న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది. వాట్సాప్ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో .. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాట్సాప్ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ యాప్ డౌన్‌లోడ్లు లక్షల సంఖ్యలో పెరిగాయని సిగ్నల్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ వెల్లడించారు. ఇక భారత మార్కెట్లో తమకు అంచనాలు మించిన ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
‘గడిచిన కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో వృది నమోదైంది. 40 దేశాల్లో ఐవోఎస్ యాప్ స్టోర్‌లో మాది టాప్ యాప్‌గా ఉంది. అలాగే 18 దేశాల్లో గూగుల్ ప్లేలో నంబర్ వన్‌గా నిల్చింది. ఈ రెండు సిస్టమ్స్‌లో 1 కోటి పైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. గడిచిన మూడు–నాలుగు రోజుల్లో అసాధారణ వృద్ధి, యూసేజీ కనిపిస్తోంది. ఇదేమీ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు‘ అని యాక్టన్ తెలిపారు. సరళతరమైన .. సులువైన నిబంధనలు, ప్రైవసీ పాలసీతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2009లో వాట్సాప్‌ను జాన్ కౌమ్‌తో కలిసి యాక్టన్ నెలకొల్పారు. ఆ తర్వాత వాట్సాప్‌ను కొనుగోలు చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ .. దాన్నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు అనుసరించిన విధానాలు నచ్చక యాక్టన్ బైటికొచ్చేశారు. మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి సిగ్నల్‌ను ప్రారంభించారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా యూజర్ల డేటాను పంచుకునే విధంగా పాలసీని అప్‌డేట్ చేస్తున్నామని, తమ యాప్‌ను వాడాలంటే కచ్చితంగా ఇందుకు సమ్మతించాల్సి ఉంటుందని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై చిర్రెత్తుకొచ్చిన యూజర్లు పొలోమంటూ ప్రత్యామ్నాయ యాప్స్ వైపు మళ్లుతున్నారు.
టెలిగ్రాం రయ్...
ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటినట్లు టెలిగ్రాం వెల్లడించింది. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా 2.5 కోట్ల మంది యూజర్లు చేరినట్లు వివరించింది. భారత్‌లో యూజర్ల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ .. కొత్త యూజర్లు .. ఆసియాలో అత్యధికంగా 38 శాతం మంది చేరినట్లు వెల్లడించింది. యూరప్ (27 శాతం), లాటిన్ అమెరికా (21 శాతం), మధ్య ప్రాచ్యం.. ఉత్తర ఆఫ్రికా ప్రాంతం (8 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సెన్సార్ టవర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో జనవరి 6–10 తారీఖుల మధ్య కొత్తగా 15 లక్షల మేర టెలిగ్రాం డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులో త్వరలోనే 100 కోట్ల యూజర్ల మార్కును సాధించగలమని టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘గత ఏడేళ్లలో అనేకసార్లు డౌన్‌లోడ్లు ఒకేసారిగా పెరిగిపోవడం జరిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం కాస్త భిన్నమైనది. ఉచిత సర్వీసుల కోసం తమ ప్రైవసీని పణంగా పెట్టేందుకు యూజర్లు సిద్ధంగా లేరు. ప్రారంభం నుంచీ మేం యూజర్ల వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇతర యాప్‌లలాగా ఆదాయం కోసం మేం జవాబు చెప్పుకునేందుకు టెలిగ్రాంలో షేర్‌హోల్డర్లు గానీ ప్రకటనకర్తలు గానీ లేరు. ఇప్పటిదాకా మా యూజర్ల వ్యక్తిగత డేటా ఏదీ కూడా ఎవరికీ వెల్లడించలేదు‘ అని దురోవ్ పేర్కొన్నారు.
ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం!
Published Thu, Jan 14 2021 6:13 AM | Last Updated on Thu, Jan 14 2021 2:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment