అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్‌ | Radio Signal Space Repeats Hour | Sakshi
Sakshi News home page

అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్‌

Published Tue, Aug 13 2024 7:47 AM | Last Updated on Tue, Aug 13 2024 9:10 AM

Radio Signal Space Repeats Hour

అంతరిక్షం నుంచి వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్స్‌ శాస్త్రవేత్తలను తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారు. మరి వీటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

రేడియో సిగ్నల్స్‌ గురించి ఇప్పటికే కొన్ని సిద్దాంతాలు ఉన్నప్పటికీ, తాజాగా కనిపించిన వింత సిగ్నల్స్‌ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచాయి. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ)రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో  ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతోంది. ఈ సిగ్నల్‌ 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతోంది. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి.

దీనిపై అధ్యయనం సాగిస్తున్న డాక్టర్‌ మనీషా కాలేబ్‌ మాట్లాడుతూ ఈ రేడియో సిగ్నల్‌ మూడు విభిన్న ఉద్గార స్థితులను ప్రదర్శిస్తుండటం విచిత్రంగా ఉందని, దీని లక్షణాలు పూర్తి భిన్నంగా  ఉన్నాయని అన్నారు. దక్షిణాఫ్రికాలోని మీర్‌కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనుక ఏమి ఉందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్‌ డ్వార్ఫ్‌ నుండి  వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిగ్నల్‌కున్న విచిత్రమైన లక్షణాలు ఇప్పటివరకూ ఉ‍న్న భౌతిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి.

న్యూట్రాన్ నక్షత్రాలు, వైట్‌ డ్వార్ఫ్‌  మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి రెండూ భారీ నక్షత్రాల నుండి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. వైట్‌ డ్వార్ఫ్‌ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం. న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం . వైట్‌ డ్వార్ఫ్‌  అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాగా అంతరిక్షం నుంచి పునరావృతమయ్యే ఇటువంటి రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరడచం ఇదేమీ మొదటిసారికాదు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సిగ్నల్స్‌ను గుర్తించారు. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చినదా, లేదా అంతుచిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చినదా అనేది మరిన్ని పరిశోధనలతో వెల్లడికానుంది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా  అధ్యయనం సాగిస్తున్నారని డాక్టర్‌ మనీషా కాలేబ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement