విమాన శకలాల అన్వేషణలో ఆలస్యం ఎందుకు?
సముద్రంలో కుప్పకూలిన మలేషియన్ విమానం శకలాల కోసం అన్వేషణ ఎందుకింత సమస్యగా మారింది? ఎందుకు ప్రతి రోజూ శకలాలు ఇక్కడ కనిపించాయి, అక్కడ కనిపించాయి అని వార్తలు వస్తున్నాయి? ప్రతి రోజూ ఉపగ్రహ చిత్రాలు కొత్త కథలు చెబుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.
దీనికి ప్రధాన కారణం విమానం మునిగిన చోటు.
దక్షిణ హిందూ మహాసముద్రం, ముఖ్యంగా ఆస్ట్రేలియాకి దగ్గరలోనే ఉన్న చోట చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రం చాలా అశాంతిగా ఉంటుంది. సముద్రంపై వెర్రి గాలులు వీస్తాయి. ఒకసారి అటు, ఒక సారి ఇటు వీస్తాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఈ ప్రాంతమంతా భారీ వర్షాలు కురుస్తాయి. మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ గాలులు, అలలు, వానల వల్ల ఒక రోజులో శకలాలు దాదాపు 70 కిమీ దూరం వరకూ ప్రయాణించవచ్చు.
ఒక ఏడాది పాటు శకలాలు ఇలాగే అటూ ఇటూ తేలాడుతూ ఉంటే అవి దాదాపు 2600 కిమీ ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియా వరకూ వెళ్లవచ్చునని అంచనా వేస్తున్నారు. అలాగే శకలాలు పసిఫిక్ సముద్రం వంటి ఇతర సముద్రాలకు కూడా వెళ్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుకే రోజుకో చోట విమాన శకలాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నాడు దాదాపు 75 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు ఉన్న చెక్క వంటి వస్తువు కనిపించింది. దీనికి పలు రంగుల బెల్టుల్లాంటి వి అమర్చి ఉన్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇవి సీట్ బెల్టులకు సంబంధించిన శకలం అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
అందుకే వీలైనంత త్వరగా అన్వేషణ జరిపి, శకలాలను కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.