signal
-
అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్
అంతరిక్షం నుంచి వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారు. మరి వీటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..రేడియో సిగ్నల్స్ గురించి ఇప్పటికే కొన్ని సిద్దాంతాలు ఉన్నప్పటికీ, తాజాగా కనిపించిన వింత సిగ్నల్స్ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచాయి. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ)రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతోంది. ఈ సిగ్నల్ 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతోంది. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి.దీనిపై అధ్యయనం సాగిస్తున్న డాక్టర్ మనీషా కాలేబ్ మాట్లాడుతూ ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్గార స్థితులను ప్రదర్శిస్తుండటం విచిత్రంగా ఉందని, దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. దక్షిణాఫ్రికాలోని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనుక ఏమి ఉందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ నుండి వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిగ్నల్కున్న విచిత్రమైన లక్షణాలు ఇప్పటివరకూ ఉన్న భౌతిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి.న్యూట్రాన్ నక్షత్రాలు, వైట్ డ్వార్ఫ్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి రెండూ భారీ నక్షత్రాల నుండి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. వైట్ డ్వార్ఫ్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం. న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం . వైట్ డ్వార్ఫ్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాగా అంతరిక్షం నుంచి పునరావృతమయ్యే ఇటువంటి రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరడచం ఇదేమీ మొదటిసారికాదు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సిగ్నల్స్‌ను గుర్తించారు. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చినదా, లేదా అంతుచిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చినదా అనేది మరిన్ని పరిశోధనలతో వెల్లడికానుంది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం సాగిస్తున్నారని డాక్టర్ మనీషా కాలేబ్ తెలిపారు. -
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్‌లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్‌ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్‌తో మెసేజ్‌ల షేరింగ్‌లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్‌లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్‌ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్‌లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
Delhi Airport: రన్‌వే వద్ద భారీ క్రేన్.. ప్రమాదంలో పడ్డ విమానాలు
న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు విధినిర్వహణలో భాగంగా చేసిన ఓ పని వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్ కారణంగా విమానాలకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ఐఎల్ఎస్) సిగ్నల్ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి సేఫ్ ల్యాండింగ్‌కు ఐఎల్ఎస్ సిగ్నల్ నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఈ విషయం వారం తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వారు కంగారుపడ్డారు. క్రేన్ కారణంగా సిగ్నల్ సరిగా అందకపోవడంతో 100 దాకా విమానాలు గత వారం ఆలస్యంగా ల్యాండ్ అవడమే కాకుండా కొన్ని విమానాలను ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. ‘ఐఎల్ఎస్ సిగ్నల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్ లైన్ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్ అయ్యాయి’అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవేకు అనుసంధానించే అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్హెచ్ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది. ఇదీచదవండి..సూరీడు కనిపించి ఏడు రోజులైంది -
అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు?
మనదేశంలోని అన్ని రైళ్ల చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు కనిపిస్తుంది. దీనిని భద్రతా నియమాలను అనుసరిస్తూ రూపొందిస్తారు. ఈ ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. అయితే వందేభారత్ రైలు చివరి బోగీకి మాత్రం ఈ ‘X’ గుర్తు కనిపించదు. వందేబారత్ ట్రైన్.. హై స్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ అంతా అటాచ్డ్గా ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల నుంచి పరుగులు పెడుతుంది. అందుకే ఈ రైలుకు ‘X’ గుర్తు ఉండదు. రైల్వే విభాగం పలు భద్రతా చర్యలు చేపడున్న దృష్ట్యా పలు సిగ్నళ్లు, సైన్లను రూపొందించి, ఉపయోగిస్తుంది. ఈ కోవలోనే రైలు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు రూపొందిస్తారు. ఇది రైల్వే అధికారులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. రైలు ఏదైనా స్టేషన్ మీదుగా వెళ్లినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రైలు చివరి బోగీపై ఉన్న ‘X’ గుర్తును చూస్తారు. దానిని గమనించాక ఆ రైలుకు అది చివరి బోగీ అని స్పష్టం చేసుకుంటారు. ఒకవేళ ‘X’ గుర్తు అనేది లేకపోతే.. ఆ రైలుకు వెనుకవైపు గల బోగీలు రైలు నుంచి విడిపోయాయని అర్థం. ఇలా జరిగితే వెంటనే రైల్వే సిబ్బంది కంట్రోల్ రూమ్‌కు పోన్ చేసి, ఆ రైలుకు గల వెనుక బోగీలు ఎక్కడో విడిపోయాయనే సమాచారాన్ని అందిస్తారు. అందుకే ఏ రైలుకైనా చివరి బోగీ వెనక ‘X’ గుర్తు ఉండటం ఎంతో ముఖ్య విషయమని రైల్వే సిబ్బంది భావిస్తారు. వందేభారత్ విషయానికొస్తే దీనికి ‘రైల్వే సురక్షా కవచ్’ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ అనుకోని విపత్తుల నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్పీడు అధికారికంగా గంటకు 160 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటెలిజంట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్‌ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
ఇంటికీ ట్రాఫిక్ ‘సిగ్నల్’ పడాల్సిందే!
ఏదో చిన్న రోడ్డులో భారీ అపార్ట్మెంట్ల సముదాయమో, షాపింగ్ మాల్‌నో నిర్మించారు.. వచ్చీ పోయే వాహనాలు, రోడ్డు పక్కనే పార్క్ చేసే వాహనాలు, జనంతో ట్రాఫిక్ సమస్య మొదలవుతుంది. ఆ రోడ్డులో వెళ్లే వాహనాలూ నిలిచిపోతాయి. మెయిన్ రోడ్డుపైనా ప్రభావం చూపిస్తుంది.. కానీ ఇకపై ఈ సమస్యకు చెక్ పడనుంది. కొత్తగా భారీ భవనాలు, సముదాయాలు నిర్మించాలంటే.. ఆ ప్రాంతంలో అవసరమైన స్థాయిలో రోడ్డు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ సదుపాయాలు ఉండాల్సిందే. లేకుంటే రోడ్డు విస్తరణ, పార్కింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లకు సదరు నిర్మాణదారు బాధ్యత వహించాల్సిందే. ఇప్పటివరకు రోడ్ల వెడల్పును పరిగణనలోకి తీసుకొని పర్మిషన్లు మంజూరు చేసే స్థానిక సంస్థలు.. త్వరలోనే ట్రాఫిక్ రద్దీని కూడా అంచనా వేసి, దానికి అనుగుణంగా అనుమతులు మంజూరు చేయనున్నాయి. చాలా చోట్ల రోడ్ల వెడల్పుతో సంబంధం లేకుండా, పార్కింగ్ స్థలం లేకున్నా.. ఎత్తయిన భవనాలను, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను నివారించడం, కూడళ్లపై ఒత్తిడిని తగ్గించడంపై ట్రాఫిక్ పోలీసు విభాగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే సదరు ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ నివారణ, క్రమబద్ధీకరణకు వీలుగా ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ను కూడా సమర్పించేలా నిబంధన తేవాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగం కలిసి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిసింది. దీని ప్రకారం ఇకపై నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందే.. భవన నిర్మాణ ప్లానింగ్‌లో సెట్‌బ్యాక్, పార్కింగ్ స్థలం, గ్రీనరీ, వర్షపు నీటి గుంతల ఏర్పాటుతో పాటు ‘టీఐఏ’నివేదికనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది అమల్లోకి వస్తే.. దేశంలో టీఐఏ ఆధారంగా నిర్మాణ అనుమతులు జారీచేసే తొలి కార్పొరేషన్‌గా హైదరాబాద్ నిలవనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రోడ్డు వెడల్పు.. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదిత రోడ్డు వెడల్పులను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం అగ్నిమాపకశాఖ, జలమండలి, పర్యావరణం, వాల్టా, నీటి పారుదల శాఖ, విమానాశ్రయం, డిఫెన్స్, రైల్వే విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల (ఎన్ఓసీ)ను జత చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఇలా.. ఇక ముందు ప్రస్తుత పత్రాలకు అదనంగా నిర్మాణదారులు టీఐఏను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక కోసం ‘ఎంప్యానల్డ్ ట్రాఫిక్ కన్సల్టెంట్’ద్వారా అవసరమైన పత్రాలు జత చేస్తూ దరఖాస్తు సమరి్పంచాలి. ఒకవేళ రోడ్డు చిన్నగా ఉంటే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో సదరు ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం భవన యజమాని అదనపు స్థలాన్ని కేటాయించాలి. లేదా లింక్ రోడ్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంత వాటా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలి దశలో 100 అడుగుల నుంచి 250 అడుగుల వెడల్పు ఉండే రహదారులను ఆనుకొని నిర్మించే భవనాలు/ సముదాయాలకు ‘టీఐఏ’నిబంధనలను వర్తింపజేయనున్నారు. కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల భవనాల స్వరూపం, వ్యాపార కార్యకలాపాలను బట్టి టీఐఏను సమరి్పంచాల్సి ఉంటుంది. తర్వాత భారీ నివాస భవనాలకూ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు.. ప్రస్తుతం పార్కింగ్ స్థలం లేకున్నా వాణిజ్య భవనాలకు ఎన్ఓసీలను మంజూరు చేస్తున్నారు. ఫలితంగా ఆ భవనాల నుంచి వచ్చే వాహనా లు, బయట పార్క్ చేసేవాటితో ట్రాఫిక్ సమస్య వస్తోంది.అందువల్ల ట్రాఫిక్ పోలీసుల అనుమతి ఉంటేనే ఎన్ఓసీలు జారీ చేయాలి. 45, 60 అడుగులకుపైన వెడల్పుండే రోడ్ల మీద కట్టేవాటికి, 25 అంతస్తులపైన ఉండే అన్ని భవనాలకు ఈ విధానాన్ని అమ లు చేయడం ఉత్తమం. – కె.నారాయణ్ నాయక్, జాయింట్ సీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ మరో ఎన్వోసీతో మరింత జాప్యం ఇప్పటికే హైరైజ్ భవనాలకు నిర్మాణ ఫీజులతోపాటు ఎక్స్టర్నల్ బెటర్మెంట్ చార్జీలు, ఇంపాక్ట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ సొమ్మును సదరు ప్రాంతంలో డ్రైనేజీ, వాటర్, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే వినియోగించాలి. కానీ ప్రభుత్వం సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా ట్రాíఫిక్ ఎన్ఓసీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదు. ఇప్పుడు పదుల సంఖ్యలో ప్రభుత్వ విభాగాల ఎన్ఓసీల కోసమే నెలల కొద్దీ సమయం పడుతోంది. కొత్తగా మరోటి అంటే జాప్యం ఇంకా పెరుగుతుంది. – సి.శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ -
సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో..
సాక్షి, శివాజీనగర: బెంగళూరు నృపతుంగ రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే హరతాళు హాలప్ప కుమార్తె ప్రయాణి స్తున్న కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు... యలహంక న్యూటౌన్‌కు చెందిన మోహన్ కారు నడుపుతున్నాడు. కారులో ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్ సుష్మిత ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమెను డ్రైవర్ మోహన్ డ్యూటీకి తీసుకెళుతున్నాడు. కోర్టు కాంప్లెక్స్ వద్దకు వచ్చి హడ్సన్ సర్కిల్ ఎడమ వైపునకు తిరిగేందుకు ప్రయత్నించగా సిగ్నల్ పడింది. దీంతో వేగంగా వచ్చిన మోహన్ రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలకు ఢీకొన్నాడు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతులను హెచ్బీఆర్ లేఔట్‌కు చెందిన మజీద్ ఖాన్ (36) కే.జీ.హళ్లికి చెందిన అయ్యప్ప (60)లుగా గుర్తించారు. సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్సలేటర్ తొక్కి.. సిగ్నల్ వద్దకు రాగానే బ్రేక్ వేయకుండా ఎక్సలేటర్‌పై కాలుపెట్టడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ మోహన్ పోలీసుల ముందు తప్పు ఒప్పుకొన్నాడు. పోలీసులు అతని వాంగ్మూలన్ని రికార్డు చేసుకున్నారు. వాహనం నడిపే సమయంలో మోహన్ ఫోన్లో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే విషయంపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేఏ 50 ఎంఏ 6600 నంబర్ కలిగిన కారుపై ఎమ్మెల్యే హాలప్ప పేరున్న స్టిక్కర్ అంటించి ఉంది. ఈ కారు యలహంకకు చెందిన రాము సురేశ్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇతను ఎమ్మెల్యేకు చెందిన మనిషిగా భావిస్తున్నారు. డ్రైవర్ ర్యాష్‌గా వాహనాన్ని నడుపుకుంటూ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్లను ఉపయోగించటం నేరం: ప్రమాదానికి కారణమైన ఇన్నోవాకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. రాజకీయ నాయకులు ఉపయోగించని వాహనాలపై ఎమ్మెల్యే స్టిక్కర్లను ఉపయోగించటం చట్ట వ్యతిరేకం. హలసూరు గేట్ స్టేషన్లో కేసు: డ్రైవర్ మోహన్‌ను ఆల్కోమీటర్ పరీక్షించగా మద్యం సేవించలేదని తేలిందని డీసీపీ (ట్రాఫిక్) కళా కృష్ణస్వామి తెలిపారు. హలసూరు గేట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: ఇటీవలే పెళ్లి, అంతలోనే ఆత్మహత్య ) -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్
-
అందరి చర్చా.. ‘సాఫ్ట్’ సిగ్నల్ పైనే!
‘స్పష్టత లేదు’... లెక్క లేనన్ని సార్లు రీప్లేలు చూసిన తర్వాత మూడో అంపైర్ వీరేందర్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నాలుగో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను మలాన్ ఎలా పట్టాడో అందరికీ స్పష్టంగా కనిపించింది. బంతి గ్రౌండ్‌కు తాకిన విషయం టీవీల ముందు కూర్చున్న లక్షలాది మందికి, మైదానంలో ఉన్న ఆటగాళ్లకూ తెలుస్తోంది. కానీ అంపైర్‌కు మాత్రం అది నాటౌట్ అనిపించలేదు. అందుకే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సూర్యను అంపైర్ పెవిలియన్‌కు పంపించాడు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అలా ఎలా ఇచ్చాడు అనేది సగటు అభిమానికి అర్థం కాలేదు. అందుకు కారణం ‘సాఫ్ట్ సిగ్నల్’. ఇప్పుడు ఇదే ‘సాఫ్ట్’ నిర్ణయం క్రికెట్లో కొత్త చర్చకు దారి తీసింది. -సాక్షి క్రీడా విభాగం నాలుగో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ఉంటే ఎలా ఉండేది? సహజంగానే సూర్యకుమార్ అవుట్‌పై మరింత రచ్చ జరిగేది. ఓటమికి అంపైర్ తప్పుడు నిర్ణయమే కారణమని అన్ని వైపుల నుంచి మాజీలు, విశ్లేషకులు విరుచుకు పడేవారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. తనకు కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో నిబంధనలు మార్చాలంటూ సహజంగానే డిమాండ్లు ముందుకు వచ్చాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి... సూర్యకుమార్ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఒకవైపు థర్డ్ అంపైర్‌కు నివేదిస్తూనే మరోవైపు తన వైపుగా ‘అవుట్’ అంటూ వేలెత్తి చూపించేశాడు. ఇదే ‘సాఫ్ట్ సిగ్నల్’. అంటే తనకు ఎలా అనిపించిందనే విషయాన్ని అతను స్పష్టంగా చెప్పేశాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసిన తర్వాత ‘ఇన్‌కన్‌క్లూజివ్’ అంటూ స్పష్టంగా కనిపించడం లేదని తేల్చేశాడు. కాబట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే సరైందని ప్రకటించడంతో అది అవుట్‌గా తేలింది. ఈ రకంగా చూస్తే ఇద్దరూ అంపైర్లూ తమ పరిధిలో సరిగ్గానే విధులు నిర్వర్తించారు. అయితే రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో థర్డ్ అంపైర్‌ను తప్పు పట్టలేం. కానీ సూర్య విషయంలో అంతా స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ అలా తేల్చడమే వివాదం ముదరడానికి కారణమైంది. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ ఎందుకు స్పందించాలి, రనౌట్ల తరహాలో నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయవచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయం తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. దీనినే ఇప్పుడు తొలగించాలని అందరూ చెబుతున్నారు. ‘సాఫ్ట్’ వెనుక కారణమిదీ... సాంకేతికత ఎంత గొప్పగా ఉన్నా దానిని ఆపరేట్ చేసేది మానవమాత్రులే కాబట్టి 100 శాతం దానిపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా సరిగ్గా ఇదే కారణంతోనే. బాల్ ట్రాకింగ్ ఎలా చూపించినా అంపైర్ దృష్టిలో బంతి ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే ఆధారపడి నిర్ణయాలు ప్రకటిస్తాడు. సూర్యకుమార్‌లాంటి క్యాచ్‌ల విషయంలో కొన్నిసార్లు ఫీల్డర్ స్పందన, ముఖకవళికలు కూడా అంపైర్లను ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ఇలాంటి సందర్భాల్లో మహా నటుల్లా కనిపించే ఆటగాళ్లను పూర్తిగా నమ్మడం కూడా సరైంది కాదు. అయితే సగటు అభిమానికి అర్థంకాని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ‘ఒక మ్యాచ్‌కు కనీసం 10 కెమెరాలు వాడితే అందులో 2 సూపర్ స్లో మోషన్ కెమెరాలు ఉంటాయి. అవి కూడా పూర్తిగా స్పష్టతనివ్వలేవు. ఇప్పుడు వాడుతున్న కెమెరాలు 2డి మాత్రమే. అన్ని స్పష్టంగా కనిపించాలంటే 3డి కెమెరాలు వాడాలి. పైగా పెద్ద జట్లు మినహా అన్ని సిరీస్‌లకు ఇలాంటివి వాడటంలేదు. అబుదాబిలో జరుగుతున్న అఫ్గానిస్తాన్, జింబాబ్వే సిరీస్‌లో అసలు అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) లేదు. కాబట్టి అందరికీ ఒకే రూల్ అనే నిబంధన పని చేయదు’ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అంటే ఏదో ఒక దశలో అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే కాబట్టి ఆ అవకాశం ఫీల్డ్ అంపైర్‌కే ఇస్తున్నట్లు లెక్క. కీలక మ్యాచ్‌లలో ఇలాం టివి తుది ఫలితాన్ని మార్చేయవచ్చు. అసలు అంపైర్ అవుట్గానీ నాటౌట్కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా. అందరికీ అర్థమయ్యే తరహాలో ఒకే రకమైన నిబంధనలు రూపొందించాలి. –కోహ్లి, భారత కెప్టెన్ -
ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం!
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది. వాట్సాప్ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో .. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాట్సాప్ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ యాప్ డౌన్లోడ్లు లక్షల సంఖ్యలో పెరిగాయని సిగ్నల్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ వెల్లడించారు. ఇక భారత మార్కెట్లో తమకు అంచనాలు మించిన ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘గడిచిన కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో వృది నమోదైంది. 40 దేశాల్లో ఐవోఎస్ యాప్ స్టోర్‌లో మాది టాప్ యాప్‌గా ఉంది. అలాగే 18 దేశాల్లో గూగుల్ ప్లేలో నంబర్ వన్‌గా నిల్చింది. ఈ రెండు సిస్టమ్స్‌లో 1 కోటి పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గడిచిన మూడు–నాలుగు రోజుల్లో అసాధారణ వృద్ధి, యూసేజీ కనిపిస్తోంది. ఇదేమీ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు‘ అని యాక్టన్ తెలిపారు. సరళతరమైన .. సులువైన నిబంధనలు, ప్రైవసీ పాలసీతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2009లో వాట్సాప్‌ను జాన్ కౌమ్‌తో కలిసి యాక్టన్ నెలకొల్పారు. ఆ తర్వాత వాట్సాప్‌ను కొనుగోలు చేసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ .. దాన్నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు అనుసరించిన విధానాలు నచ్చక యాక్టన్ బైటికొచ్చేశారు. మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి సిగ్నల్‌ను ప్రారంభించారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా యూజర్ల డేటాను పంచుకునే విధంగా పాలసీని అప్డేట్ చేస్తున్నామని, తమ యాప్‌ను వాడాలంటే కచ్చితంగా ఇందుకు సమ్మతించాల్సి ఉంటుందని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై చిర్రెత్తుకొచ్చిన యూజర్లు పొలోమంటూ ప్రత్యామ్నాయ యాప్స్ వైపు మళ్లుతున్నారు. టెలిగ్రాం రయ్... ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటినట్లు టెలిగ్రాం వెల్లడించింది. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా 2.5 కోట్ల మంది యూజర్లు చేరినట్లు వివరించింది. భారత్‌లో యూజర్ల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ .. కొత్త యూజర్లు .. ఆసియాలో అత్యధికంగా 38 శాతం మంది చేరినట్లు వెల్లడించింది. యూరప్ (27 శాతం), లాటిన్ అమెరికా (21 శాతం), మధ్య ప్రాచ్యం.. ఉత్తర ఆఫ్రికా ప్రాంతం (8 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సెన్సార్ టవర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో జనవరి 6–10 తారీఖుల మధ్య కొత్తగా 15 లక్షల మేర టెలిగ్రాం డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులో త్వరలోనే 100 కోట్ల యూజర్ల మార్కును సాధించగలమని టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘గత ఏడేళ్లలో అనేకసార్లు డౌన్లోడ్లు ఒకేసారిగా పెరిగిపోవడం జరిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం కాస్త భిన్నమైనది. ఉచిత సర్వీసుల కోసం తమ ప్రైవసీని పణంగా పెట్టేందుకు యూజర్లు సిద్ధంగా లేరు. ప్రారంభం నుంచీ మేం యూజర్ల వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇతర యాప్‌లలాగా ఆదాయం కోసం మేం జవాబు చెప్పుకునేందుకు టెలిగ్రాంలో షేర్హోల్డర్లు గానీ ప్రకటనకర్తలు గానీ లేరు. ఇప్పటిదాకా మా యూజర్ల వ్యక్తిగత డేటా ఏదీ కూడా ఎవరికీ వెల్లడించలేదు‘ అని దురోవ్ పేర్కొన్నారు. -
మస్క్ రాంగ్ ‘సిగ్నల్’.. షేరు పరుగు!
ఒక శక్తివంతమైన మాట.. కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంటుంది. ఇందుకు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్.. వాట్సాప్.. సిగ్నల్ ఉదంతమే నిదర్శనం. మెసేజింగ్ కోసం సిగ్నల్ యాప్‌ను వాడాలంటూ మస్క్ ఇచ్చిన పిలుపుతో సిగ్నల్ షేరు భారీ స్థాయిలో ఎగిసింది. కానీ, చిత్రమేమిటంటే.. మస్క్ చెప్పిన సిగ్నల్ అనే కంపెనీ అసలు స్టాక్ ఎక్సే్ఛంజీల్లోనే లిస్టే కాలేదు. వాస్తవానికి ఈ సిగ్నల్‌కు దక్కాల్సిన క్రెడిట్ అంతా అదే పేరున్న మరో లిస్టెడ్ కంపెనీకి దక్కింది. వివరాల్లోకి వెళితే.. మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే తన ప్రైవసీ నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. వీటి ప్రకారం యూజర్లకు సంబంధించిన పలు వివరాలను అది మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా పంచుకోనుంది. ఇందుకు సమ్మతించిన యూజర్లకు మాత్రమే తమ యాప్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. సాధారణంగానే వ్యక్తిగత వివరాల గోప్యతకు ప్రాధాన్యమిచ్చే యూజర్లకు ఈ కొత్త నిబంధనను చూస్తే చిర్రెత్తుకొచ్చింది. ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఇలాంటి యూజర్లలో ఒకరు. వాట్సాప్‌కు గుడ్‌బై చెప్పి ఇలాంటి ప్రైవసీ నిబంధనల బాదరబందీ లేని సిగ్నల్ అనే యాప్‌కు మారిపోవాలంటూ పిలుపునిచ్చారు. దీంతో సిగ్నల్ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దెబ్బతో యూజర్లు చేజారకుండా చూసుకునేందుకు వాట్సాప్ పలు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. యాప్‌లకు సంబంధించి ఇక్కడి వరకూ కథ బాగానే ఉన్నప్పటికీ.. ఈ నాలుగైదు రోజుల్లో అమెరికన్ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అడ్వాన్స్ షేరు రయ్... మస్క్ చెప్పిన సిగ్నల్ అనేది ఒక లాభాపేక్ష లేని ఓ సంస్థ నిర్వహణలోని మెసేజింగ్ యాప్. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రాం వంటి వాటికి ప్రత్యామ్నాయం మాత్రమే. దీనికి స్టాక్ ఎక్సే్చంజీలకు సంబంధం లేదు. అయితే, ఇదే పేరుతో సిగ్నల్ అడ్వాన్స్ అనే మరో లిస్టెడ్ కంపెనీ ఉంది. మస్క్ సూచించిన సిగ్నల్ ఇదే అయి ఉంటుందనుకున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. సిగ్నల్ అడ్వాన్సెస్ షేరు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ షేరు ఒకే రోజు ఏకంగా 527 శాతం ఎగిసింది. ఆ తర్వాత రోజు మరో 91 శాతం పెరిగింది. దీంతో ఆరేళ్లుగా ఏనాడు 1 డాలరు మార్కు కూడా దాటని సిగ్నల్ అడ్వాన్స్ షేరు ధర 60 సెంట్ల స్థాయి నుంచి ఏకంగా 7.19 డాలర్లకు దూసుకెళ్లిపోయింది. మార్కెట్ క్యాప్ 55 మిలియన్ డాలర్ల నుంచి అమాంతంగా 600 మిలియన్ డాలర్లకు ఎగిసింది. చివరికి సదరు సిగ్నల్ అడ్వాన్స్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని సిగ్నల్ మెసేజింగ్ యాప్ స్వయంగా వివరణ ఇచ్చుకుంటే తప్ప షేరు పరుగు ఆగలేదు. గతంలోనూ.. ఇలా ఇన్వెస్టర్లు ఒక కంపెనీ బదులు మరో కంపెనీ షేరు కోసం ఎగబడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జూమ్ వీడియో కమ్యూనికేషన్ అనే సంస్థ లిస్టయిన రోజున దాదాపు అలాంటి పేరే ఉన్న జూమ్ టెక్నాలజీస్ అనే కంపెనీ షేరు .. రెండు గంటల వ్యవధిలో 80 శాతం పైగా ఎగిసింది. అయితే, తేడా తెలిసిన తర్వాత అదంతా తగ్గిపోయి చివరికి 10 శాతం లాభంతో క్లోజయ్యింది. ఇక మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ట్విట్టర్ లిస్టింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న మార్కెట్ వర్గాలు ట్వీట్టర్ హోమ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ అనే సంస్థ షేర్లను ఎడాపెడా కొనేశారు. దీంతో దాని షేరు 1,000 శాతం పైగా పెరిగిపోయింది. -
మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?
వాట్సాప్ 2021లో కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై చాలా విమర్శలు వస్తున్నాయి. దింతో చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా మరింత సెక్యూరిటీ అందించే సిగ్నల్ యాప్ వైపు ఎక్కువ యూజర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం కొద్దీ రోజుల క్రితం ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ " సిగ్నల్ వాడండి" అని ఒక మెసేజ్ ట్విటర్ లో పెట్టాడు. దింతో అప్పటి నుండి సిగ్నల్ యాప్ వాడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.(చదవండి: వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..?) అయితే, కొత్తగా సిగ్నల్ యాప్ ను ఉపయోగించే చాలా మంది వినియోగదారులు తమ బంధువులును, మీత్రులను ఇందులో ఎలా యాడ్ చేయాలో వారికీ అర్ధం కావడం లేదు. కానీ, యూజర్లు వాట్సాప్ తరహాలనో సులభంగా మీ మిత్రులను ఇందులోకి జోడించవచ్చు. మీ మిత్రులు కూడా సిగ్నల్ యాప్ వాడుతుంటే మీ పని ఇంకా చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు, మీరు సిగ్నల్ యాప్‌లో కుడి ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. షేర్ విత్ కాంటాక్ట్స్ లేదా చూస్ హౌ టూ షేర్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు హౌ టూ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కనిపిస్తున్న లింకును ఇతర గ్రూప్ లలో షేర్ చేసి ఆహ్వానించవచ్చు. -
వాట్సాప్ కి పోటీగా 'సిగ్నల్' యాప్
వాట్సాప్ రెండు రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను అంగీకరించకపోతే వారి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 8 నుంచి పనిచేయదని సంస్థ పేర్కొంది. ఈ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్బుక్ సంబంధిత సర్వీసులతో యూజర్ డేటా పంచుకోవడమమనేది ముఖ్యమైన అంశం. యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకోనుంది.(చదవండి: పెరిగిన షియోమీ స్మార్ట్ టీవీ ధరలు) A lot of people have been asking how to move their group chats from other apps to Signal, and Signal group links are a great way to get started. Drop a group link into your former chat app of choice like you're dropping the mic on the way out. pic.twitter.com/q49DeZufBG — Signal (@signalapp) January 7, 2021 అయితే, ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి వాట్సాప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర మెసెంజర్ యాప్ ల వైపు చూస్తున్నారు. ఇవి గోప్యతకు పరంగా కట్టుదిట్టంగా ఉంటాయి. టెస్లా సీఈఓ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ గురువారం వినియోగదారులను "సిగ్నల్ వాడండి" అని కోరారు. దీంతో ఒక్కసారిగా 'సిగ్నల్' మెసెంజర్ యాప్ డౌన్లోడ్ సంఖ్య భారీగా పెరిగింది. చాలా మంది కొత్త వ్యక్తులు సిగ్నల్ గ్రూప్ లింక్ ద్వారా మెసేజింగ్ ప్లాట్ఫామ్లో చేరడానికి ప్రయత్నించడంతో యాప్‌లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు "సిగ్నల్" సంస్థ ట్వీట్ చేసింది. గ్రూప్ లింక్‌ను ఉపయోగించి ఇతర మెసెంజర్ యాప్ ల నుంచి సిగ్నల్ యాప్‌కి చేరుకోవడానికి ఏ విధంగా చేరుకోవాలో తెలియజేసే గైడ్‌ను కంపెనీ విడుదల చేసింది. రెండు యాప్ ల మధ్య యూజర్లు తమ చాట్లను తరలించలేరని గమనించాలి. -
ఎవరెస్ట్ పర్వతంపైనా 5జీ సిగ్నల్
బీజింగ్: ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సిగ్నల్ లభించనుంది. టిబెట్ చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుందని చైనా తెలిపింది. ప్రస్తుతం 5,800 మీటర్ల వరకు బేస్ క్యాంప్ లు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్ స్టేషన్లో పనులు ప్రారంభం కావడంతో శిఖరంపై వరకు 5జీ అందుబాటులోకి వచ్చింది. ఎవరెస్ట్‌పై 5జీ స్టేషన్లను నిర్మించడం చాలా శ్రమతో కూడుకున్నదని, వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 10 మిలియన్ యువాన్ల(1.42 మిలియన్ డాలర్లు)కు చేరుకుంటుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు చెప్పినట్టు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులకు సమాచారం అందించడానికి 5జీ స్టేషన్లు సహాయపడతాయి. కార్మికులను, పరిశోధకులను రక్షించడానికి 5జీ నెట్వర్క్ దోహపడుతుందని నిపుణులు అంటున్నారు. 5జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో ఐదవ తరంగా పేర్కొంటున్నారు. వేగవంతమై డేటాతో పాటు ఎక్కువ బ్యాండ్‌విడ్త్, నెట్వర్క్ సామర్థ్యాన్ని 5జీ కలిగివుంటుంది. ఎక్కువ పరికరాలు కనెక్ట్ చేయడానికి, అత్యంత నాణ్యతతో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవడానికి, టెలిమెడిసిన్‌కు 5జీ మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. (అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు) -
సిగ్నల్‌ను దాటు.. లేదంటే..
సాక్షి, బెంగళూరు: సిగ్నల్‌ను తొందరగా దాటు.. లేదంటే అత్యాచారం చేస్తానంటూ ద్విచక్రవాహనదారుడు కారు నడుపుతున్న మహిళను బెదిరించిన ఘటన బెంగళూరులోని తిలక్‌నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. తిలక్నగరలోని బీలాల్ మసీదు వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో కారులో వెళ్తున్న ఓ మహిళ వాహనాన్ని నిలిపింది. అయితే దారి వదలాలని కారు వెనుక ద్విచక్రవాహనంలో వచ్చిన చంద్రశేఖర్ హారన్ కొట్టాడు. అనంతరం కారు వద్దకు వచ్చి దుర్భాషలాడాడు. తనకు దారి వదలకపోతే రేప్ చేస్తానంటూ బెదిరించాడు. అంతటితో వదలకుండా కారును వెంబడించాడు. దారి మధ్యలో కారును అడ్డుకొని ఆమె చేయి పట్టుకున్నాడు. ఫొటోగ్రాఫరైన ఆ మహిళ చంద్రశేఖర్‌కు చెందిన బైక్ నంబర్‌ను ఫొటో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు. -
హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక
హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక హార్బర్, 2వ నంబర్, ప్రమాదం harber, 2nd, danger, signal 2nd danger signal ina Nizampatnam port నిజాంపట్నం: తరుముకొస్తున్న తుఫాను ముప్పుతో తీరంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కయాంత్ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తీర ప్రాతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను హెచ్చరికల ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కయాంత్ తుఫాను శుక్రవారం కావలి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతుండటంతో తీరంలో అలజడి నెలకొంది. తీరం దాటే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని తీరవాసులు అంటున్నారు. -
భద్రాద్రికి ‘గ్రీన్’ సిగ్నల్
- కమిటీ నివేదిక నిర్మాణానికి అనుకూలం - అనుమతుల మంజూరుకు కేంద్ర మంత్రిత్వశాఖ కసరత్తు - పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా కాంట్రాక్టర్లు - ఆనందంలో నిర్వాసిత యువత పినపాక : ఆర్నెల్లుగా ఆగిపోయిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ కొనసాగనుంది. దీనికి అనుకూలంగా గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కమిటీ నివేదిక సమర్పించింది. కేవలం 30 శాతం మాత్రమే పర్యావరణానికి హాని జరుగుతున్నట్లు.. మిగిలిన 70 శాతం ఎటువంటి ముప్పులేదని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ అనుమతులతో కాంట్రాక్టర్లు, కూలీలు పనులకు సిద్ధమవుతుండగా... నిర్వాసిత నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పినపాక, మణుగూరు మండలాల సరిహద్దు ఉప్పాక పంచాయతీ సీతారాంపురం వద్ద తలపెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆర్నెల్లుగా నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా కమిటీ నివేదిక సమర్పించినట్లు తేలడంతో ప్రభావిత గ్రామాల్లో యువత హర్షం వెలిబుచ్చుతోంది. రెండు మండలాల సరిహద్దులో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఒకే ప్రాంతంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ బీహెచ్ఈఎల్కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. భూసేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం, నిర్వాసిత యువతకు ఐటీఐలో శిక్షణ తదితర కార్యకలాపాలు చకచకా సాగిపోయాయి. పవర్ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని, గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు దాఖలు కావడంతో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు 6 నెలల క్రితం ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పలు సందర్భాల్లో పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నియమించిన కమిటీ సందర్శించింది. ఈ కమిటీ సభ్యులు పలు దఫాలు పవర్ప్రాజెక్టు నిర్మాణప్రాంతంలో చేసిన పనులు, తీసుకున్న జాగ్రత్తలు, పర్యావరణానికి కలిగే నష్టం తదితర అంశాలపై అధ్యయనం చేశారు. కమిటీ నివేదిక అనుకూలం భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి వాటిల్లే నష్టం చాలా తక్కువని కమిటీ నివేదికలో పేర్కొనట్లు సమాచారం. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు సీఆర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులు భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం జరిగే సుమారు 200 ఎకరాలను పరిశీలించారు. ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న జల వనరులు, వాటికి కలిగే నష్టం, ప్రాజెక్టు నిర్మిస్తే వెలువడే కాలుష్యం తదితర అంశాలపై కమిటీ సభ్యులు లోతుగా పరిశీలన చేశారు. దీని ప్రకారం పర్యావరణానికి పెద్దగా ముప్పు వాటిల్లదని నిర్ధారించినట్లు సమాచారం. కమిటీ కాలపరిమితి కేవలం 8 వారాలు మాత్రమే ఉండటంతో నివేదిక సమర్పించడానికి కాస్త ఆలస్యమైంది. కాలపరిమితి ముగిసిందనే పేరుతో వెంటనే నూతన కమిటీని నియమించినట్లు తెలిసింది. పాత కమిటీ సేకరించిన సమాచారం ఆధారంగా నూతన కమిటీ కేంద్రమంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. అనుమతులు మంజూరు చేయనున్న కేంద్రం! భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ ప్రాంతంలో పర్యటించి సేకరించిన సమాచారం ఆధారంగా కమిటీ అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పలు దఫాలు కేంద్రమంత్రులను కలిసినట్లు వినికిడి. నూతన కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే అనుమతులు రాన్నుట్లు ఇప్పటికే రాష్ట్రమంత్రులు బహిరంగ సభల్లో కూడా ప్రకటించారు. సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆర్నెల్లుగా ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు, కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. కమిటీ నివేదిక అనుకూలంగా ఉందని, అనుమతులు వస్తాయని తెలియడంతో కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టేందుకు కార్యాచరణ తయారు చేసుకుంటున్నారు. కూలీల సేకరణ, యంత్రాల మరమ్మతులు చేసుకుంటున్నారు. అధికారికంగా అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు మైనర్ పనులు చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. నిర్వాసిత యువతలో హర్షాతిరేకం భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరవుతాయనే సమాచారంతో నిర్వాసిత యువత హర్షం వ్యక్తం చేస్తోంది. పవర్‌ప్లాంట్ పరిధిలో సుమారు 350 మంది నిర్వాసిత యువత భూములు కోల్పోయింది. ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పిస్తామనడంతో మణుగూరు, కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిన తర్వాత వారంతా ఆందోళనలో పడ్డారు. అనుమతులు వస్తాయనే సమాచారంతో వారిలో ఆనందం తొణికిసలాడుతోంది. తాజా కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. -
నో సిగ్నల్
ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ ఏర్పాటయ్యేనా... కాబోయే జిల్లా కేంద్రం... ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కరువు పాతబస్టాండ్‌లో ట్రాఫిక్ లైట్లు లేకపోవడంతో అస్తవ్యస్తం జగిత్యాల అర్బన్ : కాబోయే జిల్లా కేంద్రం. గ్రేడ్–1 మున్సిపాలిటీ. అయినా ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేదు. పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రధాన కేంద్రం టవర్‌సర్కిల్ నుంచి చుట్టూ మూడు కి లోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకోసం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. 1989 మాస్టర్‌ప్లాన్ ఇప్పటికీ అమలుకావడంతో ఇరుకైన రోడ్లతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన సెంటర్లు అయిన కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తా, టవర్‌సర్కిల్ సమీపంలో కూడళ్ల వద్ద కనీసం ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీచోట ట్రాఫిక్ పోలీసులను నియమించినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు మున్సిపల్ సమావేశంలో ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. గతంలో ఎమ్మెల్యే ఎల్.రమణ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అయినా అమలుకు నోచుకోలేదు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ చూపి ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘డెమో’కు బ్రేక్
– నంద్యాల– ఎర్రగుంట్ల మార్గం ప్రారంభంలో జాప్యం – భారీ ఏర్పాట్ల పేరుతో ఆలస్యం – రైల్వేస్టేషన్లలో పూర్తికాని సిగ్నల్ పనులు కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో డెమో రైలు ప్రారంభానికి బ్రేక్ పడింది. ఆగస్టు 2వ తేదీ నుంచి డెమో రైలు తిరగాల్సి ఉండగా రైలు మార్గం ప్రారంభోత్సవం పేరుతో జాప్యం కానుండటంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఈ మార్గంలో రైలు కూత కోసం మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. కడప జిల్లా యర్రగుంట్ల నుంచి నంద్యాల సమీపంలోని 20 కి.మీ. వరకు 123కిలో మీటర్లు ఉన్న ఈ లైన్లో ఐదేళ్ల క్రితమే మొదటి విడతలో ఎర్రగుంట్ల నుంచి సంజామల మండలం నొస్సం వరకు రైల్వే ట్రాక్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన రెండు విడతల్లో సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మద్దూరు వరకు ట్రాక్, ఆయా ప్రాంతాల్లో స్టేష్టన్లు, క్రాసింగ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఫేస్–1లో సంజామల మండలంలోని నొస్సం వరకు, ఫేస్ –2లో అక్కడి నుంచి పాణ్యం మండలం మద్దూరు వరకు ట్రయల్ రన్, ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు రైల్వే సేఫ్టీ కమిషనర్ డీకే సింగ్ ట్రాక్ నాణ్యతను పరిశీలించి రైళ్ల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గత నెలలో ఈ మార్గాన్ని గుంటూరు– గుంతకల్లు రైల్వే లైన్లతో అనుసంధానం చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి నంద్యాల– ప్రొద్దుటూరు మధ్య వారంలో రెండు పర్యాయాలు డెమో రైలు తిరగేలా టైంబుల్ రూపొందించారు. డెమో రైలు తర్వాత ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు కొనసాగాల్సి ఉంది. అయితే వివిధ కారణాల దష్ట్యా డెమో రైలు తిప్పడం రద్దు అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రూ. 950 కోట్లతో రైల్వేలైన్ ఏర్పాటు చేయడంతో రైల్వేలైన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న ఉద్ధేశంతో డెమోరైలు ప్రారంభానికి మరింత ఆలస్యం చేస్తున్నటు సమాచారం. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ సమస్యల కారణంగా డెమో రైలు తిరగకపోవడంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు నిరాశ చెందుతున్నారు. -
ఫేస్ బుక్ మెసెంజర్ కొత్త ఫీచర్
ఫేస్ బుక్ తన మెసెంజర్ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం తన మెసెంజర్ యాప్ లో డిజిటల్ సంభాషణలను హ్యాకింగ్ బారి నుంచి కాపాడటానికి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. 900మిలియన్ యూజర్లున్న ఈ మెసెంజర్ యాప్ కు లిమిటెడ్ గా టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ఫేస్ బుక్ వెల్లడించింది. మెసేజింగ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తన వాట్సాప్ యాప్ కు మూడు నెలల క్రితమే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రవేశపెట్టింది. 100 కోట్ల మంది యూజర్లున్న ఈ ఈ వాట్పాప్ యాప్ ను 2014లో ఫేస్ బుక్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్క్రిప్టెడ్ సంభాషణ యూజర్లు పంపించే వీడియోలకు, పేమెంట్లకు వర్తించదని ఫేస్ బుక్ తెలిపింది. వాట్సాప్ కు వాడిన ఎన్ క్రిప్షన్ టెక్నాలజీనే ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా వాడనుంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్ మెసేజ్ లు ఎన్క్రిప్టెడ్ అవుతాయి. అదనపు భద్రతా రక్షణతో మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజిటల్ కమ్యూనికేషన్లో జరిగే ఈ గూఢచర్య సంభాషణలు చట్టాలకు సహకరించాలని ప్రభుత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ వల్ల ఉగ్రవాద చర్యలు పెరిగే అవకాశముందంటున్నారు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంటాయి. యాపిల్ ఇంక్ ఐమెసేజింగ్ ప్లాట్ ఫాంలకు, లైన్, సిగ్నల్, వైబర్, టెలిగ్రాం వంటి ఇతర యాప్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి. -
ఈ ఐఫోన్ ట్రిక్ మీకు తెలుసా?
మీరు ఐఫోన్ వాడుతున్నారా? కొన్నిసార్లు మీ ఐఫోన్ లో సిగ్నల్ ఫుల్ గా చూపిస్తూ.. కనీసం ఒక మెసేజ్ పంపినా వెళ్లడం లేదా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. పైకి ఫుల్ గా సిగ్నల్ కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్న సిగ్నల్ స్ట్రెంథ్ ఎంత అనేది ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐఫోన్ లో సిగ్నల్ చూపే గీతలు (బార్స్) సిగ్నల్ రేంజ్ ను మాత్రమే తెలుపుతాయి. కానీ సిగ్నల్ సామర్థ్యాన్ని కాదు. కొన్నిసార్లు సిగ్నల్ రేంజ్ లో ఉండటంతో ఈ బార్స్ ఫుల్ గా కనిపిస్తాయి. కానీ మెసేజ్ చేయాలన్న, కాల్ చేయాలన్న మీ ఐఫోన్ స్ట్రగుల్ అవుతుంటుంది. ఇలాంటి సమయంలో మీ ఐఫోన్ లోని సిగ్నల్ స్ట్రెంథ్ ఎంతో తెలుసుకోవడానికి ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. యాక్సెస్ ఫీల్డ్ టెస్ట్ మోడ్: ఇందుకు *3001#12345#*కి కాల్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఫీల్డ్ టెస్ట్ మోడ్ లోకి మారుతుంది. సిగ్నల్ సంఖ్యరూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు లాక్ బటన్ గట్టిగా నొక్కి.. పవర్ ఆఫ్ (స్విచ్ఛాఫ్) బటన్ కనిపించేవరకు ప్రెస్ చేయాలి. దాదాపు ఆరు సెకండ్ల పాటు ఇప్పుడు హోమ్ బటన్ ను ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఫోన్ హోమ్ స్క్రీన్ లోకి వెళుతుంది. సిగ్నల్ స్ట్రెంథ్ నంబర్ రూపంలో ఉంటుంది. స్ట్రెంథ్, రేంజ్ ను మార్చి చూసుకోవాలంటే బార్స్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది. సిగ్నల్ స్ట్రెంథ్ ఇలా కనిపిస్తుంది. మీకు సిగ్నల్ స్ట్రెంథ్ సంఖ్య నెగిటివ్ (రుణాత్మక) రూపంలో కనిపిస్తుంది. ఈ సంఖ్య జీరోకు చేరువగా ఉంటే మీ సిగ్నల్ స్ట్రెంథ్ చాలా బాగా ఉన్నట్టు అర్థం 0 నుంచి -80 వరకు ఉంటే మంచి సిగ్నల్ ఉన్నట్టు భావిస్తారు. -100 నుంచి -120 మధ్య ఉంటే మీ ఐఫోన్ సిగ్నల్ చాలా దారుణంగా ఉన్నట్టు అర్థం మళ్లీ బ్యాక్ రావాలంటే... మళ్లీ ఈ నెంబర్ (*3001#12345#* )ను డయల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ మాయమై.. మీరు మాములు మోడ్ లోకి వచ్చేస్తారు. -
యాంకర్ దంపతులపై విదేశీయుడి దాడి
స్నిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చుకదా అంటే దాష్టీకం నిందితుడి రిమాండ్ చిక్కడపల్లి: సిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చు కదా... అన్న పాపానికి టీవీ యాంకర్ ఆమె భర్తపై ఓ విదేశీయుడు దాడి చేశాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎం.సుదర్శన్ కథనం ప్రకారం... ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే మార్గంలోని అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ చానల్లో యాంకర్/న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి తన భర్త ముత్యంతో కలిసి బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి చానల్ ఆఫీసుకు వెళ్తోంది. మార్గం మధ్యలో అశోక్‌నగర్ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకే వాహనంపై వచ్చిన సిరియా దేశస్తుడు సాద్ అబ్దుల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి బైక్‌ను పక్కకు జరపమన్నాడు. రెడ్ సిగ్నల్ ఉంది కదా... కొద్ది సెకన్లు ఆగితే వెళ్లిపోవచ్చు కదా అని అంది. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్ మున్నమ్.. శివజ్యోతి చెంపపై కొట్టాడు. ఎందుకు కొడుతున్నావని ఆమె భర్త ప్రశ్నించగా.. ఆయనపై కూడా చెయ్యి చేసుకొని తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అబ్దుల్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు అబ్దుల్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి. 'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది. -
రోబో కాప్..
రోబో కాప్.. ఈ రోబో ట్రాఫిక్ పోలీస్.. అంతేకాదు.. ట్రాఫిక్ సిగ్నల్ కూడా.. అంతేకాదు.. సీసీ కెమెరా కూడా.. కాంగోలోని కిన్షాసాలో ట్రాఫిక్ పోలీసుల స్థానంలో తాజాగా వీటిని ప్రవేశపెట్టారు. ఈ రోబో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంది. తన రెండు చేతులకున్న రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌ను దీని కోసం ఉపయోగిస్తుంది. పోలీసులనే పట్టించుకోవడం లేదు.. రోబోను ఎవరు పట్టించుకుంటారు.. సిగ్నల్ జంప్ చేస్తేనో.. అని అడిగితే.. ఈ రోబో కళ్ల స్థానంలో నిఘా కెమెరాలు ఉన్నాయి. ఇలాంటివేవైనా జరిగితే వెంటనే అవి రికార్డ్ చేసి కంట్రోల్ రూంకు పంపిస్తాయి. దాని ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు సదరు వాహన యజమానిపై కేసు బుక్ చేస్తారు. అదీ సంగతి. -
కవనం: జూబ్లీహిల్స్ ‘చెక్ చెక్’ చెక్‌పోస్ట్
కోట్ల కోట్ల రూపాయలు పారుతున్నట్టు రంగురంగుల కార్లు, బైకులు ప్రవహిస్తుంటాయక్కడ... ఆ పక్కనే... పచ్చని చెట్ల కింద పచ్చదనం నోచుకోని బతుకులు పచ్చలైటంటే వాళ్లకి కోపం రోజూ ఛస్తున్నవాళ్లకి చచ్చేంత కోపం ఎర్ర లైటంటే ప్రాణం- ఎర్ర లైటంటే బతుకు - ‘సిగ్నల్’ పడితే చాలు ఆస్తి పంజరాలకి విసుగు అస్థి పంజరాలకి జీవితం పసిపిల్లలు - ముసలివాళ్లు గర్భిణీలు - తల్లీపిల్లలు బిచ్చగాళ్లు - పిచ్చివాళ్లు నిండుకున్న బతుకులు మండుతున్న జీవితాలు హారన్ల మోతల్లో ఆర్తనాదాలు... పెట్రో డీజిల్ పొగల్లో ఆకలి మంటలు... ‘సిగ్నల్’ ఎర్రబడింది. కంప్యూటర్ అంకెలు అక్కడి బతుకులకి ‘ప్రతీక’గా వెనక్కి పరుగెడుతున్నాయి. ‘వంద’ నుండి ‘సున్న’ వరకు కౌంట్‌డౌన్ అందరికి ‘వంద’ నుండి ‘సున్న’ వరకు కౌంట్అప్ కొందరికి ఆ కాసేపు... బలిసిన జీవితాలు అసహనంగా సేద తీర్తాయి... అలిసిన బతుకులు ఆశగా అడుక్కుంటాయి. అవిటితనం గుడ్డితనం చెవిటితనం లేమితనం చావుతనం అసంపూర్ణ దేహం - సంపూర్ణ దుఃఖం... లోహాల చుట్టూ... దేహాల పరుగులు 2 నిమిషాల్లో జీవితానికి సరిపడినంత యుద్ధం చేయాలి. వంద నుండి సున్న అయ్యేలోపు బతుకు ‘సున్న’ అవకుండా కాపాడుకోవాలి. కాళ్లు లేని పరుగుతో కళ్లు లేని చూపుతో దేహమంతా చేతులై అడుక్కుంటారు... కళ్లూ, కాళ్లూ, చేతులంటూ మిగిలుంటే అడుక్కోవడానికే పుట్టుంటాయి. ‘దేహం’ అంతా ఆకలి దాహంతో ‘దహనం’ అవుతుందక్కడ! 100- - 99 - 98... ఏ ధర్మాత్ముడి చేయి కదుల్తుందో ఏ పుణ్యాత్ముడి గుండె కరుగుతుందో ఏ మహాత్ముడి ఆత్మ కరుణిస్తుందో ఏ దయాత్ముడి కారు డోరు తెరుచుకుంటుందో ఆశ... పేరాశ... దురాశ... ఆట... వెంపర్లాట... వెదుకులాట... ‘బతుకులాట’ 90 - 89 - 88... కారు అద్దం తుడిస్తే, బైకు నంబర్ తుడిస్తే అమ్మా, అయ్యా, అన్నా, అక్కా, బాబూ ధర్మమంటూ ఏడిస్తే... పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ ఏదో ఒకటి చేయ్... లేదంటే అడ్డం పడ్డావని విసుక్కుంటాడు. కుంటుతూనో, దేకుతూనో, తచ్చాడుతూనో పరుగెత్తు... ఈ కార్ కాకపోతే ఆ బైకు ఆ ఆటో కాకపోతే ఈ వ్యాను 80 - 79 - 78... పట్టించుకోని వాడొకడు ఇటే చూస్తూ ఎటో మాట్లాడేవాడొకడు ఇకిలించేవాడొకడు విసుక్కునేవాడొకడు వాగేవాడొకడు తాగిన మైకంలో ఒకడు మరేదో మైకంలో ఒకడు... మానసిక వికలాంగులు... ‘సిగ్నల్’ పడుద్దేమో!! దేవుడా! దయాగుణం తొందరగా ఇవ్వు. అడుక్కోడానికి మా దగ్గర చచ్చేంత టైముంది ఇవ్వడానికే వాళ్ల దగ్గర అస్సలు టైము లేదు. లెక్కల మెదళ్లకు - రెక్కల కార్లకు ఉన్నంత స్పీడు, మనస్సుకి కూడా పెట్టు దేముడా... 70 - 69 - 68... అక్కడే ఎక్కడో మంచోళ్లూ, మనసున్నోళ్లూ ఉండే ఉంటారు. వెదకండి... వెదకండి... ‘మంచితనం’ అట్టే కనపడదు, ఇట్టే వినపడదు. దొరికేవరకూ పరుగెత్తండి... వెళ్లండెళ్లండి... 60 - 59 - 58... - చిల్లర లేదు ఫ్పో... - ఏదైనా చేసుకు బతకొచ్చుగా - అడుక్కోవడం ఫ్యాషనైంది - పనీ పాటా లేదు ఎదవలకి - బానే ఉన్నావుగా ఎంటి దొబ్బుడాయి... - చౌరస్తాల్లో నాన్సెన్స్ అయిపోయిందండి... ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు. 50 - 49 - 48... రేబాన్ నల్లద్దాల బైకులోళ్లూ... చేతులలా విదిలించకండి... ఈగల మోతా, దోమల గుంపూ కాదు... పొగకి, సెగకి - దుమ్ముకీ, ధూళికీ నల్లబడ్డ మల్లెపూలు నాలుగైదేళ్ల పసోళ్లు... నల్ల కల్లోళ్లకి అంతా నల్లగానే కనపడుద్ది విచిత్రం... నల్లగా వినపడుద్ది కూడా! 40 - 39 - 38... ఎ ఫర్ యాపిల్ బి ఫర్ బిల్డింగ్... కార్లో బేబీలు ఎ ఫర్ ఆకలి బి ఫర్ బిచ్చం... కాలే రోడ్డుపై పసిబిడ్డలు బాబూ... సార్... అమ్మా... విమానం బొమ్మలు, కార్ బొమ్మలు టెడ్డీ బేర్లు, మస్కిటో బ్యాట్లు టిష్యూలు, ఇయర్ బడ్సూ... గొడుగులూ, రబ్బరు బంతులూ ఛార్జర్లూ, బ్యాటరీ లైట్లూ... దేవుళ్లూ, జాతీయ జెండాలు ఒక్కటేమిటి... క్షణాల్లో కదిలొచ్చే మినీ అంగడి... వందే సార్, డెబ్భై ఐదు సార్ పోనీ యాభై, ముప్ఫై సార్... సార్... సిగ్నల్ పడుతోంది... అమ్మా తీసుకోండయ్యా... అటేపు వచ్చి డబ్బు తీసుకుంటాం... తీస్కోండన్న... మర మనుషులకి మర బొమ్మలమ్మే ప్రయత్నం... 30 - 29 - 28... బొమ్మలు, గాలి బొమ్మలు గాలి బుడగలు గాలి నింపిన బొమ్మలతో గాలి బతుకులు... నరాల నుండి, కండరాల నుండి కడుపు కోత నుండి, గుండె మంట నుండి ఊపిరితిత్తుల సంచుల నుండీ గొంతునొప్పి నుండి దేహమంతా ఊపిరితిత్తులై గాలి నింపీ నింపి ఊదీ ఊది... కళ్లు తేలేసిన ‘మానవాకారాలు’ తిండి మాట దేముడెరుగు గాలి మాత్రం తింటారు బతుకు నింపటం కోసం... గాలి కరువై గుండె బరువైన గాలి బతుకులు గాలి బొమ్మలమ్మే గాలి బుడగల జీవితాలు... 20 - 19 - 18... ఏసీ గాలి, ఇంగ్లీషోడి పాట చెవిలో బ్లూ టూత్, మెదడులో బ్లూ ఫిల్మ్ ఆకలి కేకలు విన్పించవ్ కదిలే శవాలు కన్పించవ్ సమూహంలో ఏ‘కాంత’ ప్రయాణం అన్నా... తిరుగన్నా... అన్నా... హమ్మయ్య తిరిగాడు... ధర్మం చేయన్న... తన ‘ప్రాయం’ తనకే బరువై, భారమై ఆచ్ఛాదనకి నోచుకోని ‘ఆమె’ ‘లేడి’లా కన్పిస్తుంది ఆ తిరిగిన ‘పులి’కి నల్ల కళ్లద్దాల్లోంచి... కారు అద్దాల్లోంచి... ఆమె చిరుగుల అంగీలోంచి మాంసం ముద్దలవేపు ‘రుచి’గా చూస్తుందా ‘పులి’ ‘ఆకలి’తో ఈమె ఇటేపు ‘ఆకలి’గా వాడు అటేపు ఛీ! ఛీ!! వచ్చేయమ్మా నువ్వు అబలవీ, సబలవీ వనితవీ, వీరనారివీ కావు... పాపం ఆడదానివి... నిన్ను నువ్వు కాపాడుకోలేవు. వచ్చేయ్. వచ్చేయ్... ఇదీ ‘జనారణ్యం’ తల్లీ జంతువులుంటాయి... ఇక్కడ... 10 - 9 - 8 - 7... ఆవిరవుతున్న రక్తాన్ని ఎముకలవుతున్న దేహాన్ని అస్పష్టమవుతున్న చూపుని కొడగంటుతున్న ప్రాణాన్ని కూడదీసుకుని, ఊపిరి బిగపట్టుకుని ఓ ‘ముద్ద కోసం’ ‘మట్టి ముద్దల్ని’ ప్రార్థించండి అడుక్కోవడమో, అమ్ముకోవడమో త్వరగా... త్వరగా... చేయండి. 6 - 5 - 4... త్వరగా అడుక్కోండి... మళ్లీ రేప్పొద్దున్న ‘అమెరికా ప్రెసిడెంట్’ వస్తున్నాడంటూ మిమ్మల్ని ఊరి చివర పారే (తే)స్తారు. ‘బిచ్చగాళ్లే’ లేని ‘దేశం’ మాదంటూ ‘మిలియన్ల బిచ్చం’ అడుక్కుంటాం. ‘గరీబీ’ హఠావో నా?! ‘గరీబ్’ కో హఠావో నా??!! సెల్యూట్ టూ మై కంట్రీ... 3 - 2... కవర్ పేజీ... చివరి పేజీ... తెలియని ‘బతుకు పుస్తకాలు’ మీవి ఎవడు రాసి ‘పడేశాడో’ చదివితే చదువుతాం లేదంటే చిత్తు కాగితాలోడికి మేమే అమ్మేస్తాం... చెత్త కుండీల్లోకి గిరాటేస్తాం... 1... 0 (సున్న)... శూన్యం’ (‘రచయిత’గా స్పందన సరే! ‘మనిషి’గా ఎంతవరకు స్పందిస్తున్నా... నాకు నేనే ప్రశ్న? ప్రశ్న% ప్రశ్నఁ ప్రశ్న+ ప్రశ్న-) - ఉత్తేజ్ సినీ నటుడు, కవి, రచయిత