‘డెమో’కు బ్రేక్
‘డెమో’కు బ్రేక్
Published Wed, Aug 3 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
– నంద్యాల– ఎర్రగుంట్ల మార్గం ప్రారంభంలో జాప్యం
– భారీ ఏర్పాట్ల పేరుతో ఆలస్యం
– రైల్వేస్టేషన్లలో పూర్తికాని సిగ్నల్ పనులు
కోవెలకుంట్ల:
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో డెమో రైలు ప్రారంభానికి బ్రేక్ పడింది. ఆగస్టు 2వ తేదీ నుంచి డెమో రైలు తిరగాల్సి ఉండగా రైలు మార్గం ప్రారంభోత్సవం పేరుతో జాప్యం కానుండటంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఈ మార్గంలో రైలు కూత కోసం మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. కడప జిల్లా యర్రగుంట్ల నుంచి నంద్యాల సమీపంలోని 20 కి.మీ. వరకు 123కిలో మీటర్లు ఉన్న ఈ లైన్‌లో ఐదేళ్ల క్రితమే మొదటి విడతలో ఎర్రగుంట్ల నుంచి సంజామల మండలం నొస్సం వరకు రైల్వే ట్రాక్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన రెండు విడతల్లో సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మద్దూరు వరకు ట్రాక్, ఆయా ప్రాంతాల్లో స్టేష్టన్లు, క్రాసింగ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఫేస్–1లో సంజామల మండలంలోని నొస్సం వరకు, ఫేస్ –2లో అక్కడి నుంచి పాణ్యం మండలం మద్దూరు వరకు ట్రయల్ రన్, ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు రైల్వే సేఫ్టీ కమిషనర్ డీకే సింగ్ ట్రాక్ నాణ్యతను పరిశీలించి రైళ్ల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గత నెలలో ఈ మార్గాన్ని గుంటూరు– గుంతకల్లు రైల్వే లైన్లతో అనుసంధానం చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి నంద్యాల– ప్రొద్దుటూరు మధ్య వారంలో రెండు పర్యాయాలు డెమో రైలు తిరగేలా టైంబుల్ రూపొందించారు. డెమో రైలు తర్వాత ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు కొనసాగాల్సి ఉంది. అయితే వివిధ కారణాల దష్ట్యా డెమో రైలు తిప్పడం రద్దు అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రూ. 950 కోట్లతో రైల్వేలైన్ ఏర్పాటు చేయడంతో రైల్వేలైన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న ఉద్ధేశంతో డెమోరైలు ప్రారంభానికి మరింత ఆలస్యం చేస్తున్నటు సమాచారం. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ సమస్యల కారణంగా డెమో రైలు తిరగకపోవడంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు నిరాశ చెందుతున్నారు.
Advertisement
Advertisement