ఎం హెచ్ 370 - ఇన్నాళ్లకి దర్యాప్తుకు ఆదేశించిన మలేషియా
మలేషియన్ విమానం తప్పుదారి పట్టగానే దాని కోసం వెతకడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? దారి మారగానే ఆ విమానం ఎటువెళ్తుందో ఎందుకు గమనించలేదు? దీనికి బాధ్యులెవరు? పౌర విమానయాన రంగం తప్పు ఎంత? మిలటరీ విభాగం తప్పు ఎంత?
ఇప్పుడు మలేషియా ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది. సంఘటన వెనువెంటనే అధికారులు, వివిధ విభాగాలు స్పందించిన తీరుపై దర్యాప్తు మొదలైంది. అయితే దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రభుత్వం ధ్రువీకరించడం లేదు. ఏ విభాగం దర్యాప్తు చేస్తుంది, దర్యాప్తు దళానికి నాయకుడెవరు అన్న విషయంపై కూడా ఇప్పటి వరకూ స్పష్టత లేదు. మలేషియన్ విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప దర్యాప్తునకు అర్ధం లేదని నిపుణులు అంటున్నారు.
239 మంది ప్రయాణిస్తున్న మలేషియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 777 గత మార్చి 8 న దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం శకలాలు ఇప్పటి వరకూ దొరకలేదు.
ఇంకో వైపు మలేషియన్ విమానం కోపైలట్ విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు ఒక అర్జంట్ ఫోన్ కాల్ తన సెల్ నుంచి చేశాడని, అయితే సెల్ కనెక్టివిటీ లభ్యత లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ కాలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఏదో అసాధారణ పరిస్థితి ఉందని గమనించి, ఆయన ఫోన్ చేయడానికి ప్రయత్నించారా అన్నది తేలడం లేదు.
ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలంటే బ్లాక్ బాక్స్ దొరకడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.