
గల్వాన్ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో ముందు రోజు భేటీ అయ్యారు.
చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది.
ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలుసుకున్నారు.
ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్‌చోక్,డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్‌లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది.
కానీ మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి.
ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది.
ఈ ఏడాది చివరిలో ఎస్‌సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్‌లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్ వైపే నిలబడింది.
ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా, పాకిస్తాన్ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది.
ఇదిగాక అమెరికాలో ట్రంప్ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్ ఆరా తీశారు.
అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.
అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్‌సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్‌సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.
ఎస్‌సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్‌కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి.