇబ్బందులు తలెత్తలేదు. కౌన్సెలింగ్ జరిగే ప్రాంతంలో సైతం ఎప్పటికప్పుడు స్క్రీన్లపై సీట్ల వివరాలు డిస్ప్లే చేయడంతో తాము చేరాలనుకునే కళాశాలల్లో సీట్లు ఎంచుకోవడం విద్యార్థులకు సులభమైంది.