ఫేస్ బుక్ మెసెంజర్ కొత్త ఫీచర్
ఫేస్ బుక్ తన మెసెంజర్ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం తన మెసెంజర్ యాప్ లో డిజిటల్ సంభాషణలను హ్యాకింగ్ బారి నుంచి కాపాడటానికి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. 900మిలియన్ యూజర్లున్న ఈ మెసెంజర్ యాప్ కు లిమిటెడ్ గా టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ఫేస్ బుక్ వెల్లడించింది. మెసేజింగ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తన వాట్సాప్ యాప్ కు మూడు నెలల క్రితమే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రవేశపెట్టింది. 100 కోట్ల మంది యూజర్లున్న ఈ ఈ వాట్పాప్ యాప్ ను 2014లో ఫేస్ బుక్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఎన్క్రిప్టెడ్ సంభాషణ యూజర్లు పంపించే వీడియోలకు, పేమెంట్లకు వర్తించదని ఫేస్ బుక్ తెలిపింది. వాట్సాప్ కు వాడిన ఎన్ క్రిప్షన్ టెక్నాలజీనే ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా వాడనుంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్ మెసేజ్ లు ఎన్క్రిప్టెడ్ అవుతాయి. అదనపు భద్రతా రక్షణతో మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
డిజిటల్ కమ్యూనికేషన్లో జరిగే ఈ గూఢచర్య సంభాషణలు చట్టాలకు సహకరించాలని ప్రభుత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ వల్ల ఉగ్రవాద చర్యలు పెరిగే అవకాశముందంటున్నారు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంటాయి. యాపిల్ ఇంక్ ఐమెసేజింగ్ ప్లాట్ ఫాంలకు, లైన్, సిగ్నల్, వైబర్, టెలిగ్రాం వంటి ఇతర యాప్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి.