కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.
గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.
గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.
గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.
పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.
మన అమ్మాయిలకు తొలి పరీక్ష
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్‌లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment