నో సిగ్నల్
-
ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ ఏర్పాటయ్యేనా...
-
కాబోయే జిల్లా కేంద్రం... ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కరువు
-
పాతబస్టాండ్‌లో ట్రాఫిక్ లైట్లు లేకపోవడంతో అస్తవ్యస్తం
జగిత్యాల అర్బన్ : కాబోయే జిల్లా కేంద్రం. గ్రేడ్–1 మున్సిపాలిటీ. అయినా ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేదు. పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రధాన కేంద్రం టవర్‌సర్కిల్ నుంచి చుట్టూ మూడు కి లోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకోసం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. 1989 మాస్టర్‌ప్లాన్ ఇప్పటికీ అమలుకావడంతో ఇరుకైన రోడ్లతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన సెంటర్లు అయిన కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తా, టవర్‌సర్కిల్ సమీపంలో కూడళ్ల వద్ద కనీసం ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీచోట ట్రాఫిక్ పోలీసులను నియమించినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు మున్సిపల్ సమావేశంలో ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. గతంలో ఎమ్మెల్యే ఎల్.రమణ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అయినా అమలుకు నోచుకోలేదు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ చూపి ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.