2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..! | List Of Confirmed Teams For T20 World Cup 2026 In India And Sri Lanka | Sakshi
Sakshi News home page

2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..!

Published Mon, Jun 17 2024 7:14 PM | Last Updated on Mon, Jun 17 2024 7:30 PM

TEAMS QUALIFIED FOR THE T20 WORLD CUP IN 2026

భారత్‌, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్‌కప్‌ కూడా ప్రస్తుత ఎడిషన్‌ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్‌లు వివిధ రీజియనల్‌ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో సూపర్‌-8కు అర్హత సాధించిన జట్లు (భారత్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌) నేరుగా తదుపరి ఎడిషన్‌కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.

మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్‌ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్‌ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. 

ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.

ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్‌-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ తదుపరి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్‌గా 2026 టీ20 వరల్డ్‌కప్‌కు భారత్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement