
సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా (PC: ICC X)
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వరల్డ్‌కప్ తాజా ఈవెంట్లో గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా(South Africa Women U19 vs Australia Women U19) మధ్య తొలి సెమీ ఫైనల్(Semi Final-1) మ్యాచ్ జరిగింది. కౌలలంపూర్‌లోని బేయూమస్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు కంగారు జట్టు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
ఓపెనర్లలో ఇనెస్ మెకియోన్ డకౌట్ కాగా.. గ్రేస్ లియాన్స్ 2 పరుగులే చేసి అవుటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ లూసీ హామిల్టన్() 18 పరుగులు చేయగా.. మిగతా వాళ్లలో ఎలియనోర్ లారోసా(7), హస్రత్ గిల్(1), చ్లోయే ఐన్స్‌వర్త్(1), లిలీ బాసింగ్‌వైట్(2), టెగాన్ విలియమ్సన్(3*) పూర్తిగా విఫలమయ్యారు.
105 పరుగులే
అయితే, మిడిలార్డర్ బ్యాటర్ కాయిమే బ్రే 36 పరుగులతో రాణించగా.. ఎల్లా బ్రిస్కో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. పదిహేడు బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 27 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.
ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఆష్లే వాన్ విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంతబిసెంగ్ నిని, కెప్టెన్ కైలా రెయ్‌నెకె, షేష్నీ నాయుడు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ జెమ్మా బోతా(24 బంతుల్లో 37 రన్స్) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ సిమోనే లౌరెన్స్(5) మాత్రం నిరాశపరిచింది.
రాణించిన కెప్టెన్
వన్‌డౌన్ బ్యాటర్ ఫే కౌలింగ్(7) కూడా విఫలం కాగా.. కైలా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా ఆడింది. 26 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మేసో(19) కాసేపు క్రీజులో నిలబడగా.. మికే వాన్‌వూస్ట్ 8, షేష్నీ నాయుడు 2 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.1 ఓవర్లలో 106 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తద్వారా మహిళ అండర్-19 టీ20 వరల్డ్‌కప్ సెకండ్ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ ఆష్లే వాన్ విక్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) అమీతుమీ తేల్చుకోనున్నాయి.
రెండో బెర్తు కోసం
ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో సౌతాఫ్రికాతో ట్రోఫీ కోసం తలపడుతుంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక తాజా ఎడిషన్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్‌గా స్థాయికి తగ్గట్లు రాణించి సెమీ ఫైనల్ వరకు వచ్చింది. మరోసారి చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది.
చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం
Comments
Please login to add a commentAdd a comment