MH 370
-
'ఆ శకలం ఎంహెచ్ 370 విమానానిదే'
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో లభించిన మరో శకలం ఎంహెచ్ 370 విమానానిదిగా నిర్థారణ అయినట్టు మలేషియన్ ప్రధానమంత్రి నజీబ్ రజక్ వెల్లడించారు. అయితే ఈ శకలాన్ని పరీక్షల నిమిత్తం దానిని ఫ్రాన్స్ కు పంపిన సంగతి తెలిసిందే. ఆదివారం కనుగొన్న ఆ శకలం.. రీయూనియన్ ద్వీప రాజధాని సెయింట్ డెనిస్ నగరంలో దొరికింది. మొదట దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని, ఏడాదిన్నర కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం కూడా ఇదే రకానికి చెందినదని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రెండు శకలాలూ ఎంహెచ్ 370వే అయివుంటాయనే తొలుత భావించారు. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. -
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు
హైదరాబాద్: అందేంటోగాని ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు నీడలా వెంటాడుతున్నాయి .... ఓ విమానం అదృశ్యమైంది... దాని జాడ ఇప్పటికి తెలియలేదు. మరో విమానాన్ని వేర్పాటు వాదులు క్షిపణులతో కూల్చివేశారు. మరో విమానం అదృశ్యం. అలాగే మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 గగనతలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండొనేసియా మీడియా ప్రకటించింది. ఈ అదృశ్యమైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలపి 162 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది వరుసగా ... *మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ తెలియలేదు. * జూలై 17న ఎమ్ హెచ్ 17 విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు బయలుదేరింది. ఈ విమానం ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల శక్తిమంతమైన క్షిపణితో దాడి చేశారు. దాంతో విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 298 మంది మరణించారు. * జూలై 23న ట్రాన్స్‌ఏసియా ఎయిర్వేస్ విమానం తైవాన్‌లో కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు. * ఆగస్టు 10న టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. * ఆగస్టు 25న ఎండీ -83 బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు విమానం బయలుదేరింది. విమానం బయలుదేరిన 50 నిమిషాల అనంతరం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందారు. -
ఎం హెచ్ 370 అన్వేషణ: నీకెంత, నాకెంత?
మలేషియన్ విమానం ఎం హెచ్ 370 సముద్రంలో కుప్పకూలి మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ దాని శకలాలు, అందులోని శవాలను కనుగొనడంలో ప్రపంచ దేశాలు విఫలం అయ్యాయి. ఇప్పటికే మిలియన్ల డాలర్లను సముద్రం పాలు చేసి దేశదేశాలు అన్వేషణ కొనసాగించాయి. ఇంకా కొనసాగాల్సి ఉంది. కాసింత విరామం ఇచ్చినా త్వరలోనే పని మొదలవుతుంది. అయితే దీని ఖర్చులు ఎవరెవరు ఎంతెంత భరించాలన్నదే అన్వేషణలో ఉన్న దేశాల ముందున్న సమస్య. మార్చి ఎనిమిదన 239 మంది ప్రయాణికులతో జాడతెలియకుండా పోయిన విమానం మలేషియాది. కాబట్టి మలేషియా అన్వేషణలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు ఎక్కువగా చైనాదేశస్థులు. కాబట్టి చైనా కూడా అన్వేషణలో చురుకుగా పాల్గొంటోంది. ఇక ప్రమాదం జరిగిన చోటు ఆస్ట్రేలియాకి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మొత్తం అన్వేషణకు ఆస్ట్రేలియాయే నేతృత్వం వహిస్తోంది. వచ్చే ఏడాది జులై వరకూ అన్వేషణ కొనసాగించేందుకు ఈ దేశాలన్నీ కలిసి ప్రణాళికను రూపొందించాయి. దీనికి మొత్తం 84 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఎవరెలా పంచుకోవాలన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అన్వేషణ కొనసాగించడంలో వెనుకాడే ప్రసక్తే లేదని, అయితే భారాన్ని ఎవరెలా పంచుకుంటారన్నది కూడా ముఖ్యమని ఆస్ట్రేలియన్ అధికారులు అంటున్నారు. అందుకే లెక్కలు తే్ల్చేందుకు అన్వేషణలో పాలుపంచుకుంటున్న దేశాలు త్వరలో సమావేశం కానున్నాయి. -
మలేషియా విమానం కథ మళ్లీ మొదటికి
మలేషియా విమాన విషాదం కథ మళ్లీ మొదటికొచ్చింది. హిందూమహాసముద్రంలో నెలకు పైబడి జరిపిన అన్వేషణ నీటి మూటలా మారిపోయింది. శనివారం సముద్రంలో కనిపించిన చమురు తెట్టుకి సముద్రంలో కుప్పకూలిన విమానానికి ఎలాంటి సంబంధమూ లేదని పరీక్షలు రుజువు చేశాయి. చమురు తెట్టునుంచి సేకరించిన రెండు లీటర్ల చమురు తెట్టు సాంపిల్స్ ని అధ్యయనం చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు రోబోట్ సాయంతో నడిచే సబ్మెరీన్ బ్లాక్ బాక్స్ ను కనుగొనగలిగితేనే ఎంతో కొంత పురోగతి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సబ్మెరీన్ తొలి రెండు సార్లు తన ప్రయత్నంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. దీంతో ఇప్పటి వరకూ కేవలం 90 చ.కి.మీ ప్రదేశాన్ని మాత్రమే సబ్మెరీన్ పరీక్షించి చూడగలిగింది. మార్చి 8 న 239 మందితో బయలుదేరిన ఎం హెచ్ 370 విమానం బయలు దేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం సముద్రంలో కుప్ప కూలి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పదకొండు విమానాలు, 11 పడవలు ప్రస్తుతం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. -
సముద్రంపై చమురుతెట్టు - ఎం హెచ్ 370 పై కొత్త ఆశలు
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానం కుప్పకూలినట్టుగా భావిస్తున్న చోట భారీ మొత్తంలో చమురు తెట్టు ఉన్నట్టు వెల్లడైంది. కుప్పకూలిన విమానం అన్వేషణలో ఈ చమురు తెట్టు ఉపయోగపడే అవకాశం ఉందని విమానం కోసం అన్వేషణ జరుపుతున్న నిపుణులు చెబుతున్నారు. వారు ఈ చమురు తెట్టు సాంపిల్స్ సేకరించారు. మరో వైపు సముద్ర గర్భంలో విమానం శకలాలు, బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రత్యేక సోనార్ సెన్సర్లున్న బ్లూఫిన్ 21 జలాంతర్గామిని కూడా ప్రవేశపెట్టారు. ఇది సముద్ర గర్భంలో ఉన్న వస్తువుల వివరాలను సోనార్ మ్యాప్ సాయంతో సేకరిస్తుంది. రిమోట్ పరికరాల ద్వారా దీనిని నడిపించడానికి వీలుంటుంది. దీని ద్వారా పొందిన మ్యాపుల సాయంతో బ్లాక్ బాక్సు ఉందా లేదా అన్న విషయాన్ని కనుగొనవచ్చు. గత ఏప్రిల్ 8 నుంచి సముద్ర గర్భం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దీనితో బ్లాక్ బాక్స్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. మార్చి 8 న మలేషియా రాజధాని కౌలాలంపుర్ నుంచి 239 మందితో బయలుదేరిన విమానం కొద్ది సేపటికే జాడ తెలియకుండా పోయింది. దీనితో నె లరోజుల నుంచి దీని కోసం పలు దేశాలు సంయుక్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. -
ఎం హెచ్ 370 - ఇన్నాళ్లకి దర్యాప్తుకు ఆదేశించిన మలేషియా
మలేషియన్ విమానం తప్పుదారి పట్టగానే దాని కోసం వెతకడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? దారి మారగానే ఆ విమానం ఎటువెళ్తుందో ఎందుకు గమనించలేదు? దీనికి బాధ్యులెవరు? పౌర విమానయాన రంగం తప్పు ఎంత? మిలటరీ విభాగం తప్పు ఎంత? ఇప్పుడు మలేషియా ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది. సంఘటన వెనువెంటనే అధికారులు, వివిధ విభాగాలు స్పందించిన తీరుపై దర్యాప్తు మొదలైంది. అయితే దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రభుత్వం ధ్రువీకరించడం లేదు. ఏ విభాగం దర్యాప్తు చేస్తుంది, దర్యాప్తు దళానికి నాయకుడెవరు అన్న విషయంపై కూడా ఇప్పటి వరకూ స్పష్టత లేదు. మలేషియన్ విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప దర్యాప్తునకు అర్ధం లేదని నిపుణులు అంటున్నారు. 239 మంది ప్రయాణిస్తున్న మలేషియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 777 గత మార్చి 8 న దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం శకలాలు ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకో వైపు మలేషియన్ విమానం కోపైలట్ విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు ఒక అర్జంట్ ఫోన్ కాల్ తన సెల్ నుంచి చేశాడని, అయితే సెల్ కనెక్టివిటీ లభ్యత లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ కాలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఏదో అసాధారణ పరిస్థితి ఉందని గమనించి, ఆయన ఫోన్ చేయడానికి ప్రయత్నించారా అన్నది తేలడం లేదు. ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలంటే బ్లాక్ బాక్స్ దొరకడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. -
ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి. 'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది. -
ఇది మలేషియన్ విమానం పంపిన సిగ్నలేనా?
హిందూమహాసముద్ర గర్భంలో కుప్ప కూలిన మలేసియన్ విమానం నుంచి ఎలక్ట్రానిక్ పల్స్ సిగ్నల్ రూపంలో వచ్చిందా? అది విమానం నుంచి వచ్చిన సందేశమేనా? జాడతెలియకుండా పోయిన మలేషియన్ విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పలు దేశాలు అన్వేషణ జరుపుతున్నాయి. అమెరికా నుంచి ఒక ప్రత్యేక సోనార్ సెన్సార్ ఉన్న సబ్మెరీన్ కూడా ఈ గాలింపులో పాల్గొంటూంది. ఇదే సమయంలో చైనాకి చెందిన హైగ్జున్ 01 అనే పెట్రోలింగ్ పడవక హిందూ మహాసముద్ర జలాల్లోనుంచి సెకనుకు 37.5 కిలో హెర్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక సిగ్నల్ వచ్చింది. మలేషియన్ విమానం ఎం హెచ్ 370 లో బ్లాక్ బాక్స్ ను తయారు చేసిన డుకానె సీకామ్ సంస్థ ఈ సిగ్నల్ విమానం నుంచి వెలువడే సిగ్నల్ కి చాలా దగ్గరగా ఉందని పేర్కొంది. గత ఇరవై ఎనిమిది రోజుల గాలింపులో లభించిన అత్యంత ముఖ్యమైన సూచనల ఇదే. ఒక వైపు బ్లాక్ బాక్స్ బాటరీ చార్జింగ్ ఇంకొన్ని గంటల్లో అయిపోతుందనగా ఈ పల్స్ సిగ్నల్ లభించడం విశేషం. ఈ పల్స్ సిగ్నల్ కూడా బ్యాటరీ చార్జింగ్ పూర్తయితే రావడం మానేస్తుంది. విమానం మార్చి 8 న అంతర్ధానమైంది. దాని కోసం పలు దేశాల నౌకలు, విమానాలు వెతుకులాట కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు ఎయిర్ క్రాఫ్టులు, 11 పడవలు అన్వేషణ జరుపుతున్నాయి. -
మలేషియా విమానం: శాశ్వత సమాధికి మరో 72 గంటలు
ఇంకా కేవలం మూడు రోజులు... ఈ మూడు రోజులు దాటితే సముద్ర సమాధిలో నిద్రిస్తున్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 వెనుక భాగాన ఉండే బ్లాక్ బాక్స్ బ్యాటరీ శాశ్వత నిద్రలోకి జారుకుంటుంది. మామూలుగా బ్లాక్ బాక్స్ 30 రోజుల వరకూ చార్జింగ్ ఉండి, సిగ్నల్స్ పంపగలుగుతుంది. ఇప్పటికి 27 రోజులు పూర్తయింది. గుడ్ నైట్ మలేషియన్ 370 239 మంది ప్రయాణికులను తన గర్భంలో పసిపాపల్లా అతి జాగ్రత్తగా పొదివి పట్టుకెళ్తున్న మలేషియన్ విమానం మార్చి 8 ఉదయం 8.11 గంటలకు ఉన్నట్టుండి మాయమైపోయింది. 16 రోజుల 13 గంటల, 49 నిమిషాల తరువాత విమానం పోయిందన్న విషయాన్ని మలేషియన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కోసం చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపు ముమ్మర ప్రయత్నాలు.. మరో వైపు క్షణక్షణం బలహీనపడుతున్న సిగ్నల్స్... మరో 72 గంటలు దాటేస్తే బ్లాక్ బాక్స్ సముద్ర గర్భంలో ఎక్కడో ఉండిపోతుంది. మలేషియన్ విమానంలో అంతిమ క్షణాల్లో ఏం జరిగిందో చెప్పే ఏకైక ఆధారం మటుమాయమైపోతుంది. 'గుడ్ నైట్ మలేషియన్ 370' అని పైలట్ అన్న తరువాత చీకటి ఘడియల్లో ఏం జరిగిందో తెలిపే బ్లాక్ బాక్స్ దొరకడం కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. హైజాకింగ్ కాదంటున్న అధికారులు హైజాక్, విద్రోహచర్య, పైలట్ల మానసిక సంతులనం దెబ్బతినడం లేదా ప్రమాదవశాత్తూ ఇంధనం అయిపోవడం - ఈ నాలుగు కారణాల్లో ఏది కరెక్టో చర్చించుకుంటూ కాలం గడపడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి ఉంది. బుధవారం మలేషియా అధికారులు ఈ ప్రమాదం వెనుక హైజాకింగ్ కోణం లేదని అధికారికంగా ప్రకటించారు. యాత్రికులెవరూ హైజాకర్లు కారని కూడా ప్రకటించారు. హెచ్ ఎం ఏ ఎస్ సిడ్నీ అనే పడవ మునిగిపోయిన 60 ఏళ్ల వరకూ దొరకలేదు. టైటానిక్ అవశేషాలు దొరకడానికి కూడా 80 ఏళ్లు పట్టింది. ఎం హెచ్ 370 పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా? గతంలోనూ ఇలాగే జరిగింది! 2009 లో అట్లాంటిక్ లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 అట్లాంటిక్ లో కుప్పకూలిపోయింది. అప్పుడు కూడా బ్లాక్ బాక్స్ బ్యాటరీ ఇలాగే చార్జింగ్ అయిపోయింది. దీంతో ఫ్రెంచి ప్రభుత్వం సైడ్ స్కాన్ సోనార్ సెన్సర్లు ఉన్న జలాంతర్గాములతో సముద్రం అడుగున 5 కి.మీ లోతున, 20 కిమీ ప్రాంతంలో అన్వేషణ జరిపించింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానం తాలూకు బ్లాక్ బాక్స్ రెండేళ్ల తరువాత దొరికింది. ఎం హెచ్ 370 విషయంలోనూ అదే జరుగుతుందా అన్నదే అసలు ప్రశ్న! -
విమానం కోసం వెతుకులాట ఏడాదైనా పట్టొచ్చు
దక్షిణ హిందూ మహాసముద్రం లో ఆస్ట్రేలియాకి వెయ్యి కి.మీ దూరంలో సముద్రం అడుగున రెండు మైళ్ల లోతున....కనిపించని మలేషియన్ విమానం కోసం, కనుమరుగైన 239 మంది ప్రయాణికుల కోసం ప్రపంచం ఇప్పుడు వెతుకుతోంది. విమానం ఇక్కడే కూలిందా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో సముద్రం పైన తేలాడుతున్న ఎన్నో వస్తువులను పడవలు సేకరించాయి. కానీ అవేవీ విమాన శకలాలు కావు. సముద్ర గర్భాన్ని వడకట్టి, జల్లెడపట్టే శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాంతం వైశాల్యం దాదాపు 319 వేల చకిమీ. అంటే పోలండ్ దేశంతో సమానం. అదృష్ట వశాత్తూ ఈ ప్రాంతంలో సముద్రం అట్టడుగుభాగం చదునుగా, పెద్దగా ఎగుడు దిగుళ్లు లేకుండా ఉంటుంది. మధ్యలో ఒక ప్రాంతం మాత్రం కాస్త పగులు ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని డయామాంటినా ట్రెంచ్ అంటారు. అయితే సముద్రం అట్టడుగున చనిపోయిన ప్లాంక్టన్ జాతి ప్రాణులు ఒక కిలో మీటర్ వరకూ ఒక తివాచీలాగా పరుచుకుని ఉంటాయి. ఈ ట్రెంచ్, ప్లాంక్టన్ల వల్ల శకలాలను గుర్తించే పరికరాలకు అట్టడుగు నుంచి సిగ్నల్స్ అందడంలో ఇబ్బందిగా ఉంది. ఇంత సువిశాల ప్రాంతంలో కూలిన విమానపు బ్లాక్ బాక్స్ కోసం వెతకడం అంటే గడ్డివాములో సూది వెతకడం లాంటిదేనంటున్నారు నిపుణులు. అందుకే శాస్త్రవేత్తలు ఈ విమానం కోసం అన్వేషణ ఏడాదిపాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తం మీద ఎం హెచ్ 370 విమానం ఒక అద్భుత మిస్టరీగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని వారంటున్నారు. -
విమాన శకలాల అన్వేషణలో ఆలస్యం ఎందుకు?
సముద్రంలో కుప్పకూలిన మలేషియన్ విమానం శకలాల కోసం అన్వేషణ ఎందుకింత సమస్యగా మారింది? ఎందుకు ప్రతి రోజూ శకలాలు ఇక్కడ కనిపించాయి, అక్కడ కనిపించాయి అని వార్తలు వస్తున్నాయి? ప్రతి రోజూ ఉపగ్రహ చిత్రాలు కొత్త కథలు చెబుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. దీనికి ప్రధాన కారణం విమానం మునిగిన చోటు. దక్షిణ హిందూ మహాసముద్రం, ముఖ్యంగా ఆస్ట్రేలియాకి దగ్గరలోనే ఉన్న చోట చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రం చాలా అశాంతిగా ఉంటుంది. సముద్రంపై వెర్రి గాలులు వీస్తాయి. ఒకసారి అటు, ఒక సారి ఇటు వీస్తాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఈ ప్రాంతమంతా భారీ వర్షాలు కురుస్తాయి. మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ గాలులు, అలలు, వానల వల్ల ఒక రోజులో శకలాలు దాదాపు 70 కిమీ దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఒక ఏడాది పాటు శకలాలు ఇలాగే అటూ ఇటూ తేలాడుతూ ఉంటే అవి దాదాపు 2600 కిమీ ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియా వరకూ వెళ్లవచ్చునని అంచనా వేస్తున్నారు. అలాగే శకలాలు పసిఫిక్ సముద్రం వంటి ఇతర సముద్రాలకు కూడా వెళ్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే రోజుకో చోట విమాన శకలాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నాడు దాదాపు 75 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు ఉన్న చెక్క వంటి వస్తువు కనిపించింది. దీనికి పలు రంగుల బెల్టుల్లాంటి వి అమర్చి ఉన్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇవి సీట్ బెల్టులకు సంబంధించిన శకలం అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా అన్వేషణ జరిపి, శకలాలను కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం
దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన మలేషియా విమానం ఎం హెచ్ 370 విషయంలో ఆస్ట్రేలియా అధికారులకు కొత్త ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తున్న ప్రాంతం కన్నా 680 మైళ్ల దూరంలో విమాన శకలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దీంతో సెర్చ్ టీమ్ లు అక్కడికి తరలి వెళ్తున్నాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ కి 1250 మైళ్ల దూరంలో 123.200 చ. మైళ్ల ప్రాంతంలో అన్వేషణ జరుగుతుంది. గురువారం భారీ వర్షాలు, మేఘాల వల్ల విమానాలు బయలుదేరలేకపోయాయి. ముందు ఏమి ఉందో తెలియనంత దట్టంగా వానపడటంతో పడవలకు కూడా ఇబ్బంది కలిగింది. అదృష్ట వశాత్తూ శుక్రవారం నుంచి వాతావరణం మెరుగుపడటంతో అన్వేషణ వేగం పుంజుకుంది. అయితే తాజాగా లభించిన వివరాల ప్రకారం మలేషియా విమానం ఊహించిన దానికన్నా వేగంగా ప్రయాణించింది. దీని వల్ల ఇంధనం అనుకున్న దాని కన్నా ముందే అయిపోయి ఉండవచ్చు.ఫలితంగా విమానం కుప్పకూలిందని ఇప్పటి వరకూ భావిస్తున్న ప్రదేశం కన్నా చాలా ముందే నీటిలో పడిపోయి ఉండవచ్చు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి 239 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎం హెచ్ 370 మార్చి 8 న కుప్పకూలిపోయింది. ఈ విమానం హిందూ మహాసముద్ర జలాల్లో కుప్పకూలిందని భావిస్తున్నారు. గత 20 రోజులుగా దీని శకలాల కోసం అన్వేషణ సాగుతోంది. -
అవి మలేషియా విమాన శకలాలేనా?
మలేషియా విమానం ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో కుప్పకూలిపోయిందనడానికి మరిన్ని ఆధారాలు దొరికాయి. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు తమ ఉపగ్రహ చిత్రాలలో ఆస్ట్రేలియాకి దాదాపు 2500 కి.మీ దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో సముద్రంలో పలు శకలాలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ చిత్రాలను వారు మలేషియా ప్రభుత్వపు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందచేశారు. ఈ ఉపగ్రహ చిత్రాల్లో దాదాపు 122 వస్తువులు కనిపించాయి. ఇందులో కొన్ని వస్తువులు దాదాపు 23 మీటర్ల పొడవున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మలేషియన్ ప్రభుత్వం దక్షిణ హిందూ మహాసముద్రంలోనే విమానం కుప్పకూలినట్టు ప్రకటించింది. మరో వైపు సముద్రంలో జాడ తెలియకుండా పోయిన విమానం తాలూకు బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ ను కనుగొనేందుకు అమెరికా నుంచి నిపుణులు మలేషియా వచ్చారు. మామూలుగా బ్లాక్ బాక్సులు 30 రోజుల వరకూ పనిచేస్తాయి. వాటి బ్యాటరీల చార్జింగ్ అప్పటి వరకూ పనిచేస్తుంది. వాటికి అండర్ వాటర్ లోకేటర్ బీకన్లు అమర్చి ఉంటాయి. ఇవి నీటి అట్టడుగున 14000 అడుగుల లోతున ఉన్నా సందేశాలు పంపగలుగుతాయి. అయితే ఇప్పటికే విమానం నీట మునిగి 17 రోజుల, 13 గంటల, 49 నిమిషాలు అయింది. అంటే ఇంకా పదకొండు రోజుల్లో బ్లాక్ బాక్సును కనుగొనలేకపోతే అది శాశ్వతంగా దొరకకుండా పోతుందన్నమాట. ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా బ్లాక్ బాక్సులో విమాన ప్రయాణ కాలంలో కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను రికార్డు చేస్తాయి. దీని ఆధారంగా అసలేం జరిగిందో అంచనా వేయడానికి వీలుంటుంది. -
మలేషియా విమాన శకలాల గాలింపునకు అడ్డంకులు
కౌలాలంపూర్ : మలేషియా విమాన శకలాల గాలింపునకు వాతావరణం అనుకూలంగా లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల పూర్తి సమాచారాన్ని తెలుసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విమానం ఎక్కడ, ఎలా కూలిపోయిందీ ఈ రోజు సమాచారం ఇస్తామని మలేషియా ప్రభుత్వం తెలిపింది. తప్పిపోయిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 కూలిపోయిందని ఆ ప్రభుత్వం నిన్న నిర్ధారించిన విషయం తెలిసిందే.(వీడిన మలేషియా విమానం మిస్టరీ) కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన ఈ విమానం ఈ నెల 8న అదృశ్యమైంది.16 రోజుల తరువాత కూలిపోయినట్లు తెలిసింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. విమానం కూలిపోయిన ప్రదేశానికి వెళ్లి, శకలాలను పరిశీలించి వివరాలు సేకరించడానికి వాతావరణం అనుకూలంగాలేదు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
విషాదానికి వీసా ఫీజులుండవు!
ఒక్క విషాదం.... దేశాలను కలిపింది. కన్నీరు, కష్టాలు పంచుకునేలా చేసింది. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఊరడించేలా చేసింది. అవును .... మలేషియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం విషాదంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, పాకిస్తాన్ నుంచి భారత్ దాకా, కౌలాలంపూర్ నుంచి బీజింగ్ దాకా అందరినీ కలిసికట్టుగా విమాన శకలాల కోసం అన్వేషించేలా చేసింది. (ఆ విమానం సముద్రంలో కూలింది) ఆస్ట్రేలియాకు దగ్గర్లో సముద్రసమాధిలో ఎక్కడో ఎవరికీ తెలియకుండా నిద్రిస్తున్న మలేషియన్ విమానంలో అంతిమ యాత్ర చేసిన తమ వారి కోసం వచ్చే బంధువులందరికీ సానుభూతితో స్వాగతం పలుకుతున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబట్ ప్రకటించారు. (హిందూ మహా సముద్రంలో విమాన శకలాలు) ఈ విషాద సమయంలో మిమ్మల్ని గుండెలకు హత్తుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. వారి నుంచి ఎలాంటి వీసా ఫీజులు వసూలు చేయబోమని కూడా ఆయన ప్రకటించారు. ప్రధానికి విపక్ష నేత బిల్ షార్టెన్ కూడా పూర్తి మద్దతు పలికారు. (వీడిన మలేషియా విమానం మిస్టరీ) -
సముద్రంలో మరో శకలం
మలేసియా విమానానిదని అనుమానం.. రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్370 ఆచూకీ కోసం ఆరు విమానాలు, ఆరు నౌకలతో 36 వేల చ .కి.మీ. విస్తీర్ణంలో విస్తృత గాలింపులు జరిపినా శనివారం దాకా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది. అయినా 26 దేశాల బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా రెండు శకలాలను గుర్తించడంతో వాటికోసం శుక్రవారం అన్వేషించినా.. జాడ దొరకలేదు. దీంతో అవి సముద్రంలో మునిగిపోయి ఉంటాయని భావించారు. అయితే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా శకలాలను గుర్తించిన ప్రాంతానికి నైరుతి దిశగా 120 కి.మీ. దూరంలో మరో వస్తువును మంగళవారం చైనా ఉపగ్రహం గుర్తించినట్లు శనివారం మలేసియా రక్షణ, రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ప్రకటించారు. 22.5 మీ. పొడవు, 13 మీ. వెడల్పు ఉన్న ఆ వస్తువు అన్వేషణ కోసం చైనా రెండు నౌకలను పంపుతున్నట్లు తెలిపారు. అయితే విమానం బ్లాక్‌బాక్స్‌లో బ్యాటరీ 30 రోజులే పనిచేస్తుందని, మరో 15 రోజులు దాటితే బ్లాక్‌బాక్స్ నుంచి సంకేతాలు ఆగిపోతాయని హిషాముద్దీన్ తెలిపారు. ఏమాత్రం ప్రయోజనం లేదని భావించేదాకా అన్వేషణ కొనసాగుతుందన్నారు. విమానం ఆచూకీ కోసం సముద్ర గర్భంలో అన్వేషించేందుకు నిఘా పరికరాలను ఇవ్వాలంటూ అమెరికాను మలేసియా కోరింది. అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్కు మలేసియా రక్షణ మంత్రి ఫోన్లో విజ్ఞప్తి చేయగా.. తమ టెక్నాలజీని, పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. -
ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట
మలేషియా విమానం కోసం అన్వేషణ చిమ్మ చీకట్లో నల్లపిల్లిపి వెతకడం లాగా మారింది. ఆస్ట్రేలియా దగ్గర సముద్రంలో విమానం శిధిలాలున్నాయని సాటిలైట్లు చెప్పిన ఇరవై నాలుగు గంటల తరువాత కూడా విమానం ఎక్కడుందో తెలియడం లేదు. ఇవన్నీ చాలవన్నట్టు దక్షిణ హిందూ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడ ఇబ్బందులకు దారితీస్తోంది. ఇప్పటికే వెతుకులాటలో ఉన్న విమానాలు ఆస్ట్రేలియాలోని పెర్త్ కు తిరిగి వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా తీరంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అమెరికా నేవీకి చెందిన పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్ లోనూ తగినంత ఇంధనం లేకపోవడంతో తిరిగి రాక తప్పలేదు. సాటిలైట్ కెమెరాలకు కనిపించిన శిథిలాలు ఏమిటన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అవి బోయింగ్ విమానపు రెక్కలై ఉండవచ్చునని అంటున్నారు. రెక్కల్లో ఉండే ఫ్యూయల్ టాంకులు ఖాళీ అయిపోవడం వల్ల రెక్కలు పైకి తేలి ఉండవచ్చునని అంటున్నారు. నార్వే కి చెందిన కార్గో నౌక హోయె సెంట్ పీటర్బర్గ్ సెర్చి లైట్ల సాయంతో అన్వేషణ కొనసాగిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకి కార్లను తీసుకువెళ్తున్న ఈ నౌక శుక్రవారం కూడా తన వెతుకులాట కొనసాగిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సందేశాల ఆధారంగా విమాన శకలాలు ఎక్కడున్నాయో గుర్తించవచ్చునని, అయితే ఆ బ్యాటరీ 25 రోజుల వరకూ పనిచేస్తుందని, ఇప్పటికే దాదాపు రెండు వారాలైపోయాయని అధికారులు అంటున్నారు. మలేషియాకి చెందిన రెండు విమానాలు, మూడు హెలీకాప్టర్లు, ఆరు పడవలు, చైనాకి చెందిన మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు, అయిదు పడవలు, ఇండోనీషియాకి చెందిన నాలుగు విమానాలు, ఆరు నౌకలు, ఆస్ట్రేలియాకి చెందిన అయిదు విమానాలు, ఒక పడవ, జపాన్‌కి చెందిన నాలుగు విమానాలు, మన దేశానికి చెందిన రెండు విమానాలు, దక్షిణ కొరియాకి చెందిన రెండు విమానాలు, అమెరికా, న్యూజీలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన చెరొక్క విమానం, ఇంగ్లండ్ కి చెందిన ఒక నౌక అన్వేషణలో ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్న నార్వే నౌక కూడా అదే పనిలో ఉంది. -
మలేషియా విమాన అన్వేషణలో భారత్
-
మలేషియా విమాన ఆచూకీ లభ్యం !