అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.
119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు.
లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్‌ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment