మలేషియా విమానం: శాశ్వత సమాధికి మరో 72 గంటలు
ఇంకా కేవలం మూడు రోజులు... ఈ మూడు రోజులు దాటితే సముద్ర సమాధిలో నిద్రిస్తున్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 వెనుక భాగాన ఉండే బ్లాక్ బాక్స్ బ్యాటరీ శాశ్వత నిద్రలోకి జారుకుంటుంది. మామూలుగా బ్లాక్ బాక్స్ 30 రోజుల వరకూ చార్జింగ్ ఉండి, సిగ్నల్స్ పంపగలుగుతుంది. ఇప్పటికి 27 రోజులు పూర్తయింది.
గుడ్ నైట్ మలేషియన్ 370
239 మంది ప్రయాణికులను తన గర్భంలో పసిపాపల్లా అతి జాగ్రత్తగా పొదివి పట్టుకెళ్తున్న మలేషియన్ విమానం మార్చి 8 ఉదయం 8.11 గంటలకు ఉన్నట్టుండి మాయమైపోయింది. 16 రోజుల 13 గంటల, 49 నిమిషాల తరువాత విమానం పోయిందన్న విషయాన్ని మలేషియన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కోసం చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపు ముమ్మర ప్రయత్నాలు.. మరో వైపు క్షణక్షణం బలహీనపడుతున్న సిగ్నల్స్... మరో 72 గంటలు దాటేస్తే బ్లాక్ బాక్స్ సముద్ర గర్భంలో ఎక్కడో ఉండిపోతుంది. మలేషియన్ విమానంలో అంతిమ క్షణాల్లో ఏం జరిగిందో చెప్పే ఏకైక ఆధారం మటుమాయమైపోతుంది. 'గుడ్ నైట్ మలేషియన్ 370' అని పైలట్ అన్న తరువాత చీకటి ఘడియల్లో ఏం జరిగిందో తెలిపే బ్లాక్ బాక్స్ దొరకడం కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది.
హైజాకింగ్ కాదంటున్న అధికారులు
హైజాక్, విద్రోహచర్య, పైలట్ల మానసిక సంతులనం దెబ్బతినడం లేదా ప్రమాదవశాత్తూ ఇంధనం అయిపోవడం - ఈ నాలుగు కారణాల్లో ఏది కరెక్టో చర్చించుకుంటూ కాలం గడపడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి ఉంది. బుధవారం మలేషియా అధికారులు ఈ ప్రమాదం వెనుక హైజాకింగ్ కోణం లేదని అధికారికంగా ప్రకటించారు. యాత్రికులెవరూ హైజాకర్లు కారని కూడా ప్రకటించారు.
హెచ్ ఎం ఏ ఎస్ సిడ్నీ అనే పడవ మునిగిపోయిన 60 ఏళ్ల వరకూ దొరకలేదు. టైటానిక్ అవశేషాలు దొరకడానికి కూడా 80 ఏళ్లు పట్టింది. ఎం హెచ్ 370 పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా?
గతంలోనూ ఇలాగే జరిగింది!
2009 లో అట్లాంటిక్ లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 అట్లాంటిక్ లో కుప్పకూలిపోయింది. అప్పుడు కూడా బ్లాక్ బాక్స్ బ్యాటరీ ఇలాగే చార్జింగ్ అయిపోయింది. దీంతో ఫ్రెంచి ప్రభుత్వం సైడ్ స్కాన్ సోనార్ సెన్సర్లు ఉన్న జలాంతర్గాములతో సముద్రం అడుగున 5 కి.మీ లోతున, 20 కిమీ ప్రాంతంలో అన్వేషణ జరిపించింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానం తాలూకు బ్లాక్ బాక్స్ రెండేళ్ల తరువాత దొరికింది. ఎం హెచ్ 370 విషయంలోనూ అదే జరుగుతుందా అన్నదే అసలు ప్రశ్న!