అవి మలేషియా విమాన శకలాలేనా?
మలేషియా విమానం ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో కుప్పకూలిపోయిందనడానికి మరిన్ని ఆధారాలు దొరికాయి. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు తమ ఉపగ్రహ చిత్రాలలో ఆస్ట్రేలియాకి దాదాపు 2500 కి.మీ దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో సముద్రంలో పలు శకలాలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ చిత్రాలను వారు మలేషియా ప్రభుత్వపు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందచేశారు.
ఈ ఉపగ్రహ చిత్రాల్లో దాదాపు 122 వస్తువులు కనిపించాయి. ఇందులో కొన్ని వస్తువులు దాదాపు 23 మీటర్ల పొడవున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మలేషియన్ ప్రభుత్వం దక్షిణ హిందూ మహాసముద్రంలోనే విమానం కుప్పకూలినట్టు ప్రకటించింది.
మరో వైపు సముద్రంలో జాడ తెలియకుండా పోయిన విమానం తాలూకు బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ ను కనుగొనేందుకు అమెరికా నుంచి నిపుణులు మలేషియా వచ్చారు. మామూలుగా బ్లాక్ బాక్సులు 30 రోజుల వరకూ పనిచేస్తాయి. వాటి బ్యాటరీల చార్జింగ్ అప్పటి వరకూ పనిచేస్తుంది. వాటికి అండర్ వాటర్ లోకేటర్ బీకన్లు అమర్చి ఉంటాయి. ఇవి నీటి అట్టడుగున 14000 అడుగుల లోతున ఉన్నా సందేశాలు పంపగలుగుతాయి. అయితే ఇప్పటికే విమానం నీట మునిగి 17 రోజుల, 13 గంటల, 49 నిమిషాలు అయింది. అంటే ఇంకా పదకొండు రోజుల్లో బ్లాక్ బాక్సును కనుగొనలేకపోతే అది శాశ్వతంగా దొరకకుండా పోతుందన్నమాట.
ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా బ్లాక్ బాక్సులో విమాన ప్రయాణ కాలంలో కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను రికార్డు చేస్తాయి. దీని ఆధారంగా అసలేం జరిగిందో అంచనా వేయడానికి వీలుంటుంది.