అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం.
అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది.
ఇద్రుస్‌తో పాటు పవన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం.
అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్‌దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు.
అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు..
- శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7)
- పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6)
- దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6)
- నక్రాని (ఉగాండ) (4-1-7-6)
- అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6)
- జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6)
- అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6)
- ఓబెడ్ మెక్‌కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6)
- లాంగట్ (కెన్యా) (4-1-17-6)
- ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6)
Comments
Please login to add a commentAdd a comment