సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన భద్రాద్రి ప్లాంట్ పైలాన్
- - కమిటీ నివేదిక నిర్మాణానికి అనుకూలం
- - అనుమతుల మంజూరుకు కేంద్ర మంత్రిత్వశాఖ కసరత్తు
- - పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా కాంట్రాక్టర్లు
- - ఆనందంలో నిర్వాసిత యువత
- కమిటీ నివేదిక అనుకూలం
- అనుమతులు మంజూరు చేయనున్న కేంద్రం!
- సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు
- నిర్వాసిత యువతలో హర్షాతిరేకం
పినపాక : ఆర్నెల్లుగా ఆగిపోయిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ కొనసాగనుంది. దీనికి అనుకూలంగా గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కమిటీ నివేదిక సమర్పించింది. కేవలం 30 శాతం మాత్రమే పర్యావరణానికి హాని జరుగుతున్నట్లు.. మిగిలిన 70 శాతం ఎటువంటి ముప్పులేదని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ అనుమతులతో కాంట్రాక్టర్లు, కూలీలు పనులకు సిద్ధమవుతుండగా... నిర్వాసిత నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పినపాక, మణుగూరు మండలాల సరిహద్దు ఉప్పాక పంచాయతీ సీతారాంపురం వద్ద తలపెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆర్నెల్లుగా నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా కమిటీ నివేదిక సమర్పించినట్లు తేలడంతో ప్రభావిత గ్రామాల్లో యువత హర్షం వెలిబుచ్చుతోంది. రెండు మండలాల సరిహద్దులో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఒకే ప్రాంతంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. భూసేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం, నిర్వాసిత యువతకు ఐటీఐలో శిక్షణ తదితర కార్యకలాపాలు చకచకా సాగిపోయాయి. పవర్‌ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని, గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు దాఖలు కావడంతో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు 6 నెలల క్రితం ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పలు సందర్భాల్లో పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నియమించిన కమిటీ సందర్శించింది. ఈ కమిటీ సభ్యులు పలు దఫాలు పవర్‌ప్రాజెక్టు నిర్మాణప్రాంతంలో చేసిన పనులు, తీసుకున్న జాగ్రత్తలు, పర్యావరణానికి కలిగే నష్టం తదితర అంశాలపై అధ్యయనం చేశారు.
భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి వాటిల్లే నష్టం చాలా తక్కువని కమిటీ నివేదికలో పేర్కొనట్లు సమాచారం. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు సీఆర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులు భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం జరిగే సుమారు 200 ఎకరాలను పరిశీలించారు. ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న జల వనరులు, వాటికి కలిగే నష్టం, ప్రాజెక్టు నిర్మిస్తే వెలువడే కాలుష్యం తదితర అంశాలపై కమిటీ సభ్యులు లోతుగా పరిశీలన చేశారు. దీని ప్రకారం పర్యావరణానికి పెద్దగా ముప్పు వాటిల్లదని నిర్ధారించినట్లు సమాచారం. కమిటీ కాలపరిమితి కేవలం 8 వారాలు మాత్రమే ఉండటంతో నివేదిక సమర్పించడానికి కాస్త ఆలస్యమైంది. కాలపరిమితి ముగిసిందనే పేరుతో వెంటనే నూతన కమిటీని నియమించినట్లు తెలిసింది. పాత కమిటీ సేకరించిన సమాచారం ఆధారంగా నూతన కమిటీ కేంద్రమంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.
భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ ప్రాంతంలో పర్యటించి సేకరించిన సమాచారం ఆధారంగా కమిటీ అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పలు దఫాలు కేంద్రమంత్రులను కలిసినట్లు వినికిడి. నూతన కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే అనుమతులు రాన్నుట్లు ఇప్పటికే రాష్ట్రమంత్రులు బహిరంగ సభల్లో కూడా ప్రకటించారు.
పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆర్నెల్లుగా ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు, కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. కమిటీ నివేదిక అనుకూలంగా ఉందని, అనుమతులు వస్తాయని తెలియడంతో కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టేందుకు కార్యాచరణ తయారు చేసుకుంటున్నారు. కూలీల సేకరణ, యంత్రాల మరమ్మతులు చేసుకుంటున్నారు. అధికారికంగా అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు మైనర్ పనులు చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరవుతాయనే సమాచారంతో నిర్వాసిత యువత హర్షం వ్యక్తం చేస్తోంది. పవర్‌ప్లాంట్ పరిధిలో సుమారు 350 మంది నిర్వాసిత యువత భూములు కోల్పోయింది. ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పిస్తామనడంతో మణుగూరు, కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిన తర్వాత వారంతా ఆందోళనలో పడ్డారు. అనుమతులు వస్తాయనే సమాచారంతో వారిలో ఆనందం తొణికిసలాడుతోంది. తాజా కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.