![Umpires Soft Signal Stirs Controversy in 4th T20I On India Vs England - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/20/India-Vs-England.jpg.webp?itok=Gwa_3MmL)
‘స్పష్టత లేదు’... లెక్క లేనన్ని సార్లు రీప్లేలు చూసిన తర్వాత మూడో అంపైర్ వీరేందర్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నాలుగో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను మలాన్ ఎలా పట్టాడో అందరికీ స్పష్టంగా కనిపించింది. బంతి గ్రౌండ్‌కు తాకిన విషయం టీవీల ముందు కూర్చున్న లక్షలాది మందికి, మైదానంలో ఉన్న ఆటగాళ్లకూ తెలుస్తోంది. కానీ అంపైర్‌కు మాత్రం అది నాటౌట్ అనిపించలేదు. అందుకే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సూర్యను అంపైర్ పెవిలియన్‌కు పంపించాడు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అలా ఎలా ఇచ్చాడు అనేది సగటు అభిమానికి అర్థం కాలేదు. అందుకు కారణం ‘సాఫ్ట్ సిగ్నల్’. ఇప్పుడు ఇదే ‘సాఫ్ట్’ నిర్ణయం క్రికెట్‌లో కొత్త చర్చకు దారి తీసింది.
-సాక్షి క్రీడా విభాగం
నాలుగో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ఉంటే ఎలా ఉండేది? సహజంగానే సూర్యకుమార్ అవుట్‌పై మరింత రచ్చ జరిగేది. ఓటమికి అంపైర్ తప్పుడు నిర్ణయమే కారణమని అన్ని వైపుల నుంచి మాజీలు, విశ్లేషకులు విరుచుకు పడేవారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. తనకు కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో నిబంధనలు మార్చాలంటూ సహజంగానే డిమాండ్లు ముందుకు వచ్చాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి...
సూర్యకుమార్ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఒకవైపు థర్డ్ అంపైర్‌కు నివేదిస్తూనే మరోవైపు తన వైపుగా ‘అవుట్’ అంటూ వేలెత్తి చూపించేశాడు. ఇదే ‘సాఫ్ట్ సిగ్నల్’. అంటే తనకు ఎలా అనిపించిందనే విషయాన్ని అతను స్పష్టంగా చెప్పేశాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసిన తర్వాత ‘ఇన్‌కన్‌క్లూజివ్’ అంటూ స్పష్టంగా కనిపించడం లేదని తేల్చేశాడు. కాబట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే సరైందని ప్రకటించడంతో అది అవుట్‌గా తేలింది. ఈ రకంగా చూస్తే ఇద్దరూ అంపైర్లూ తమ పరిధిలో సరిగ్గానే విధులు నిర్వర్తించారు. అయితే రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో థర్డ్ అంపైర్‌ను తప్పు పట్టలేం. కానీ సూర్య విషయంలో అంతా స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ అలా తేల్చడమే వివాదం ముదరడానికి కారణమైంది. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ ఎందుకు స్పందించాలి, రనౌట్ల తరహాలో నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయవచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయం తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. దీనినే ఇప్పుడు తొలగించాలని అందరూ చెబుతున్నారు.
‘సాఫ్ట్’ వెనుక కారణమిదీ...
సాంకేతికత ఎంత గొప్పగా ఉన్నా దానిని ఆపరేట్ చేసేది మానవమాత్రులే కాబట్టి 100 శాతం దానిపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా సరిగ్గా ఇదే కారణంతోనే. బాల్ ట్రాకింగ్ ఎలా చూపించినా అంపైర్ దృష్టిలో బంతి ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే ఆధారపడి నిర్ణయాలు ప్రకటిస్తాడు.
సూర్యకుమార్‌లాంటి క్యాచ్‌ల విషయంలో కొన్నిసార్లు ఫీల్డర్ స్పందన, ముఖకవళికలు కూడా అంపైర్లను ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ఇలాంటి సందర్భాల్లో మహా నటుల్లా కనిపించే ఆటగాళ్లను పూర్తిగా నమ్మడం కూడా సరైంది కాదు. అయితే సగటు అభిమానికి అర్థంకాని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ‘ఒక మ్యాచ్‌కు కనీసం 10 కెమెరాలు వాడితే అందులో 2 సూపర్ స్లో మోషన్ కెమెరాలు ఉంటాయి. అవి కూడా పూర్తిగా స్పష్టతనివ్వలేవు. ఇప్పుడు వాడుతున్న కెమెరాలు 2డి మాత్రమే. అన్ని స్పష్టంగా కనిపించాలంటే 3డి కెమెరాలు వాడాలి. పైగా పెద్ద జట్లు మినహా అన్ని సిరీస్‌లకు ఇలాంటివి వాడటంలేదు. అబుదాబిలో జరుగుతున్న అఫ్గానిస్తాన్, జింబాబ్వే సిరీస్‌లో అసలు అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్) లేదు. కాబట్టి అందరికీ ఒకే రూల్ అనే నిబంధన పని చేయదు’ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అంటే ఏదో ఒక దశలో అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే కాబట్టి ఆ అవకాశం ఫీల్డ్ అంపైర్‌కే ఇస్తున్నట్లు లెక్క.
కీలక మ్యాచ్‌లలో ఇలాం టివి తుది ఫలితాన్ని మార్చేయవచ్చు. అసలు అంపైర్ అవుట్‌గానీ నాటౌట్‌కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా. అందరికీ అర్థమయ్యే తరహాలో ఒకే రకమైన నిబంధనలు రూపొందించాలి.
–కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment