
వాట్సాప్ మాదిరిగానే.. అమెరికాలో 'సిగ్నల్' (Signal) అనే మెసేజింగ్ యాప్‌ను చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. తాజాగా ఈ యాప్ నుంచే యెమెన్ వైమానిక దాడులకు సంబంధించిన ప్రణాళికలు బయటకు పొక్కాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్ కోసం ఆరా తీసేవాళ్లు పెరిగిపోయారు. ఇంతకీ ఈ యాప్ ఏమిటి?, దీనిని ఎవరు ప్రారంభించారు?.. అమెరికా అధ్యక్ష భవనం సిబ్బంది ఈ యాప్‌ను వినియోగించడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా?.. వివరాల్లోకి వెళ్తే..
సిగ్నల్ అనేది మెసేజింగ్ యాప్. దీనిని 'మోక్సీ మార్లిన్‌స్పైక్' (Moxie Marlinspike) రూపొందించారు. సిగ్నల్ యాప్ ద్వారా టెక్స్ట్ మెసేజస్, ఫోటోలు, రికార్డ్స్ వంటివి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ తరహాలోనే మెసేజ్ పంపిన వారు, రిసీవ్ సీగేసుకున్న వారు మాత్రమే సందేశాలను చూడగలరు. ఒక నిర్ణీత సమయం తరువాత సమాచారం కనిపించకుండా చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. మూడో మనిషి చూడటానికి అవకాశం లేదు. అయితే..
సిగ్నల్‌కు వాట్సాప్ కంటే అత్యంత సురక్షితమైనదనే ప్రచారం ఉంది. సురక్షితమైన యాప్ కావడంవల్లే అమెరికాలోని ఫెడరల్ అధికారులు, వైట్‌హౌజ్ సిబ్బంది దీనిని ఉపయోగిస్తుంటారు.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయి
సిగ్నల్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా.. ఏడు కోట్లమంది ఉపయోగిస్తున్నట్లు(ఇప్పటిదాకా డౌన్‌లోడ్లు) గణాంకాలు చెబుతున్నాయి. దీనిని ఎక్కువ మంది ఉపయోగించడానికి ప్రధాన కారణం.. ఇది సాధారణ వాట్సాప్, మెటా మెసెంజర్ కంటే కూడా సురక్షితమైనది కావడమనే ముద్రపడిపోవడం.
లీక్ ఇలా..
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై.. దాడికి సంబంధించిన వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్’ యాప్ గ్రూప్‌చాట్‌లో చర్చిస్తూ 'జెఫ్రీ గోల్డ్‌బర్గ్' అనే సీనియర్ పాత్రికేయుడిని ఆ గ్రూప్‌లో చేర్చుకున్నారు. ఆ తరువాత కీలక సమాచారం లీక్ అయ్యి రచ్చ రాజేసింది.