అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.
గాంబియా బౌలింగ్ ఊచకోత
నైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.
సికందర్ రజా ఒక్కడే 133 రన్స్
వన్‌డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు.
చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టు
ఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది.
290 పరుగుల భారీ తేడాతో విజయం
జింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో!
Comments
Please login to add a commentAdd a comment