
అమెరికా ప్రకటన
పహల్గాం దాడి వల్లే నిర్ణయం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన లష్కరే తొయిబా జేబు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్‌ఎఫ్‌ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. పహల్గాంలో 26 మందిని విచక్షణారహిత కాల్పులతో బలిగొన్న ఉగ్రవాద దాడికి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఇది జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పుట్టుకొచ్చిన లష్కరే జేబు సంస్థ. కశ్మీర్‌లో భద్రతా బలగాలపై, పౌరులపై పలు దాడులకు పాల్పడింది.
లౌకిక సంస్థ ముసుగులో మతపరమైన దాడులను కొనసాగించింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు, మద్దతు అందుతున్నాయి. పహల్గాం మారణకాండను 2008లో ముంబైలో లష్కరే జరిపిన దాడుల తర్వాత భారత్‌పై జరిగిన అత్యంత ప్రాణాంతక ఉగ్ర దాడిగా అమెరికా అభివర్ణించింది. కశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలిచే టీఆర్‌ఎఫ్ పహల్గాం ఉగ్ర దాడి తన పనేనని తొలుత ప్రకటించింది. తర్వాత ఈ దాడి కారణంగా భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంతో ప్రకటనను వెనక్కు తీసుకుంది.

స్వాగతించిన భారత్
టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా మధ్య సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టీఆర్‌ఎఫ్ కార్యకలాపాలను, దానికి నిధులను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నినాదానికి భారత్ కట్టుబడి ఉందని, ఉగ్రవాద సంస్థలు, వారి ముసుగు సంస్థలు జవాబుదారీగా ఉండేలా చేయడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి పని చేయడాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
‘టీఆర్‌ఎఫ్‌ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించినందుకు అమెరికా విదేశాంగ శాఖను, మంత్రి రూబియోకు మా అభినందనలు. ఉగ్రవాదంపై పోరులో భారత్–అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనం’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పీఓకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇది ఇరు దేశాల నడుమ సాయుధ ఘర్షణకు దారితీయడం, పాక్ విజ్ఞప్తి మేరకు చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం తెలిసిందే.