ఎం హెచ్ 370 అన్వేషణ: నీకెంత, నాకెంత?
మలేషియన్ విమానం ఎం హెచ్ 370 సముద్రంలో కుప్పకూలి మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ దాని శకలాలు, అందులోని శవాలను కనుగొనడంలో ప్రపంచ దేశాలు విఫలం అయ్యాయి. ఇప్పటికే మిలియన్ల డాలర్లను సముద్రం పాలు చేసి దేశదేశాలు అన్వేషణ కొనసాగించాయి. ఇంకా కొనసాగాల్సి ఉంది. కాసింత విరామం ఇచ్చినా త్వరలోనే పని మొదలవుతుంది.
అయితే దీని ఖర్చులు ఎవరెవరు ఎంతెంత భరించాలన్నదే అన్వేషణలో ఉన్న దేశాల ముందున్న సమస్య. మార్చి ఎనిమిదన 239 మంది ప్రయాణికులతో జాడతెలియకుండా పోయిన విమానం మలేషియాది. కాబట్టి మలేషియా అన్వేషణలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు ఎక్కువగా చైనాదేశస్థులు. కాబట్టి చైనా కూడా అన్వేషణలో చురుకుగా పాల్గొంటోంది. ఇక ప్రమాదం జరిగిన చోటు ఆస్ట్రేలియాకి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మొత్తం అన్వేషణకు ఆస్ట్రేలియాయే నేతృత్వం వహిస్తోంది.
వచ్చే ఏడాది జులై వరకూ అన్వేషణ కొనసాగించేందుకు ఈ దేశాలన్నీ కలిసి ప్రణాళికను రూపొందించాయి. దీనికి మొత్తం 84 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఎవరెలా పంచుకోవాలన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
అన్వేషణ కొనసాగించడంలో వెనుకాడే ప్రసక్తే లేదని, అయితే భారాన్ని ఎవరెలా పంచుకుంటారన్నది కూడా ముఖ్యమని ఆస్ట్రేలియన్ అధికారులు అంటున్నారు. అందుకే లెక్కలు తే్ల్చేందుకు అన్వేషణలో పాలుపంచుకుంటున్న దేశాలు త్వరలో సమావేశం కానున్నాయి.