ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి.
'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు.
ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది.
సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి.
239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది.