వివాదాస్పద చైనా నూతన మ్యాప్.. భారత్‌తో గొంతు కలిపిన పలు దేశాలు | Malaysia, Vietnam, Taiwan, Philippines follow India rejecting Chinese map - Sakshi
Sakshi News home page

చైనా నూతన మ్యాప్‌పై ఆగ్రహం.. భారత్‌ బాటలో పలు దేశాలు

Published Sat, Sep 2 2023 10:23 AM | Last Updated on Sat, Sep 2 2023 10:29 AM

malaysia taiwan philippines rejecting chinese latest map - Sakshi

భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు చైనా నూతన జాతీయ మ్యాప్‌ను తిరస్కరించాయి. చైనా ఇటీవల తన జాతీయ పటం కొత్త వెర్షన్‌ను ప్రచురించింది. దీనిలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ దేశంలోని భాగంగా చూపింది.

భారత్ తీవ్ర నిరసన 
అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను  చైనా తన మ్యాప్‌లో చూపించడంపై భారతదేశం  తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు సరిహద్దు వివాద పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని భారత్ పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ.. చైనా వాదనలను తిరస్కరించింది. అవి నిరాధారమైనవిగా పేర్కొంది. చైనా చర్యపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ ‘అసంబద్ధమైన వాదనలు చేసినంత మాత్రాన ఇతరుల భూభాగం మీది అయిపోదు’ అని అన్నారు.

మండిపడిన ఫిలిప్పీన్స్
చైనా మ్యాప్‌- 2023 వెర్షన్‌పై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మండిపడింది. చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఈ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనా సరిహద్దులు కలిగివుండటాన్ని చూపిస్తోంది. సముద్ర ప్రాంతాలపై చైనా తన సార్వభౌమాధికారంతో పాటు అధికార పరిధిని చట్టబద్ధం చేయడానికి ఈ కొత్త ప్రయత్నాలు చేస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మా తెరెసిటా దాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ గతంలోనూ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసింది. ఫిలిప్పీన్స్ 2013లో చైనా జాతీయ పటాన్ని ప్రచురించడాన్ని నిరసించింది. దీనిలో కలయాన్ దీవులు,స్ప్రాట్లీస్‌లోని కొన్ని భాగాలను చైనా తన జాతీయ సరిహద్దులుగా చూపింది. 

చైనా వాదనలు ఖండించిన మలేషియా
చైనా స్టాండర్డ్ మ్యాప్ ఎడిషన్ 2023లో దక్షిణ చైనా సముద్రంపై చైనా చేస్తున్న వాదనలకు వ్యతిరేకంగా రాతపూర్వక నోట్‌ను పంపనున్నట్లు మలేషియా ప్రభుత్వం  తెలిపింది. మలేషియా ప్రాదేశిక జలాలను కూడా కలిగి ఉన్నట్టు చైనా తన మ్యాప్‌లో చూపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలను మలేషియా గుర్తించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మ్యాప్‌పై వియత్నాం నిరసన
చైనా దుశ్చర్యలపై వియత్నాం కూడా మండిపడింది. వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫామ్ థు హాంగ్ మాట్లాడుతూ, హోంగ్ సా (పారాసెల్), ట్రూంగ్ సా (స్ప్రాట్లీ) దీవులపై వియత్నాం తన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటిస్తోందని, చైనా చేస్తున్న సముద్ర వాదనలను గట్టిగా తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.

‘తైవాన్‌ను చైనా పాలించనేలేదు’
తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చైనా నూతన ప్రామాణిక మ్యాప్‌పై మండిపడింది. తైవాన్‌ను ఎప్పుడూ చైనా పాలించలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నూతన మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. 
ఇది కూడా చదవండి: డ్రగ్స్ కాపిటల్‌గా ఫిలడెల్ఫియా.. ఫుట్‌పాత్‌లపై ‘బానిసల’ వికృత చేష్టలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement